డ్రాగన్‌ ఫ్రూట్‌తో.. ఆవిష్కరిస్తోంది!

నాన్న డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పండించే రైతు. వాటిలో కొన్ని పండ్లు వృథా అవుతుండేవి. వాటికి పరిష్కారం కనుక్కోవాలనుకున్న ఆమె ఆలోచన వ్యాపారమైంది. కేంద్ర మంత్రుల ప్రశంసలూ అందించింది. మనస్వినీ రెడ్డి.. నేచురల్‌ హ్యూస్‌ ప్రయాణం.. ఆమె మాటల్లోనే!

Published : 19 Apr 2022 01:54 IST

నాన్న డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పండించే రైతు. వాటిలో కొన్ని పండ్లు వృథా అవుతుండేవి. వాటికి పరిష్కారం కనుక్కోవాలనుకున్న ఆమె ఆలోచన వ్యాపారమైంది. కేంద్ర మంత్రుల ప్రశంసలూ అందించింది. మనస్వినీ రెడ్డి.. నేచురల్‌ హ్యూస్‌ ప్రయాణం.. ఆమె మాటల్లోనే!

నేను ఎంఎస్‌సీ క్లినికల్‌ న్యూట్రిషన్‌ విద్యార్థిని. మాది హైదరాబాద్‌ వనస్థలిపురం. నాన్న వనిపల్లి శ్రీనివాసరెడ్డి డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పండిస్తారు. అమ్మ మైథిలి. ఈ పండ్లు పండిపోతే విచ్చుకుపోతాయి. చుట్టాలు, స్నేహితులకిస్తే పనికి రావని ఇస్తున్నామనుకుంటారు. అందుకే చదువుకున్న ప్రిజర్వేటివ్‌ టెక్నిక్స్‌ ఉపయోగించి జామ్‌ ప్రయత్నించా. ఈ పండులో నీటిశాతం ఎక్కువ.. దీంతో ఎన్నోసార్లు విఫలమయ్యా. చివరకి వృక్షాధారిత పదార్థాలతో విజయవంతమయ్యా. దీనంతటికీ 4-5 నెలలు పట్టింది. తర్వాత స్క్వాష్‌ చేశా. డ్రాగన్‌ ఫ్రూట్‌ తొక్కలోనూ బోలెడు పోషకాలు. సౌందర్య పోషణలో వాడొచ్చు కదా అనిపించింది. మళ్లీ వైఫల్యమే. ఎండబెట్టి చేస్తే న్యూట్రియంట్లు, సహజ రంగు పోతున్నాయి. చివరికి వాక్యూమ్‌ ఫ్రీ డ్రైయర్‌తో సమస్య తీరింది. సబ్బులు, ఫేస్‌మాస్క్‌, స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌, లిప్‌బామ్‌.. అన్నీ రూపొందించా. నాన్నది సేంద్రియ వ్యవసాయం. ఉత్పత్తుల తయారీకి రసాయనాలు ఎందుకు మిళితం చేయాలనుకొని దీనికీ సహజ పద్ధతి ఎంచుకొన్నా. గానుగ నూనెలు, వాల్‌నట్స్‌, షుగర్‌, నేచురల్‌ ఆయిల్స్‌, కోకో బటర్‌, షియా బటర్‌ వంటివే వాడుతున్నా. ఇంకా.. సువాసనలకు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, రంగులూ ఎఫ్‌డీఐ ఆమోదం పొందినవే. 2019 వీఎస్‌ఆర్‌ ఆగ్రో ఫామ్స్‌ పేరుతో మొదలుపెట్టి 2020లో నేచురల్‌ హ్యూస్‌గా మార్చా. ఇన్‌స్టా, వాట్సాప్‌ల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నా. డ్రాగన్‌ఫ్రూట్‌తో ఇలా ఉత్పత్తుల తయారీ దేశంలో మొదటిసారిగా ప్రారంభించింది నేనే. దీంతో మార్కెటింగ్‌ ఇబ్బందయ్యేది. మొదట్లో శాంపిల్స్‌గా ఇచ్చా. నచ్చినవాళ్లు కొనడం ప్రారంభించారు. కొవిడ్‌లో అందరూ సహజ పదార్థాలపై దృష్టిపెట్టడంతో కొనుగోళ్లు పెరిగాయి. 20 ఉత్పత్తులను రూపొందిస్తున్నా. నిల్వ పదార్థాలేమీ వాడను. అందుకే తక్కువ మొత్తంలోనే తయారు చేస్తా. 2021లో కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు, నిపుణుల ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ ఉత్పత్తుల సమ్మిట్‌లో మాకూ అవకాశమిచ్చారు. అక్కడ మా ఉత్పత్తులకు ప్రశంసలూ అందుకున్నా. కాంబోస్‌, గిఫ్ట్‌లు, ఫంక్షన్లకు హ్యాంపర్లుగానూ చేసిస్తున్నా. నాన్‌ ఆల్కహాలిక్‌ వైన్‌నూ రూపొందించా. ఒకవైపు చదువు, మరోవైపు వ్యాపారం.. సమయం ఇంకా కుదరడం లేదు. ఈ జూన్‌ నుంచి రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో పరిశ్రమగా తీసుకొస్తున్నా. అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే ముందుకెళ్లగలుగుతున్నా. త్వరలో స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తా. ఏది చేసినా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండాలంటారు నాన్న. అందుకే చాలావరకూ లాభాపేక్ష లేకుండా ఒక్క శాతం లాభాలకే ఉత్పత్తులను అందిస్తున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్