Archana jois: 21 ఏళ్లకే.. రాకీభాయ్‌కి అమ్మనయ్యా!

కనీసం ఇంజినీరింగ్‌ పట్టాలేకపోతే కష్టమే అనుకొనే ఈ రోజుల్లో... నాట్యం కోసం చదువుని పక్కన పెట్టేవాళ్లు ఎంత మంది ఉంటారు? అర్చన ఆ ధైర్యం చేసింది. నాట్యాన్నే నమ్ముకొన్న ఆ అమ్మాయికి నటనలో భావాలని...

Updated : 17 Aug 2022 12:51 IST

అర్చన

కనీసం ఇంజినీరింగ్‌ పట్టాలేకపోతే కష్టమే అనుకొనే ఈ రోజుల్లో... నాట్యం కోసం చదువుని పక్కన పెట్టేవాళ్లు ఎంత మంది ఉంటారు? అర్చన ఆ ధైర్యం చేసింది. నాట్యాన్నే నమ్ముకొన్న ఆ అమ్మాయికి నటనలో భావాలని అలవోకగా పలికించడం కష్టం కాలేదు. 21 ఏళ్లకే కేజీఎఫ్‌ చిత్రంలో రాకీభాయ్‌ అమ్మగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న అర్చనా జాయిస్‌ వసుంధరకు చెప్పిన సంగతులివి...

టనలో నా అనుభవం తక్కువే. అయినా ఇంతమంది అభిమానులని సంపాదించుకున్నానంటే దానికి కారణం.. నేను అమితంగా ప్రేమించిన నాట్యం, దాన్ని నేర్చుకొనే అవకాశం ఇచ్చిన అమ్మానాన్నలే! నాన్న శ్రీనివాసన్‌ది హసన జిల్లా, అమ్మ వీణది కోలార జిల్లా. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. చిన్నప్పటి నుంచీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని మాకిచ్చారు. నన్నూ, చెల్లెలు వైష్ణవిని బలవంతపు చదువుల వైపు మళ్లించలేదు. నాక్కూడా ఉదయం 8గంటలకు బడికి వెళ్లి, సాయంత్రం వరకు ఉండి... మళ్లీ రాత్రి దాకా ట్యూషన్లు... ఇలా ఇష్టం లేదు. బలవంతంగా చదివే చదువు ఒంటబట్టదని నాన్న అనే వారు. దాంతో నా దృష్టి నాకిష్టమైన సంగీతం, నాట్యంపై పడింది. అవి నేర్చుకుంటూనే కోలారలో మా మేనమామ ప్రారంభించిన బడిలో పదోతరగతి వరకూ చదువుకున్నా. బెంగళూరులో ఇంటర్‌ చేశా. తర్వాత డిగ్రీ చేయాలా... నాట్యం వైపు వెళ్లాలా? అనేది నా నిర్ణయానికే వదిలేశారు అమ్మానాన్న.

నృత్యంలో ప్రవేశం

మొదట్లో నాకు సంగీతమంటే ఇష్టం. చెల్లికి నృత్యమంటే ప్రాణం. తన ఇన్‌స్టిట్యూట్‌కి తోడుగా వెళ్తూ నేనూ నాట్యంతో ప్రేమలో పడ్డా. అలా ఆరో తరగతి నుంచే నృత్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. ఇంటర్‌ అయ్యేనాటికి వందకు పైగా ప్రదర్శనలివ్వడంతో కాలేజీలో నాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. మామూలు డిగ్రీ చదివితే చిన్నతనం నుంచీ ప్రేమించిన నాట్యానికి దూరమవుతాననిపించింది. దాంతో బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన నాట్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కథక్‌ అండ్‌ కొరియోగ్రఫీలో మూడేళ్ల బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరిపోయా. భరతనాట్యంలో పట్టా పొందా. ఈ క్రమంలో విదేశాల్లోనూ ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చాను.

దేవాలయ నాట్యంతో.. ప్రయోగాలు

బీఎఫ్‌ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ ధారావాహికలో నటుల కోసం ఓ ఛానల్‌ వాళ్లు మా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చారు. వందల మంది ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నా... ఇచ్చిన సంభాషణలను తడబడకుండా చెప్పడంతో అవకాశం నాకు దక్కింది. వంద ఎపిసోడ్‌ల సీరియల్‌ అది. అదవ్వగానే మరో దాంట్లో అవకాశం వచ్చింది. అవి చేస్తున్నానన్న మాటేకానీ నాట్యానికి దూరమవుతానేమో అన్న దిగులు ఉండేది. అందుకే సీరియల్స్‌ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్‌ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ చేశాను. సీరియల్స్‌లో.. ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు అనుకొనేదాన్ని. అందుకే కొత్త అంశాలతో నాట్య ప్రదర్శనలు చేస్తూ, ప్రయోగాలు చేసేదాన్ని. నాకున్న నృత్యానుభవం వల్లనే కేజీఎఫ్‌ సినిమాల్లో తల్లి పాత్రను సులువుగా చేయగలిగాను. సీరియల్‌లో చూసి కేజీఎఫ్‌ నిర్మాణ బృందం అవకాశమిస్తానన్నారు.

 

కేజీఎఫ్‌లో తల్లి పాత్ర చేయనని చెప్పా!

నేను చేసిన మహాదేవీ సీరియల్‌ను చూసిన దర్శకులు ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌లో హీరో యశ్‌కు తల్లిగా చేయమని అడిగారు. అప్పటికి నా వయసు 21ఏళ్లే. ఏకంగా యశ్‌ వంటి హీరోకి తల్లిగా చేయటం కుదురని చెప్పా. కానీ వారు మా నాన్నతో చెప్పించే ప్రయత్నం చేశారు. అయినా నేను ఒప్పుకోలేదు. నా మిత్రులు హొంబాళె సంస్థ గురించి చెప్పారు. ఈ పాత్రను వదులుకుంటే తర్వాత బాధపడతావని పదే పదే చెప్పేవారు. పైగా ఇది ఎంత పెద్ద యాక్షన్‌ సినిమా అయినా తల్లి సెంటిమెంట్‌ ప్రేక్షకులను వెంబడిస్తుంది. లేదంటే నా చిత్రం ఫెయిల్‌ అయినట్లేనని దర్శకులు ప్రశాంత్‌ నీల్‌ చెప్పేవారు. ఆయన ఇచ్చిన భరోసాతో నేను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నా.  ఇప్పుడు కేజీఎఫ్‌కు సాధించిన విజయం, అందులో నా పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్రను వదలుకొని ఉంటే కచ్చితంగా బాధపడేదానిని.

నాకంత కష్టమనిపించలేదు

కోలార్‌ జిల్లా కేజీఎఫ్‌లో నా సన్నివేశాలన్నీ చిత్రీకరించారు. దర్శకులు ప్రశాంత్‌ నీల్‌ చెప్పింది చెప్పినట్లు చేయటం నాకు అంత కష్టంగా అనిపించలేదు. నేను నటించిన సన్నివేశాల్లో ప్రధాన నటీనటులు ఎవరూ ఉండేవారు కాదు. నా ఆహార్యంతోనే తల్లిపాత్రకు సంబంధించిన హావభావాలు సులువుగా వచ్చేవి. షూటింగ్‌ సమయంలో, డబ్బింగ్‌ సందర్భంగా కూడా ఎక్కువ టేక్‌లు తీసుకోలేదు. చిత్రంలో నేను నటించిన సన్నివేశాల్లో వేరొక నటుడెవరూ కనిపించకుండా దర్శకులు చిత్రీకరణ చేశారు. స్క్రీన్‌పై నేనొక్కదాన్నే కనిపిస్తాను. దర్శకులు తీసుకున్న ఈ శ్రద్ధే నా పాత్ర ఇంతలా ఆదరణ పొందేందుకు కారణమైంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా యశ్‌ కూడా వస్తుండేవారు. తాను ఎంత పెద్ద నటుడైనా తోటి నటులను ప్రోత్సహించే తత్వం ఆయనది. నాతో ప్రకాశ్‌ రాజ్‌, రవీనాటండన్‌, సునీల్‌ దత్‌ వంటి పెద్ద నటులెవ్వరూ నటించలేదు. కానీ వారున్న చిత్రంలో నేనూ నటించానంటే ఎంతో గొప్పగా ఉంది. చిత్రం విడుదలైన తర్వాత హీరో ప్రభాస్‌ మా చిత్ర నిర్మాతలకు ఫోను చేసి నా గురించి ప్రత్యేకంగా అభినందించారు. కానీ ఇకపై తల్లిపాత్రలు చేయాలని లేదు. మరో 20ఏళ్ల తర్వాత తల్లిపాత్రల గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం క్రీడల నేపథ్యం, శారీరక వైకల్యం ఉన్న పాత్రల్లో చేసి ఒప్పించాలని ఉంది. సినిమా వంటి మాధ్యమాల్లో నటించి ఒప్పించటం ఏ నటికైనా సవాలే. ఆ సవాలును తొలి చిత్రంతోనే అధిగమించానన్న ఆనందం ఉంది. ప్రస్తుతం నాట్యకారిణి పద్మాసుబ్రహ్మణ్యం నేతృత్వంలో టెంపుల్‌ ఆర్కిటెక్చర్‌పై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నా. దేవాలయాలపై చెక్కిన శిల్పాలు చూసేందుకు ఒకే భంగిమలో ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ దేని ప్రత్యేకత దానిదే. అలాంటి వాటితో ఓ నృత్య రూపకాన్ని సృష్టించాలనేది మా లక్ష్యం.

నాన్న కల అది...

మా నాన్నకు యోగా, జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశం ఉంది. అప్పట్లో ఏసియాడ్‌ పోటీలకూ ఎంపికయ్యారు. కానీ ఆర్థిక సమస్యలతో ఆ పోటీల్లో పాల్గొనలేకపోయారు. అందులో పాల్గొని ఉంటే జాతీయ స్థాయిలో పేరు వచ్చేదని నాన్న బాధపడేవారు. ఇప్పుడు నా విజయం చూసి తన బాధ కొంతైనా తీరుతుందని భావిస్తున్నా. కేజీఎఫ్‌ సినిమాలు చేయక ముందే దూరపు బంధువు శ్రేయస్‌తో నాకు పెళ్లైంది. నా నృత్యం, నటనకు వైవాహిక జీవితం అడ్డు కాలేదు. ఇకపై నృత్యం, నటనకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. గొప్ప పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించడం నా లక్ష్యాల్లో చేరింది.

కె.ముకుంద, బెంగళూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్