చనుబాల నగలతో కోట్ల వ్యాపారం

అమ్మకీ, బిడ్డకీ అత్యంత సాన్నిహిత్యం ఉండేది చనుబాలిచ్చే దశలోనే! ఆ జ్ఞాపకాలు ఆమెకే సొంతం. వాటిని మరింత ప్రత్యేకం చేయాలనుకుంది సఫియా రియాద్‌. ఫలితమే తల్లిపాలతో చేసిన నగలు.

Published : 29 Mar 2022 01:22 IST

అమ్మకీ, బిడ్డకీ అత్యంత సాన్నిహిత్యం ఉండేది చనుబాలిచ్చే దశలోనే! ఆ జ్ఞాపకాలు ఆమెకే సొంతం. వాటిని మరింత ప్రత్యేకం చేయాలనుకుంది సఫియా రియాద్‌. ఫలితమే తల్లిపాలతో చేసిన నగలు. వీటితో అంతర్జాతీయ గుర్తింపుతోపాటు కోట్ల వ్యాపారమూ చేస్తోందీమె.

ఫియాకి సాంకేతిక రంగంలో ఏళ్ల అనుభవముంది. ప్రముఖ సంస్థలకు టీమ్‌లీడ్‌గానూ చేసింది. ఎన్నో పురస్కారాలనూ అందుకుంది. కానీ ఇవేమీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి, వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 2019లో భర్త అదామ్‌ రియాద్‌తో కలిసి మెజెంటా ఫ్లవర్స్‌ ప్రారంభించింది. ప్రత్యేక రోజులను మరింత ప్రత్యేకంగా చేసివ్వడమనే ఆలోచనతో దీన్ని ప్రారంభించింది. పెళ్లిళ్లు, ఇష్టమైన వారికి మనసులో మాట చెప్పినపుడు ఇలా చాలా సందర్భాల్లో పూలదే ప్రత్యేక స్థానం. కానీ వాటి జీవితకాలం మహా అయితే రెండు రోజులు. వాటిని పాడవకుండా, భద్రపరిచి ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. వాటిని వినియోగదారుల కోరిక మేరకు నగలు, గృహాలంకరణ సామగ్రిగానూ మలిచేది. వేడుకలకు ప్రత్యేక అలంకరణ వస్తువులనూ రూపొందించేది. రెండేళ్లలోనే అంతర్జాతీయ సంస్థలెన్నింటికో సేవలందించడంతోపాటు ఎన్నో పురస్కారాలనూ అందుకుంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. ఓసారి చనుబాలతో చేసిన నగల గురించి వింది. ఆసక్తికరంగా అనిపించి ప్రయత్నించింది. దీనికీ విపరీతమైన ఆదరణ వచ్చింది.

‘పిల్లల పెరుగుదలలో ప్రతి విషయమూ అమూల్యమే. కానీ పాలిచ్చే సమయం మాత్రం ప్రత్యేకం. బిడ్డకీ, తల్లికీ అతి సన్నిహిత తరుణమిది. మా చిన్నబిడ్డకి ఎక్కువ కాలం పాలివ్వలేకపోయా. పాలను దాయొచ్చన్న విషయం నాకు అప్పటికి తెలీదు. తెలిశాక చాలా బాధపడ్డా. ఇంకా పిల్లల నెలవారీ, ఏళ్లవారీ ఎదుగుదలను గుర్తు చేసుకోవడానికి ఫొటోలుంటాయి. కానీ స్తన్యాన్ని అందించే ప్రక్రియకు మాత్రం ప్రత్యేక జ్ఞాపకమంటూ ఉండదు. ఆ దశ దాటినప్పుడు ఏదో కోల్పోయానన్న భావన. నాలాగే ఎంతోమంది ఇలానే ఆలోచిస్తుండటం గమనించా. అందుకే తల్లిపాలతో నగల తయారీ మొదలుపెట్టా. ఎన్నో వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు చేయగలిగా. ముందు పాలను డీహైడ్రేట్‌ చేసి, దానికి పసుపు రంగులోకి మారని రెజిన్‌ని కలిపి నగలుగా రూపొందించా. ఏళ్లు గడిచినా వాటిలో ఏ మార్పూ రాదు కూడా. జుంకీలు, ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు, పెండెంట్‌లు... ఇలా కోరిన విధంగా చేసిస్తున్నాం. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆదరణ వచ్చింది. కొద్దినెలల్లోనే వ్యాపారం 480 శాతం పెరిగింది. వచ్చే ఏడాదికి వార్షికాదాయం రూ.పది కోట్లకు చేరుకుంటుంది. స్తన్యాన్ని అందించే సమయంలో ఇబ్బంది పడ్డవారూ, పిల్లల్ని కోల్పోయిన తల్లులు, ఈ సమయాన్ని మరపురాని అనుభూతిగా మలచుకోవాలనుకునే వారు.. ఎంతోమంది నా సేవల్ని వినియోగించుకుంటున్నారు’ అంటోంది సఫియా. తల్లీపిల్లల బంధాన్ని గుర్తుచేసుకునే వీలు కల్పిస్తూనే.. వ్యాపారపరంగానూ వృద్ధి చెందడం చాలా ఆనందంగా అనిపిస్తోందంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్