అమ్మేయాలనుకుంటే.. అంతర్జాతీయ స్థాయికి!

పోషించలేక ఆ అమ్మాయిని అయినకాడికి అమ్మాలనుకున్నారు ఇంటివాళ్లు. కానీ ఆ పిల్లే పేరుతెస్తుందని ఆ రోజు అనుకోలేదు. పేదింట పుట్టి.. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన మహబూబ్‌నగర్‌ అమ్మాయి శాంతకుమారి స్ఫూర్తికథే ఇది... పనిదొరికిన రోజు పండగ. అది లేని రోజు పస్తులు. అలాంటి పేద కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టింది శాంత. అబ్బాయి పుడతాడనుకున్నవాళ్లు ఈ ఆడపిల్లని భారంలా భావించారు. అందుకే...

Published : 13 Apr 2022 00:50 IST

పోషించలేక ఆ అమ్మాయిని అయినకాడికి అమ్మాలనుకున్నారు ఇంటివాళ్లు. కానీ ఆ పిల్లే పేరుతెస్తుందని ఆ రోజు అనుకోలేదు. పేదింట పుట్టి.. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన మహబూబ్‌నగర్‌ అమ్మాయి శాంతకుమారి స్ఫూర్తికథే ఇది...

నిదొరికిన రోజు పండగ. అది లేని రోజు పస్తులు. అలాంటి పేద కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టింది శాంత. అబ్బాయి పుడతాడనుకున్నవాళ్లు ఈ ఆడపిల్లని భారంలా భావించారు. అందుకే అమ్మేయాలనుకున్నారు. అదే జరిగి ఉంటే శాంత కథ మన వరకూ వచ్చేది కాదు. వనపర్తి జిల్లాలోని మారుమూల గ్రామం చిట్యాలకు చెందిన పేద గిరిజన దంపతులు అమృనాయక్‌, మహేశ్వరిలు. వీళ్ల ఆరుగురు పిల్లల్లో శాంతకుమారి నాలుగో సంతానం. ఉన్న ఊళ్లో ఉపాధి లేకపోవటంతో అమృనాయక్‌ దంపతులు హైదరాబాద్‌కు వచ్చి కూలీపనులు చేసుకునేవారు. పోషించే పరిస్థితి లేక శాంతని అమ్మేయాలనుకున్నా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని కష్టమో, నష్టమో పెంచిపెద్దచేద్దాం అనుకున్నారు. ఆ నిర్ణయమే ఆమె తలరాతని మార్చింది. శాంత కూడా చదువుల్లో చురుగ్గా ఉంటూ బాలానగర్‌లోని తెలంగాణ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతిలో సీటు సాధించింది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేది. దాంతో గురుకులంలో క్రీడా అధ్యాపకురాలు అరుణ వాలీబాల్‌ క్రీడలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. దాంతో శాంత ఎక్కడ వాలీబాల్‌ పోటీలు జరిగితే అక్కడ ఉండేది. 2018లో కడపలో జరిగిన వాలీబాల్‌ పోటీలకు అండర్‌-14 విభాగంలో ఎంపికై తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ఆడి రజత పతకం సాధించింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలోనూ రాణించి స్వర్ణాలు సాధించింది. ఈ ఏడాది జూన్‌లో జరిగే ఆసియా మహిళల అండర్‌-17 వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌(తాష్కెంట్‌)  కోసం భారత జట్టులో తెలంగాణ నుంచి నలుగురు క్రీడాకారిణులు చోటుసంపాదించగా.. వీరిలో శాంతకుమారి ఒకరు. ప్రస్తుతం భువనేశ్వర్‌లో శిక్షణ తీసుకుంటూ దేశానికి బంగారు పతకాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్