అమ్మ మాట కోసం... ఏడంకెల జీతం

ఐఐటీలో చదవడం ఆ అమ్మాయి కల. కానీ కుదరలేదు. దీంతో ఐఐటియన్లకు దీటుగా రాణించాలనుకుంది. అలా స్థిరపడతానని వాళ్లమ్మకి మాటిచ్చింది. అమ్మ లేకపోయినా.. అంతర్జాతీయ సంస్థలో 44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి,

Updated : 31 Mar 2022 01:57 IST

ఐఐటీలో చదవడం ఆ అమ్మాయి కల. కానీ కుదరలేదు. దీంతో ఐఐటియన్లకు దీటుగా రాణించాలనుకుంది. అలా స్థిరపడతానని వాళ్లమ్మకి మాటిచ్చింది. అమ్మ లేకపోయినా.. అంతర్జాతీయ సంస్థలో 44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి, మాట నిలబెట్టుకుంది మెతుకు హర్షిత.

‘పెద్ద చదువులు చదివి.. మంచి ఉద్యోగం సాధిస్తేనే సమాజంలో గుర్తింపు, గౌరవం’ అన్న అమ్మ మాటలు హర్షిత మనసులో బలంగా నాటుకుపోయాయి. కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక తన అమ్మా నాన్న పెద్దగా చదువుకోలేకపోయారు. అందుకని పిల్లల్ని బాగా చదివించి వాళ్ల కల నెరవేర్చుకోవాలనుకున్నారు. హర్షితా వాళ్లది చిత్తూరు జిల్లా చౌడేపల్లె. నాన్న రవీంద్రనాథ్‌ వ్యాపారి, అమ్మ లావణ్య. పదో తరగతి వరకూ అమ్మే దగ్గరుండి చదివించేది. ఆమెకేమో హర్షిత పెద్ద ఉద్యోగంలో చేరితే చూడాలన్నది కల. ఐఐటీలో సీటు సాధించాలన్న లక్ష్యం నెరవేరలేదు. అయినా దిగులు పడలేదు. ‘ఐఐటీలో చదివిన వారికి వచ్చిన ప్యాకేజీనే సంపాదిస్తా’నని అమ్మకు మాటిచ్చింది. ఎంసెట్‌లో 5588 ర్యాంకు వచ్చింది. పులివెందుల జేఎన్‌టీయూలో ఈసీఈలో ఉచిత సీటు వచ్చింది. మొదటి సెమిస్టర్‌ నుంచే లక్ష్యంపై గురిపెట్టింది. ఈమె అన్న ప్రీతమ్‌ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి. తన సూచనల మేరకు కోడింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌లపై దృష్టిపెట్టింది. నేర్చుకున్నవి రోజూ సాధన చేసేది. ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా అన్న సూచనలతో సిద్ధమైంది. క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు ప్రయత్నించింది. టీసీఎస్‌, కెల్టన్‌టెక్‌ సహా ఇంకో రెండు బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలొచ్చాయి. అవేమీ సంతృప్తినివ్వలేదు. ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ప్రయత్నించింది. సుమారు రెండు వేల మంది పోటీపడగా 15 మంది ఎంపికయ్యారు. వారిలో హర్షిత కూడా ఉంది. రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఎంపికైంది. కానీ ఇదంతా చూడటానికి ఇప్పుడు వాళ్లమ్మ లేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆమె మరణించారు. ఆ సమయంలో హర్షితకు మూడో ఏడాది పరీక్షలు. అమ్మకిచ్చిన మాట నెరవేర్చాలన్న పట్టుదలతో దుఃఖాన్ని దిగమింగుకుంటూనే పరీక్షలు రాసింది. అదే లక్ష్యంతో అమెజాన్‌కీ ప్రయత్నించింది. ‘అమ్మ ప్రోత్సాహంతో చదివిన నేను.. ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అందుకు ఆనందంగా ఉంది. కానీ.. నా విజయాన్ని తను చూడలేకపోయిందన్న బాధా ఉంది’ అంటోంది హర్షిత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్