Updated : 26/03/2022 03:36 IST

ప్రీతి కవిత... మెచ్చారంతా!

ప్రకృతి రమణీయతనీ, సామాన్యుడి జీవన పోరాటాన్నీ అంశాలుగా తీసుకుని ఎంతో సహజంగా కవితలు రాస్తోంది తోట ప్రీతి. అది కూడా అందరూ క్లిష్టంగా భావించే ఆంగ్ల భాషలో. సరికొత్త భావుకతను జోడిస్తూ రెండు పదుల వయసులోనే జీవితసారాన్ని కవితల్లో చెబుతోందీమె. తన కవితల్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ, పుస్తకాలుగా తెస్తూ స్వల్ప వ్యవధిలోనే దేశవిదేశాల్లో అభిమానుల్ని సంపాదించుకుందీ అమ్మాయి.

రీంనగర్‌కు చెందిన ప్రీతి.. ప్రభుత్వ ఎస్‌.ఆర్‌.ఆర్‌. పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ జువాలజీ చదువుతోంది. స్కూల్‌ రోజుల నుంచీ ఆంగ్లభాషపై ఉన్న మక్కువతో కవితలు రాసేది. ఈమె సొంతూరు జగిత్యాల. నాన్న విజయ్‌కుమార్‌ బ్యాంకు ఉద్యోగి. అమ్మ సౌజన్య. జగిత్యాల మౌంట్‌ కార్నెల్‌ స్కూల్లో పది వరకూ చదివింది. ఆరో తరగతిలో ఉన్నప్పట్నుంచీ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆంగ్ల పదాలూ, వ్యాకరణంపై శ్రద్ధపెట్టి నేర్చుకునేది. అప్పుడే కవితలూ రాసేలా ప్రోత్సహించారు గురువు సాయికృష్ణ. అవి పాఠశాల పత్రికలోనూ ప్రచురితమయ్యేవి. అప్పట్నుంచీ తన రచనాశైలిని మెరుగుపర్చుకుంటూ వచ్చింది ప్రీతి. మొదట్లో ‘రిచర్డ్స్‌’ పేరుతో కవితలు రాసేది. ఇంటర్‌కు వచ్చాక ‘ప్రీతి రిచర్డ్స్‌’ కలం పేరుతో రాస్తూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం ప్రారంభించింది. ‘మనసులోని భావాలకు అప్పటికప్పుడు అక్షర రూపం ఇచ్చే సౌలభ్యం కవిత్వంలో ఉంటుంది. నా జీవితంలో, చుట్టూ ఉండే వ్యక్తుల జీవితాల్లో సంఘటనలే నా రచనలకు స్ఫూర్తి. ముఖ్యంగా సామాన్యులకు రోజువారీ జీవితంలో ఉండే సందిగ్ధాలపైనా, ప్రకృతి గురించీ రాస్తుంటా. అందరికీ అర్థమయ్యేలా తేలిక పదాలతో రాయడానికే ఇష్టపడతా’ అంటుంది ప్రీతి. ఎంత ఎక్కువగా సాహిత్యాన్ని చదువుతూ ఉంటే అంత సహజమైన భావ వ్యక్తీకరణ ఏర్పడుతుందంటుంది. ప్రీతి... ఇష్టంగా చదవడం వల్లనే ఆంగ్ల భాష కష్టంగా అనిపించదంటుంది. తన కవితల్ని మొదటిసారిగా 2019లో ‘నేక్డ్‌ లవ్‌’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చింది. 2020లో వివిధ దేశాలకు చెందిన 24 మంది యువ కవులు ‘పెటల్స్‌’ పేరుతో తెచ్చిన కవితా సంకలనంలో ప్రీతి కవితలకూ చోటు దక్కింది. గతేడాది ‘సోలటరీ సోల్‌’ పేరుతో పుస్తకం తెచ్చిన ప్రీతి.. త్వరలో ‘సింగ్స్‌ పోయెట్రీ’ పేరుతో మరో పుస్తకాన్ని తేనుంది. ఆంగ్ల కవిత్వం తన అభిరుచి అనీ, జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ తన లక్ష్యమనీ చెబుతోంది. తన కవితలు కొద్దిమందినైనా ప్రభావితం చేస్తే సంతోషిస్తానంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని