ఆ పిల్లికోసం పోరాడుతోంది!

అవి చూడ్డానికి అచ్చంగా మనం ఇళ్ల దగ్గర చూసే పిల్లుల్లానే ఉన్నా.. ఇవి అరుదైన అడవి పిల్లులు. చేపల్ని పట్టే ఈ పిల్లుల గురించి భవిష్యత్తులో చెప్పుకొనేవాళ్లే కానీ చూసిన వాళ్లు ఉండరేమో అని భయపడింది 35 ఏళ్ల తియాసా. అందుకే ‘ఫిషింగ్‌ క్యాట్‌ ప్రాజెక్ట్‌’ను స్థాపించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.

Updated : 26 Mar 2022 04:37 IST

అవి చూడ్డానికి అచ్చంగా మనం ఇళ్ల దగ్గర చూసే పిల్లుల్లానే ఉన్నా.. ఇవి అరుదైన అడవి పిల్లులు. చేపల్ని పట్టే ఈ పిల్లుల గురించి భవిష్యత్తులో చెప్పుకొనేవాళ్లే కానీ చూసిన వాళ్లు ఉండరేమో అని భయపడింది 35 ఏళ్ల తియాసా. అందుకే ‘ఫిషింగ్‌ క్యాట్‌ ప్రాజెక్ట్‌’ను స్థాపించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఫలితమే అంతర్జాతీయ ‘ఫ్యూచర్‌ ఫర్‌ నేచర్‌’ అవార్డునీ,. రూ.42 లక్షల నగదునీ అందుకుంది..

ప్రకృతిలో కనుమరుగవుతున్న జంతువుల గురించి తియాసా డిగ్రీలో తెలుసుకుంది. ఆ సమయంలోనే చేపలను వేటాడే ఫిషింగ్‌ క్యాట్‌పై ఆమె దృష్టి పడి వాటిపై అధ్యయనం ప్రారంభించింది. తియాసా సొంతూరు కోల్‌కతా. జంతుశాస్త్రంలో డిగ్రీ చేసి, బెంగళూరులో ట్రాన్స్‌ డిసిప్లినరీ హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీలో పరిశోధకురాలిగా చేరింది. అందులో భాగంగానే 2010లో ‘ఫిషింగ్‌ క్యాట్‌ ప్రాజెక్ట్‌’ను ప్రారంభించి... స్థానికులకు ఈ జాతిని కాపాడుకోవడంపై అవగాహన పెంచుతోంది. ‘మామూలు పిల్లులతో పోలిస్తే ఫిషింగ్‌ క్యాట్‌లు రెట్టింపు బరువు ఉంటాయి. ఇవి చిత్తడి నేలల్లో పెరుగుతాయి. అనేక కారణాలతో ప్రస్తుతం ఇవి కనుమరుగవుతున్నాయి. కొన్ని దేశాల్లో వీటి జాడే లేదు. మనదేశంలో కాస్త నయం. ఒడిశాలోని చిల్కా సరస్సు ప్రాంతంలో ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం అక్కడా వీటి ఆనవాళ్లు కనపడకుండా పోతున్నాయని తెలిసి అక్కడే ఉండి చాలారోజులు పరిశోధన చేశా. ఈ జాతి కనుమరుగు కావడానికి కారణం ..ఇవి నివసించే చిత్తడి నేలలన్నింటినీ మనుషులు ఆక్రమించేయడమే. వీటిని చంపినవాళ్లకి మూడు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.30వేలు జరిమానా ఉందని తెలిసినా యదేచ్ఛగా చంపుతూనే ఉన్నారు. ఎలా అయినా వీటిని రక్షించాలని అనుకున్నా. అందుకే రోజంతా వాటి కోసం కాచుకుని ఆ డేటా సేకరించేదాన్ని. ఆ సమయంలో ఎన్నో భయంకరమైన అడవి కీటకాల బారిన పడాల్సి వచ్చింది. ఒక్కోసారి వారం రోజులు ఎదురుచూసినా ఫిషింగ్‌ క్యాట్‌లు కనిపించేవి కావు. అయినా నిరుత్సాహపడేదాన్ని కాదు. కొన్నిసార్లు ఇవి చచ్చిపడి కనిపించేవి.అలాంటప్పుడు నా మనసంతా దిగులుగా అనిపించేది. ఎందుకు ఈ జాతిపై నీకింత ఆసక్తి అని చాలామంది అడుగుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం పిల్లి జాతులు 40 రకాలున్నాయి. ప్రస్తుతం చాలా వరకు కనుమరుగుకాగా, మిగిలిన వాటిని సంరక్షించడం కోసమే మా ప్రాజెక్టు పనిచేస్తోంది. ఫిషింగ్‌ క్యాట్‌ కన్జర్వేషన్‌ అలియన్స్‌ పేరుతో మా ప్రాజెక్టు నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర ఎనిమిది దేశాల్లో పనిచేస్తోంది. మరో 13 ప్రాజెక్టుల కోసం కూడా మా సహకారాన్ని అందిస్తున్నాం. ఉన్న కొన్నింటినైనా కాపాడుకోలేకపోతే  రేపటితరానికి ఈజాతి పిల్లి ఒకటి ఉండేదని బొమ్మల్లో మాత్రమే చూపించి చెప్పాల్సి వస్తుంది’ అని బాధపడుతోంది తియాసా. ప్రపంచవ్యాప్తంగా ఏటా ముగ్గురికి మాత్రమే అందించే ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును మన దేశం నుంచి అందుకున్న మొదటి వ్యక్తి తియాసా. ప్రపంచ వ్యాప్తంగా వేలమంది ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోగా చివర వడపోతలో 750 మంది ఎంపికయ్యారు. వీరి నుంచి తియాసాతో సహా మరో ఇద్దరిని ఎంపిక చేశారు. ఈ ఏడాది మే 13న నెదర్లాండ్స్‌లో ఈ అవార్డును అందుకోనుంది తియాసా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్