అక్కా.. ఓ మంచి చాయ్‌!

‘కష్టపడి చదివి.. పేద్ద ఉద్యోగం సాధించాలి’.. ఈ మాటలే వింటూ పెరిగారీ అమ్మాయిలు. మన కాళ్లమీద మనం నిలబడాలంటే ఉద్యోగమే చేయాలా? వ్యాపారం ఎందుకు చేయకూడదనుకున్నారు. ఇంతకీ వాళ్లు

Updated : 23 Apr 2022 06:37 IST

‘కష్టపడి చదివి.. పేద్ద ఉద్యోగం సాధించాలి’.. ఈ మాటలే వింటూ పెరిగారీ అమ్మాయిలు. మన కాళ్లమీద మనం నిలబడాలంటే ఉద్యోగమే చేయాలా? వ్యాపారం ఎందుకు చేయకూడదనుకున్నారు. ఇంతకీ వాళ్లు ఎంచుకున్నదేంటో తెలుసా? టీ వ్యాపారం! మన అమ్మాయిలు దేశానికే పరిమితం కాలేదండోయ్‌. విదేశీ గడ్డపైనా మన చాయ్‌ సువాసన, రుచుల్ని పరిచయం చేస్తున్నారు. చాయ్‌వాలీలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారి కథలే ఇవి!


వేచి చూడలేక..: ప్రియాంక గుప్తా

కొవిడ్‌ తర్వాత ఎందరో ఉపాధి కోల్పోయారు. ఇక కొత్త కొలువులకు ఆస్కారమేది? ఇదే పరిస్థితిని ప్రియాంక ఎదుర్కొంది. ఈమెది బిహార్‌లోని చిన్న పల్లె. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. ఉద్యోగాల కోసం చూస్తూ సమయం వృథా చేసుకోవడం కంటే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం నయమనుకుంది. ‘‘ఎంబీఏ చాయ్‌వాలా’ ప్రఫుల్‌ భిల్లోరే గురించి విన్నాక చాయ్‌వాలీలు ఎందుకుండకూడదు అనుకున్నా. ఇంట్లో బ్యాంకు పరీక్షల శిక్షణ కోసం వెళ్తున్నానని చెప్పి ఒంటరిగా పట్నా చేరుకున్నా. యూట్యూబ్‌లో వివిధ రకాల టీల గురించి తెలుసుకున్నా. మరింత అనుభవం, అవగాహన కోసం చిన్న చిన్న టీకొట్లకు వెళ్లి పరిశీలించా. అవగాహన వచ్చాక సొంతంగా ప్రారంభించాలనుకున్నా. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తే స్థానికురాలిని కాదని తిరస్కరించారు. అలాగని ఆగిపోలేదు. స్నేహితుల సాయంతో నా కలల దుకాణాన్నీ తెరిచా’ అని చెబుతోంది 24 ఏళ్ల ప్రియాంక. ఈమె కథ విని స్థానికులు ఆశ్చర్యపోవడమే కాదు.. అభినందిస్తున్నారు కూడా. విషయం తెలిసి ముందు అభ్యంతరం చెప్పిన అమ్మానాన్నలూ ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు.


ఉద్యోగాన్ని వదిలి: నిషా హుస్సేన్‌

‘నచ్చింది చెయ్‌.. విజయం అదే వెతుక్కుంటూ వస్తుంది’ ఈ సూత్రాన్ని నమ్ముతుంది నిషా. అందుకే మంచి వేతనమున్నా ఉద్యోగాన్ని వదిలేసింది. ఈమెది రాజ్‌కోట్‌. టీపై ఆసక్తి కలిగి ఓ కేఫ్‌లో చేరి వ్యాపార మెలకువల్ని తెలుసుకుంది. ఉద్యోగానికి స్వస్తి చెప్పి మరీ 2019లో ‘చాయ్‌ ల్యాండ్‌’ ప్రారంభించింది. ఇంట్లో వాళ్ల తిరస్కరణలు, లాక్‌డౌన్‌లో కష్టాలెదురైనా పట్టువదల్లేదు. కొత్త ప్రయోగాలూ చేస్తుండటంతో ఆదరణ పెరిగింది. ఇప్పుడామె బ్రహ్మాండంగా సంపాదిస్తోంది. ఎందరో మహిళలకీ వివిధ రకాల టీల తయారీపై శిక్షణనిస్తోంది 28 ఏళ్ల నిషా.


పీజీ చదివి..: టుక్‌టుకీ దాస్‌

‘అక్కా.. ఓ మంచి చాయ్‌! ఓ సెల్ఫీ’ కస్టమర్ల నుంచి టుక్‌టుకీ రోజూ వినే మాటే ఇది. తను అంత ఫేమస్‌ మరి! నాన్న వ్యాను డ్రైవర్‌. అమ్మది చిన్న పచారీ కొట్టు. తనకో అక్క. పిల్లల జీవితాలైనా మెరుగ్గా ఉండాలని ఇద్దరినీ వాళ్ల నాన్న చదివించారు. టుక్‌టుకీ ఎమ్మే ఇంగ్లిష్‌ చదివింది. ‘ప్రయత్నిస్తే కార్పొరేట్‌ ఉద్యోగమో.. ప్రభుత్వ కొలువో వస్తుంది. కానీ నాకెప్పుడూ నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఉండేది. అలాగని రిస్క్‌ తీసుకోలేను. అప్పుడు తట్టిన ఆలోచన టీ వ్యాపారం. ట్యూషన్లు చెప్పగా వచ్చిన రూ.10వేలతో 2021 చివర్లో కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో ‘ఎమ్మే ఇంగ్లిష్‌ చాయ్‌వాలీ’ ప్రారంభించా. ఇంట్లో చెప్పినపుడు ‘ఉద్యోగం, కాదంటే పెళ్లి చేసుకో’ అన్నారు. నేను పట్టు వదల్లేదు. తర్వాతా చాలా మంది ఇంత చదివి టీ అమ్ముతావా అన్నవారే. కానీ కొద్దిరోజుల్లోనే నా కథ సోషల్‌ మీడియాలో వైరలైంది. వ్యాపారమూ బాగుంది. దేశవ్యాప్తంగా అవుట్‌లెట్లను ప్రారంభించడం నా కల’ అంటోంది 26 ఏళ్ల టుక్‌టుకీ.


ఆస్ట్రేలియాలో..: ఉప్మా విర్ది

‘విర్దీ ఓ కప్పు టీ పెట్టవా.. నేనున్నానంటే అమ్మానాన్న, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇదే మాట. ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళ్లినా అక్కడా ఇంతే. నాదృష్టిలో ఆత్మీయులందరినీ ఒకచోట చేర్చే సాధనమిది. అందుకే ప్రేమతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే హెర్బ్స్‌నీ జోడిస్తా. ఇది నాకు మా తాతగారి నుంచి వచ్చింది. ఈ రుచుల్ని విదేశీయులకీ పరిచయం చేయాలనుకున్నా. అందుకే చాయ్‌వాలీ ప్రారంభించా. మొదట హెర్బల్‌ టీ పొడులను ఆన్‌లైన్‌లో అమ్మేదాన్ని. ఖాళీ సమయాల్లో టీ స్టాల్‌నీ నిర్వహిస్తా. తక్కువ కాలంలోనే వ్యాపారం స్టోర్లు రూపొందించే స్థాయికి ఎదిగింది’ అని ఆనందంగా చెబుతుంది విర్ది. 2016లో ఉత్తమ వ్యాపారవేత్త అవార్డునీ అందుకున్న ఈమెకు మొదట్లో ఇంట్లోవాళ్ల నుంచి ఒత్తిడి ఎదురైంది. తను లాయర్‌ మరి. ఉద్యోగం చేస్తూనే దీన్నీ కొనసాగిస్తానన్నాక కానీ వాళ్లు ఊరుకోలేదు. వారాంతాల్లో ‘ద ఆర్ట్‌ ఆఫ్‌ చాయ్‌’ పేరుతో టీ పెట్టడంలో శిక్షణనీ ఇస్తోందీమె.


స్నేహితుడితో కలిసి: శోభన విజయన్‌

తన చదువంతా యూకేలోనే. మన దేశానికి తిరిగొచ్చాక ఇక్కడి రుచుల గొప్పతనం తెలిసింది శోభనకు. ఈ క్రమంలోనే టీల్లో భిన్న రుచులు ఆమెను ఆశ్చర్య పరిచాయి. హోటల్‌ ఆపరేషన్స్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసింది. బ్రూనెలో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లింది. స్నేహితుడు శరణ్‌ మంచి ఫుడీ. తనతో కలిసి అక్కడి వాళ్లకు మన దేశీ రుచులను చూపించాలని 2021లో చాయ్‌వాలీ ప్రారంభించారు. భిన్నరకాల టీలతోపాటు స్ట్రీట్‌ ఫుడ్‌నీ అందిస్తున్నారు. కొద్ది కాలంలోనే వ్యాపారం బాగా పుంజుకుంది. అవుట్‌లెట్లను పెంచే ఆలోచనలో ఉన్నామంటోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్