పగడపు దిబ్బల్ని కాపాడదాం రండి!

ఎగసిపడే అలలే ఇంతందంగా ఉంటే.. సముద్ర లోతుల్లో ఇంకెంత బాగుంటుందో అనుకుందామె. సాగర జీవులపై చేసిన టీవీ ప్రోగ్రామ్‌లు ఆమెను  ఆకర్షించాయి. వాటిని నేరుగా చూడాలని  స్కూబా డైవింగ్‌ నేర్చుకొని మరీ కడలి లోతుల్లోకి వెళ్లింది. కానీ అక్కడి దృశ్యం ఆమెను బాధించింది. దీంతో ఓ సంస్థను స్థాపించి మరీ తను చూడాలనుకున్న అందమైన దృశ్యం కోసం తపిస్తోందీ విధి బుబ్నా. ఆమె కథేంటో.. చేస్తున్న పనేంటో తెలుసుకుందామా.

Published : 18 Apr 2022 00:53 IST

ఎగసిపడే అలలే ఇంతందంగా ఉంటే.. సముద్ర లోతుల్లో ఇంకెంత బాగుంటుందో అనుకుందామె. సాగర జీవులపై చేసిన టీవీ ప్రోగ్రామ్‌లు ఆమెను  ఆకర్షించాయి. వాటిని నేరుగా చూడాలని  స్కూబా డైవింగ్‌ నేర్చుకొని మరీ కడలి లోతుల్లోకి వెళ్లింది. కానీ అక్కడి దృశ్యం ఆమెను బాధించింది. దీంతో ఓ సంస్థను స్థాపించి మరీ తను చూడాలనుకున్న అందమైన దృశ్యం కోసం తపిస్తోందీ విధి బుబ్నా. ఆమె కథేంటో.. చేస్తున్న పనేంటో తెలుసుకుందామా.

వాతావరణంలో మార్పులు ప్రభుత్వాల సమస్య అనుకుంటాం కానీ.. ఆ బాధ్యత మనందరిదీ. మొదటిసారి ఎన్నో ఆశలతో అండమాన్‌ దీవుల్లో స్కూబా   డైవింగ్‌కి వెళ్లా. అక్కడ పగడపు దిబ్బలన్నీ ఎండిపోయి కనిపించాయంటోంది విధి. ఈమెది ముంబయి. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. కానీ అంకెలూ, లెక్కలూ ఆసక్తిని ఇవ్వలేకపోయాయి. దీంతో సమాజ సేవపై దృష్టి పెట్టింది. మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు.. వీరి హక్కుల గురించి పనిచేసేది. ఈమెకి ఏదైనా కొత్తగా ప్రయత్నించడం.. ముఖ్యంగా సాహసాలకు సంబంధించినవైతే మరీ ఇష్టం. ట్రెకింగ్‌, అడ్వంచర్‌ టూర్స్‌.. ఇలా చాలా చేస్తుంది. ఓసారిలానే సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు సాగరం లోపలి ప్రపంచంపై ఆసక్తి కలిగింది. ట్రావెల్‌ ప్రోగ్రామ్‌లలో సముద్ర జీవులు, ఆ రంగులు మరింత ఆకర్షించాయి. దీంతో స్కూబా డైవింగ్‌ నేర్చుకుంది. తన 23వ పుట్టినరోజున ఆశగా అండమాన్‌ దీవులకి వెళ్లింది కానీ, నిరాశ చెందింది.

పర్యావరణ కోసం యువశక్తి.. ‘బోలెడు రంగుల్ని చూద్దామని వెళ్లా. నా ఆశంతా ఆవిరైంది. దీని వెనుకా నా పాత్రా ఉంది కదా అనిపించింది. నేనక్కడి వ్యక్తిని కాదని సర్ది చెప్పుకోలేకపోయా. వ్యర్థాలన్నింటినీ సముద్రంలోకే పంపేస్తున్నాం. అవి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. తర్వాత గోవా, లక్షద్వీప్‌ల్లోనూ పర్యటించా. అక్కడా ఇదే పరిస్థితి. దీంతో దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నా. భూమిపై 80 శాతం నీరే. అక్కడ కాలుష్య ప్రభావమూ పడేది మనపైనే. అందుకే జల జీవవైవిధ్యంపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో స్నేహితులతో గతేడాది ‘కోరల్‌ వారియర్స్‌’ ప్రారంభించా. దీని ద్వారా స్కూబా డైవింగ్‌పై ఆసక్తి ఉండీ, ఆర్థిక స్థోమత లేనివారికి నగదు సాయం అందిస్తున్నాం. అయితే వాళ్లకి పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన ఉండాలి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్న వారినే ఎంచుకుంటాం’ అని చెబుతోంది విధి.

విరాళాలు సేకరించి ఏడాదికి అయిదుగురుని చొప్పున ఎంపిక చేసి రూ.70 వేలు అందిస్తోంది. అమెరికా సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో ఈమెతో చేయి కలిపింది. ఇలా విరాళమిస్తున్న సంస్థా దేశంలో ఇదొక్కటే. విధి.. ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరిస్తూనే దేశవిదేశాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పగడపు దిబ్బల్నీ, అంతరించిపోతున్న సముద్ర జీవుల్ని రక్షించడానికి ప్రణాళికలు, వ్యూహాలపై ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి పనిచేస్తోంది. డైవింగ్‌ చేసిన తన ప్రయాణాన్నీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటోంది. మరింత ఎక్కువమందిని ఆ ప్రపంచంలోకి ఆహ్వానించేలా చేసి, అక్కడి పర్యావరణాన్ని పరిరక్షించేలా చేయడమే దీని వెనుక ఉద్దేశమంటోంది. వీటిపై డాక్యుమెంటరీలను చేసేపనిలో ఉందిప్పుడు. ఓ మ్యాగజీన్‌నీ ప్రారంభించింది. మహిళా సాధికారత, అంతర్జాతీయ సంబంధాలు, వాతావరణ మార్పులపై పుస్తకాలనూ రచిస్తోంది. భూటాన్‌కి యూత్‌ అంబాసిడర్‌గానూ పని చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్