నాడు సముద్ర గర్భంలో.. నేడు అంతరిక్షాన!

సెప్టెంబరు 11, 2001.. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం భవనాలపై ఉగ్రదాడి జరిగిన రోజు... వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఆ భయంకర దృశ్యాల్ని టీవీలో చూసి చలించిపోయింది 14 ఏళ్ల కేలా.

Published : 21 Mar 2022 02:16 IST

సెప్టెంబరు 11, 2001.. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం భవనాలపై ఉగ్రదాడి జరిగిన రోజు... వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఆ భయంకర దృశ్యాల్ని టీవీలో చూసి చలించిపోయింది 14 ఏళ్ల కేలా. దేశ రక్షణకంటే ఏదీ ముఖ్యం కాదనుకుని అమెరికా నౌకాదళంలో చేరింది. ఆపైన ఆస్ట్రొనాట్‌గానూ మారి తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లి స్పేస్‌వాక్‌ చేసింది కూడా!

కేలా బ్యారన్‌ అమెరికా నౌకాదళంలో సబ్‌మెరీన్‌ వార్‌ఫేర్‌ ఆఫీసర్‌. ఆస్ట్రొనాట్‌ కూడా అయిన ఓ నేవీ మహిళా ఉద్యోగిని 2014లో కలిసినపుడు జలాంతర్గామి, అంతరిక్ష కేంద్రాల మధ్య సారూప్యతల గురించి చర్చించుకున్నారిద్దరూ. అంతరిక్షంలోకి వెళ్లాలనే ఆలోచన అప్పుడే వచ్చింది కేలాకి. ఆమె మనసులోని మాటని గ్రహించిన పై అధికారి.. ‘నువ్వు సాధించగలవు’ అన్నారు. పరీక్షల్లో మెరిట్‌తోపాటు శారీరక, మానసిక దృఢత్వం చూపడంతో 2017లో నాసా ఆస్ట్రొనాట్‌ శిక్షణకు ఎంపికైంది కేలా. రెండేళ్ల కఠోర శిక్షణ తర్వాత అంతరిక్ష యాత్రకు అనుమతి పొందింది. నవంబరులో రాజాచారి, కేలాలతోపాటు మరో ఇద్దరు వ్యోమగాములతో కూడిన బృందం ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టింది. ఆర్నెల్లు అక్కడ ఉంటుందీ బృందం. తాజాగా రాజాచారితో కలిసి స్పేస్‌వాక్‌ చేస్తూ ఐఎస్‌ఎస్‌లో సౌరశక్తి వినియోగానికి అవసరమైన సోలార్‌ ప్యానెళ్లను అమర్చింది. 34 ఏళ్ల కేలా ఐఎస్‌ఎస్‌లో రకరకాల పరిశోధనలు చేస్తోంది కూడా. వాటిలో అంతరిక్షంలో నీటి పునర్వినియోగం, ఆక్సిజన్‌ లభ్యత, వ్యోమగాముల ఆరోగ్యం లాంటివీ ఉన్నాయి. ఈ పరిశోధనలన్నీ ఎందుకంటే.. చంద్రుడిపైకి మనుషుల్ని పంపే నాసా ప్రాజెక్ట్‌ ‘ఆర్టెమిస్‌’లో కూడా కేలా సభ్యురాలు. ఈ పరిశోధనల సమాచారాన్ని ఆర్టెమిస్‌ బృందంతో పంచుకుని ఆ ప్రాజెక్టుకి ఉపయోగపడేలా చేస్తానంటోంది. ప్రపంచ వాణిజ్య కేంద్రంపైన ఉగ్ర దాడి సంఘటన ఆమెను బాగా కదిలించింది. అప్పుడే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకుంది. తర్వాత నావల్‌ అకాడమీలో చేరి కంట్రోల్‌ సిస్టమ్‌, రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ఆపైన కేంబ్రిడ్జి నుంచి న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ కూడా చేసి 2010లో నేవీలో చేరింది. సబ్‌మెరీన్‌ వార్‌ఫేర్‌ ఆఫీసర్‌గా సముద్రం లోపల నెలలపాటు విధులు నిర్వహించిన కేలా ఇప్పుడు అంతరిక్షంలో విహరిస్తోంది. అమ్మాయిలకు ఏదీ అసాధ్యం కాదని నిరూపించడం తనకు ఇష్టమని చెప్పే కేలా... ఐఎస్‌ఎస్‌ విశేషాల్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్