అంధులకు టెక్‌ నైపుణ్యాలు నేర్పిస్తోంది!

నెలలు నిండకుండా పుట్టడం ఆమెకు శాపమైంది. ఇంక్యుబేటర్‌లో ఉంచినపుడు చికిత్సలో నిర్లక్ష్యం అంధురాలిని చేసింది. అయితేనేం.. సమస్యలన్నింటినీ అధిగమించి పీజీ పూర్తిచేసింది.

Published : 19 Apr 2022 01:43 IST

నెలలు నిండకుండా పుట్టడం ఆమెకు శాపమైంది. ఇంక్యుబేటర్‌లో ఉంచినపుడు చికిత్సలో నిర్లక్ష్యం అంధురాలిని చేసింది. అయితేనేం.. సమస్యలన్నింటినీ అధిగమించి పీజీ పూర్తిచేసింది. తనలాంటివారి విద్యాభివృద్ధికి కృషిచేయడమే కాదు, వారిని ‘స్టెమ్‌’ సబ్జెక్టులవైపు అడుగు లేయిస్తోన్న బెంగళూరు యువతి విద్య స్ఫూర్తిగాథ ఇది.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నాడే పుట్టడంతో అందరూ విద్యను చదువుల తల్లి అన్నారు. ఆమెకు జరిగిన చికిత్సా లోపం అంధురాలిని చేస్తే, కన్నవారు కుమిలిపోయారు. ఎలాగైనా కూతుర్ని విద్యావంతురాల్ని చేయాలను కున్నారు. అంధుల పాఠశాలలోనే చదివినా, పాఠాలు అర్థం కాక ఇబ్బంది పడేది విద్య. రోజూ స్కూల్‌ నుంచి ఇంటికి ఏడుస్తూ వచ్చేది. ఆమె ఇబ్బంది చూసి ట్యూటర్‌ను ఏర్పాటు చేశారు అమ్మానాన్న. వాయిస్‌ రికార్డర్‌తో పాఠాల్ని రికార్డ్‌ చేసి తర్వాత కూడా వింటూ చదువుకునేది. దాంతో చదువుల్లో ఎంతో మెరుగైంది. అంధుల పాఠశాలలోనే ఏడో తరగతి వరకు చదివి సైన్స్‌, గణితంలో మంచి మార్కులు సాధించడంతో ఆ తర్వాత సాధారణ పాఠశాలకు మార్చారు. టెన్త్‌లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సాధించింది విద్య.

మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసినా...

‘ఇంటర్మీడియెట్‌లో మా ఊరికి 58కిమీ.దూరంలోని కాలేజీకి బస్సులో వెళ్లొచ్చేదాన్ని. కామర్స్‌, మ్యాథ్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా తీసుకున్నా. అప్పట్లో గణితం, సైన్స్‌ పాఠాలు బ్రెయిలీలో లేవు. దాంతో ఆన్‌లైన్‌లో ట్యుటోరియల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి వినేదాన్ని. బ్లైండ్‌ కమ్యూనిటీలో చేరి ప్రపంచవ్యాప్తంగా నాలాంటి వారి గురించి తెలుసుకునేదాన్ని. మంచి మార్కులతో పాసైన ధైర్యంతో డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకున్నా. ప్రోగ్రామింగ్‌, డయాగ్రమ్స్‌, ల్యాబ్‌వర్క్‌ వంటివన్నింటినీ కెనడాకు చెందిన వలంటీర్‌ నుంచి జూమ్‌ ద్వారా నేర్చుకున్నా. తర్వాత ట్రిపుల్‌ఐటీ బెంగళూరు నుంచి ‘డిజిటల్‌ సొసైటీ ప్రోగ్రామింగ్‌’లో మాస్టర్స్‌ చేసి బంగారు పతకాన్ని అందుకున్నా. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేశా. కానీ అంధురాలిని కావడంతో ఇవేవీ నాకు ఉపాధినివ్వలేకపోయాయి. కాల్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి అప్లై చేస్తే కంప్యూటర్‌పైన పనిచేయలేనని చెప్పి తిరస్కరించారు. కంటి చూపు లేనివాళ్లు సాంకేతిక నైపుణ్యాలు సాధించలేరన్న వారి ఆలోచనల్లో మార్పు తేవాలని ఆరోజే నిర్ణయించుకున్నా. నాలాంటి వారికి సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇవ్వాలని 2017లో ‘విజన్‌ ఎంపవర్‌’ను ప్రారంభించా’ అంటుంది విద్య. ట్రిపుల్‌ఐటీ ప్రొఫెసర్‌ అమిత్‌ ప్రకాష్‌, రిసర్చ్‌ విద్యార్థిని సుప్రియతో కలిసి ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా సైన్స్‌, గణితంతోపాటు డిజిటల్‌ అంశాల్లోనూ శిక్షణ అందిస్తోంది. ‘దేశంలోని అంధుల్లో 70 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవాళ్లే. వాళ్లకీ మా సేవలు అందించాలనుకున్నా. కీబోర్డు ఓరియంటేషన్‌, టైపింగ్‌ వంటివి అయిదో తరగతి నుంచే నేర్పిస్తున్నాం’ అని చెప్పే విద్య.. ‘రీబాక్‌ ఫిట్‌ టు ఫైట్‌’ అవార్డుని అందుకుంది.

తేలికగా అర్థమయ్యేలా..

ఒకటి నుంచి పదోతరగతి వరకు చదివే అంధ విద్యార్థులకు డయాగ్రమ్స్‌ని స్పృశిస్తే అర్థమయ్యేలా పాఠ్య పుస్తకాలను రూపొందించి అందిస్తోంది విద్య. ‘హెక్సస్‌-అంతర’ పేరుతో బ్రెయిలీ బుక్‌ రీడర్‌ను విద్యార్థులకు అందేలా చేస్తోంది. తమిళనాడు, కేరళ, త్రిపుర, దిల్లీ, గుజరాత్‌లలో మొత్తం 80 పాఠశాలలతో కలిసి పనిచేస్తూ, 3 వేలమంది విద్యార్థులకు లబ్ధిని కలిగించింది. ‘విజన్‌ ఎంపవర్‌’ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు విద్యనందించడంలో మైక్రోసాఫ్ట్‌, విప్రో, కాగ్నిజెంట్‌, ఎలక్ట్రోబిట్‌ ఇండియా వంటి సంస్థల ఆర్థిక సాయంతో రెండువేల మందికి విద్యను అందించిందీ అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్