బడి మానేసినా బతుకు భరోసానిస్తోంది..

ఎవరి జీవితాన్ని వాళ్లు చూసుకుంటే పెద్దగా చదువుకోని వాళ్ల పరిస్థితి ఏంటా అని ఆలోచించిందా అమ్మాయి. అందుకే ఓ అరుదైన రంగంలోకి ప్రవేశించింది. బడి స్థాయిలోనే చదువుకు దూరమయ్యే వారికి ప్లంబింగ్‌ వంటి పనులు నేర్పి, ఉపాధి దొరికేలా చేస్తోంది.

Published : 01 Apr 2022 01:26 IST

ఎవరి జీవితాన్ని వాళ్లు చూసుకుంటే పెద్దగా చదువుకోని వాళ్ల పరిస్థితి ఏంటా అని ఆలోచించిందా అమ్మాయి. అందుకే ఓ అరుదైన రంగంలోకి ప్రవేశించింది. బడి స్థాయిలోనే చదువుకు దూరమయ్యే వారికి ప్లంబింగ్‌ వంటి పనులు నేర్పి, ఉపాధి దొరికేలా చేస్తోంది. ఇప్పుడు తన దగ్గర శిక్షణ పొందిన వందల మంది వారి కాళ్లపై వాళ్లు నిలబడగలుగుతున్నారు. నేనెంత ఎదిగానన్నది కాదు... ఎంతమందికి తోడ్పడ్డానన్నదే తృప్తి కలిగిస్తోం దంటున్న 27 ఏళ్ల శతాబ్ది శుభస్మిత స్ఫూర్తిదాయక ప్రయాణమిది...

శతాబ్ది తండ్రి పోస్టుమాస్టర్‌, తల్లి గృహిణి. వాళ్లది ఒడిశా. కూతురిని పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. వాళ్ల కలలు పండేలా శతాబ్ది సివిల్‌ ట్రేడ్‌లో డిప్లొమా తర్వాత సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు ఓ దినపత్రికలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రకటన కనిపించింది. ప్లంబింగ్‌, వైర్‌ బైండింగ్‌లో శిక్షణనివ్వడంలో ఆసక్తి ఉన్న వారిని దరఖాస్తు చేసుకోమని ఉంది. ఆ ఉద్యోగం గురించి తెలుసుకున్న శతాబ్దికి చాలా ఆసక్తి అనిపించింది. ఇలాంటి రంగంలోకి మహిళలు అడుగుపెట్టడం అతి తక్కువ. తను దీన్ని ఎంచుకోవడం అమ్మానాన్నలకు మొదట్లో కష్టమనిపించింది. అయినా తన ఆసక్తిని గమనించాక మనసుకు నచ్చిందే చేయమన్నారు. అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ‘ద ఇండియన్‌ ప్లంబింగ్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌’లో శిక్షకురాలిగా ఎంపికైంది శతాబ్ది.

శతాబ్ది

ఏకాగ్రత ఉండదు... జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో భాగంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. గ్రామీణ పేద యువతకు నైపుణ్యాలను ఇచ్చి ఉపాధికి తోడ్పడటం ఈ పథకం ముఖ్యోద్దేశం. ‘మా వద్దకు వచ్చేవారిలో పాఠశాల స్థాయిలో చదువు ఆపేసినవాళ్లే ఎక్కువ. తరగతిలో చెబుతున్న అంశంపై ఏకాగ్రత చూపించరు. అటువంటి వారికి ఆసక్తిని కలిగించి నేర్పించడం ఓ సవాలే. 35 మందిని ఓ బృందంగా చేసి తరగతులు నిర్వహిస్తుంటా. ఈ ఏడేళ్లలో 750 మందికి శిక్షణఇచ్చా. వీరికి స్థానికంగానే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఉద్యోగాలను ఇప్పించే ప్రయత్నం చేస్తుంటా. వీరిలో చాలా మంది నెలకు రూ.10 - 15 వేలు సంపాదించుకుంటూ ఉంటారు. మరి కొందరు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లంబర్స్‌గా స్థిరపడ్డారు. ఎప్పుడైనా ఎదురు పడితే వారు చెప్పే కృతజ్ఞతలు సంతోషాన్ని అందిస్తాయి. నా సహ విద్యార్థులందరూ పెద్ద పెద్ద సంస్థల్లో చేరితే, నేను ఇలా రావడం చాలా మందికి నచ్చలేదు. అయితే అమ్మానాన్న వెన్ను తట్టడం ప్రోత్సాహాన్నిచ్చింది. మన కెరియర్‌ను మనం చూసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటామేమో. కానీ చదువూ లేక ఎటూ కాని స్థితిలో ఉన్న యువత పరిస్థితి ఏంటి? అందుకే ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నా. బడి మానేసి లేదా చదివే స్థోమత లేక ఖాళీగా ఉన్న పిల్లలను ఎంపిక చేస్తా. ఆసక్తి చూపని వారికి అవగాహన కలిగించి శిక్షణకి హాజరయ్యేలా చూస్తా. చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా తన కాళ్ల మీద తను బతక గలగాలి. అమ్మాయిలనూ ఈ రంగంలో నైపుణ్యాలను పెంచుకొని ఇతరులకు నేర్పించమని చెబుతుంటా’ అని అంటోంది శతాబ్ది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్