Published : 26/04/2022 02:36 IST

పేరు పెట్టి.. లక్షలు తీసుకుంటోంది!

ఇంట్లోకి బుజ్జాయి అడుగుపెడుతోందనగానే ‘అమ్మాయైతే ఈ పేరు.. అబ్బాయి అయితే ఫలానా’ అంటూ చర్చలు మొదలు. ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరికి మరోటి నచ్చుతుంది. అందరూ మెచ్చేలా ఎంచడం కష్టమే కదూ! ‘ఆ కష్టమంతా మీకెందుకు? నేనే మంచి పేరు వెతికిపెడతాగా’ అంటోంది హంఫ్రే.

టేలర్‌ హంఫ్రే.. ప్రొఫెషనల్‌ బేబీ నేమర్‌. ఇదెక్కడి వృత్తి? కొత్తగా ఉందే.. అనుకుంటున్నారా! మనకు వింతే కానీ.. న్యూయార్క్‌ వాళ్లకికాదు. 2018 నుంచి హంఫ్రే ఈ సేవలను అందిస్తోంది. ఒక్కో పేరు పెట్టినందుకు కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ తీసుకుంటుందట. ఈ 33 ఏళ్ల అమ్మాయి గత ఏడాదిలోనే 100మందికిపైగా పిల్లలకు పేరు పెట్టిందట. దాదాపు రూ.కోటిపైగా సంపాదించిందంటే తను పెట్టే పేర్లకి ఎంత డిమాండో ఊహించండి.

హంఫ్రే న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి 2015లో మేనేజ్‌మెంట్‌ విద్య పూర్తిచేసింది. మాట్రిమోనీ, ఫండ్‌ రైజింగ్‌, ఈవెంట్‌ ప్లానింగ్‌ వంటి వ్యాపారాలు చేసింది. రచయిత్రి కూడా. కొన్ని టీవీ కార్యక్రమాలకు స్క్రీన్‌ప్లే కూడా రాసింది. తన చుట్టుపక్కల చాలామంది పిల్లలకు భిన్నమైన పేరు పెట్టాలని వెతకడం, కొందరు రకరకాల కారణాల రీత్యా పేరు మార్చాలనుకోవడం చూసింది. తనకు నచ్చిన వాటిని సోషల్‌ మీడియాలో అర్థాలతో సహా పెట్టడం మొదలుపెట్టింది. దీంతో ఫాలోయర్లు పెరగడమే కాక.. తమకు ఆ పేరు నచ్చిందనీ, తమ పిల్లలకు పెట్టామనీ మెసేజ్‌ చేసేవారు. అది ఆమెకు ఆనందాన్ని కలిగించేది. దీన్నే కెరియర్‌గా మలచుకుంటే బాగుంటుందని అనిపించి 2018 నుంచి కొంత మొత్తం తీసుకొని పేర్లు సూచించడం మొదలుపెట్టింది. ‘వాట్స్‌ ఇన్‌ ఎ బేబీ నేమ్‌’ పేరుతో వెబ్‌సైట్‌నీ ప్రారంభించింది.

అబ్బా.. ఎంత సులువుగా సంపాదించేస్తోంది అనుకున్నారో.. పప్పులో కాలేసినట్టే. తనేమీ ఆషామాషీగా పేరు పెట్టేయదు. తల్లిదండ్రుల నమ్మకాలు, వాళ్ల పూర్వాపరాలు, మొదటిసారి కలిసిన ప్రదేశం సహా ఇలా అన్ని వివరాలనూ కూలంకషంగా తెలుసుకుని దాన్ని బట్టి పేరు సూచిస్తుందట. ఒక్కోసారి ఆ పేరు విని ఆమె అడిగిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారట. తన ఇన్‌స్టా ఖాతాను 28 లక్షలకుపైగా అనుసరిస్తున్నారు. మీలోనూ ఈ ప్రతిభ ఉందా? అయితే మెదడుకు పదును పెట్టేయండి. మన దేశంలో ఈ కెరియర్‌ను ప్రారంభించిన వారు మీరే అవుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని