చివరి మజిలీలో.. నేనున్నానంటూ!

‘నేను పోతే.. నువ్వే తలకొరివి పెట్టాలి..’ అని ఆ అమ్మాయి దగ్గర మాట తీసుకుంది శ్యామలమ్మ. మాట ఇవ్వకపోయినా 65 ఏళ్ల సుజాత చనిపోయినప్పుడూ అఫ్రీన్‌ ముందుకొచ్చి వాళ్లకి తలకొరివి పెట్టింది. ఇంతకీ వాళ్లకీ, ఆమెకీ సంబంధం ఏంటి?

Updated : 23 Mar 2022 05:43 IST

‘నేను పోతే.. నువ్వే తలకొరివి పెట్టాలి..’ అని ఆ అమ్మాయి దగ్గర మాట తీసుకుంది శ్యామలమ్మ. మాట ఇవ్వకపోయినా 65 ఏళ్ల సుజాత చనిపోయినప్పుడూ అఫ్రీన్‌ ముందుకొచ్చి వాళ్లకి తలకొరివి పెట్టింది. ఇంతకీ వాళ్లకీ, ఆమెకీ సంబంధం ఏంటి?

ఇరవయ్యేళ్ల అఫ్రీన్‌ పర్వేజ్‌కీ వాళ్లకీ ఏ రక్త సంబంధమూ లేదు. అయినా వాళ్ల కోరిక తీర్చింది. మతం కన్నా మానవత్వమే గొప్పదని నమ్మిందా అమ్మాయి. ఆ నమ్మకం తనకు కన్నవాళ్ల నుంచి అందిన వారసత్వం. అఫ్రీన్‌ వాళ్లది హనుమకొండ జిల్లా కాజీపేట. అమ్మానాన్నలు యాకూబీ, మహబూబ్‌అలీలు తను మూడో తరగతి చదువుతున్నప్పుడు సహృదయ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నతనం నుంచీ అమ్మానాన్నలు పెద్దవాళ్లకు చేసే సపర్యలు గమనించేది. కొంతమంది వాళ్ల తల్లిదండ్రులను ఇక్కడ వదిలి వెళ్లిపోయేవారు. వాళ్లు చనిపోతే కడసారి చూసేందుకు కూడా వచ్చేవారు కాదు. మృతులకు వారి మతాచారం ప్రకారం అంత్యక్రియల్ని చేయాల్సి వచ్చినప్పుడు ఎవరూ లేకపోతే యాకూబీనే చేసేది. అనాథ శవాల ఖననానికి అమ్మానాన్నలతోపాటు తమ్ముడు, తనూ వెళ్లిన సందర్భాలు ఎన్నో. తల్లికి చేదోడుగా ఆశ్రమంలో అఫ్రీన్‌ వంటలు చేస్తూ.. 50, 60 మంది వృద్ధులకు సపర్యలు చేస్తుంది. ఆ పెద్ద వాళ్లందరికీ కన్నబిడ్డలా మెలుగుతోంది. అందుకే చాలా మంది వారి అంత్యక్రియలు ఈ అమ్మాయి చేతుల మీదుగా జరగాలని మాట తీసుకుంటారు. తనూ వారి కోరికను నెరవేరుస్తూ ఉంటుంది. ఈ మధ్యే బీడీఎస్‌ సీటు కూడా సంపాదించిందీ సేవాదీప్తి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్