Updated : 15/04/2022 06:25 IST

తలకట్టుతో కనికట్టు చేస్తున్నారు...

పొడవైన జడతో ఉన్నవారిని బాపూ బొమ్మ అంటాం. ఒత్తైన ఉంగరాల జుట్టు అందాన్ని పెంచుతుందంటాం. ఇప్పుడా పంథా మారింది. వాతావరణ కాలుష్యం, అనారోగ్యాల ప్రభావంతో నిండుగా జుట్టు ఉన్నవారే అరుదయ్యారు. అందం మాట అటుంచి ఆత్మవిశ్వాసాన్నే ప్రభావితం చేస్తున్న ఈ సమస్యకు పరిష్కారాన్నివ్వాలనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన తోబుట్టువులు రిచా, రెయినా గ్రోవర్‌. తలకట్టునే వ్యాపారావకాశంగా మార్చుకుని దూసుకుపోతున్న ఈ అక్కాచెల్లెళ్లకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో, ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

పల్చని తలకట్టైనా, పొట్టి జడనైనా క్షణాల్లో ఒత్తుగా, పొడవుగా, ఉంగరాలుగా మార్చెయ్యగలరు 30 ఏళ్ల రిచా, 28 ఏళ్ల రెయినా. ఇదంతా ఎలా చేస్తున్నారంటే... డిగ్రీ తర్వాత డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగంలో చేరింది రెయినా. విదేశాలకు శిరోజాలను ఎగుమతి చేసే వ్యాపారంలో తండ్రి లలిత్‌కు తోడుగా ఉండేది రిచా. ఆ సమయంలో స్నేహితులు, తెలిసిన వారెందరో జుట్టు రాలే సమస్యకు గురవుతుండటం గుర్తించారు. అమ్మాయిలుగా వారి బాధను మాకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోగలరు అంటారీ అక్కాచెల్లెళ్లు. అందుకే దీనికో పరిష్కారం అందించాలనుకున్నారు.

సహజత్వం ఉట్టిపడేలా...

ఇద్దరూ కలసి 2019లో ‘1 హెయిర్‌ స్టాప్‌’ను ప్రారంభించారు. జుట్టు రాలే సమస్య ఉన్న వారితో మాట్లాడేవారు. ‘తెలిసినవారు, స్నేహితుల కుటుంబాల్లో ఈ సమస్యపై చర్చించేటప్పుడు గర్భధారణ, ప్రసవం, థైరాయిడ్‌, రక్తహీనత, పీసీఓడీ, సొరియాసిస్‌ వంటి చర్మసమస్యలు, క్యాన్సర్‌, అనారోగ్యాలకు చికిత్స వంటివి జట్టు రాలిపోవడానికి కారణాలవుతున్నాయని తెలిసింది. ఆలయాలు, బ్యూటీ పార్లర్ల నుంచి శిరోజాలను సేకరించడంతో మా పని మొదలుపెట్టాం. దీన్ని మూడు విడతలుగా శుభ్రపరిచిన తర్వాత ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాం. వీటిలో టాపర్స్‌, క్లిప్‌-ఒన్స్‌, వాల్యూమైజర్స్‌, హాలో ఎక్స్‌టెన్షన్స్‌, క్లిప్‌ ఇన్‌ బాంగ్స్‌, క్లిప్‌ ఇన్‌ స్ట్రీక్స్‌ వంటివి హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌. ఎటువంటి జుట్టునైనా వినియోగదారులు తాము కోరుకునేలా అందంగా మార్చుకోవచ్చు. జుట్టు పలచబడి చర్మం కనబడే సమస్య ఉన్నవారు కూడా ఒత్తుగా అనిపించేలా ప్యాచెస్‌, లేస్‌ లేదా సిల్క్‌ టాపర్స్‌ను ఉపయోగించొచ్చు. రోజూ అమర్చుకోవచ్చు లేదా మూడు నాలుగు నెలలు ఉంచుకోవచ్చు. శుభకార్యాలకు, పార్టీలకు తలకట్టుకు తగినట్లుగా అప్పటికప్పుడు పెట్టుకో వచ్చు’ అని చెప్పుకొచ్చింది రెయినా.

సవాలుగా...

‘వీటిని అలవాటు చేయడం ప్రారంభంలో మాకో పెద్ద సవాలుగా నిలిచింది’ అంటుంది రిచా. ‘గతంలో జుట్టు రాలిపోతే నలుగురిలోకి రావడానికి ఇష్టపడేవారు కాదు. విగ్గు వాడటానికేమో సంకోచించేవారు. మా ఉత్పత్తులు ఆ భావనను కలగనీయవు. సహజంగా, ఆధునికంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. వీటిపై మొదట అవగాహన కలిగించడానికి ప్రయత్నించాం. డిజిటల్‌ మార్కెటింగ్‌లో రెయినా అనుభవం మాకు బాగా ఉపయోగపడింది. ఈ ఉత్పత్తులను వీడియోల రూపంలో డిజిటల్‌ ప్రచారం చేసేవాళ్లం. ఆరేడు నెలలకు ఆర్డర్లు మొదలయ్యాయి. మొదట్లో నెలకు 50 నుంచి 100 వరకు వచ్చేవి... ఇప్పుడు రోజుకి 150కి పైగా వస్తున్నాయి. వీటి ధర రూ.1,200 నుంచి రూ.35,000. వీటిని 10 ఏళ్లకు పైగా వాడొచ్చు. సమస్యలను గుర్తించి, వాటికి తగినట్లుగా ఉత్పత్తుల తయారీకి కృషి చేస్తుంటాం. త్వరలో 60 ఏళ్లు పైబడిన వారికోసం సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌లా గ్రే హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ను అందించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పుకొస్తోంది రిచా. వీటిని వాడుతున్నప్పడు యువతులు, మహిళల కళ్లల్లో కనిపించే తృప్తి, ఆనందాలు చాలా సంతోషాన్నిస్తుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని