అమ్మభాష కోసం అక్కాచెల్లెళ్ల తపన...

ప్రపంచీకరణ, ఆంగ్ల భాష ప్రభావం వల్ల వేల భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది, మారుతోంది. అలాంటి వాటిలో ఒకటి నాగాలాండ్‌లో మాట్లాడే ‘ఛోక్రీ’. తమ మాతృభాషలోని అందమైన పదాలూ, ఆ ప్రాంతంలో పాడుకునే జానపదాలూ, స్థానిక సంగీతం మునుపటిలా వినిపించకపోవడాన్ని గమనించారా అక్కా చెల్లెళ్లు. దాన్ని పరిరక్షించుకునేందుకు నడుం బిగించారు. వారి పుణ్యమా అని ఇప్పుడా భాష ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది... అసలేం జరిగిందంటే...

Published : 12 Apr 2022 01:15 IST

ప్రపంచీకరణ, ఆంగ్ల భాష ప్రభావం వల్ల వేల భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది, మారుతోంది. అలాంటి వాటిలో ఒకటి నాగాలాండ్‌లో మాట్లాడే ‘ఛోక్రీ’. తమ మాతృభాషలోని అందమైన పదాలూ, ఆ ప్రాంతంలో పాడుకునే జానపదాలూ, స్థానిక సంగీతం మునుపటిలా వినిపించకపోవడాన్ని గమనించారా అక్కా చెల్లెళ్లు. దాన్ని పరిరక్షించుకునేందుకు నడుం బిగించారు. వారి పుణ్యమా అని ఇప్పుడా భాష ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది... అసలేం జరిగిందంటే...

మెర్సీ, కువేలు, ఆజీ, లూలూ.. అక్కాచెల్లెళ్లు. వారి మాతృభాష వాడకం క్రమంగా తగ్గిపోతోందన్న బాధ వారిని వేధించేది. మరి దాన్ని కాపాడటం ఎలా అనుకున్న వీళ్లు అందుకు యూట్యూబ్‌ని సాధనంగా ఎంచుకున్నారు. దీనిద్వారా తమ భాషలోని మాధుర్యాన్ని కాపాడటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరికో చేరవేసే అవకాశం ఉండటంతో ఛోక్రీ జానపదాల్ని పాడి వీడియోల్ని తీస్తూ యూట్యూబ్‌ (టెట్సెయో సిస్టర్స్‌)లో పెడుతున్నారు. ఈ నలుగురూ సంగీతంలో ఎక్కడా పాఠాలు నేర్చుకోలేదు. వీరి పూర్వీకులు తమ తెగల ఉత్సవాల్లో పాడుతూ నృత్యం చేసేవారు. అలా సంప్రదాయంగానే వీరికి పాటలు పాడే కళ అబ్బింది. తాము పాడటమే కాకుండా, కుటుంబసభ్యులతో, ఆ ప్రాంతంలో మరికొందరు కళాకారులతో పాడించి వాటికి నృత్యరీతుల్ని జోడించి వీడియోలుగా పెడుతుంటారు. నాగాలాండ్‌ ప్రకృతి అందాలూ బావుండటంతో వీటికి లక్షల్లో వీక్షణలు వస్తున్నాయి. ఆ వీడియోలతో వీళ్లు ఆ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తులుగా మారిపోయారు కూడా. వీరి పాటల్లో సంగీతానికి స్థానిక వాద్య పరికరాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. సాహిత్యంలోనూ ప్రకృతి, ప్రేమ, శాంతి, చరిత్ర గురించే ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్‌లోనే కాదు, కొన్ని బ్రాండ్‌లూ, కార్యక్రమాల ప్రచారగీతాల్నీ ట్యూన్‌ చేసి పాడే స్థాయికి ఎదిగారు. వాటిని త్రిభాషా (ఆంగ్లం, హిందీ, ఛోక్రీ పదాలతో) గీతాలుగా తీర్చిదిద్దడం వీరి ప్రత్యేకత. పదేళ్లుగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు వీళ్లు. అయితే స్కూల్‌ రోజుల నుంచే అంటే దాదాపు 20 ఏళ్లుగా బృందంగా పాడుతుండటం విశేషం.  ‘మా రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మా పాటల్ని వింటున్నారు. ఈ వీడియోల ద్వారా మా ఛోక్రీ భాష ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని సంతోషపడుతున్నారీ అక్కాచెల్లెళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్