ఉచితంగా పెళ్లి దుస్తులు...

ప్రతి అమ్మాయీ పెళ్లి కొడుకునే కాదు... ఆ సందర్భంలో తాను ధరించే దుస్తులనూ అందంగా ఊహించుకుంటుంది. అయితే నిరుపేద అమ్మాయిలకు ఇది తీరని కలగా మిగిలిపోవాలా? కాదంటోంది 20 ఏళ్ల షెహరాబాను. ఇటువంటి వారి కోసమే...

Updated : 27 Apr 2022 04:25 IST

ప్రతి అమ్మాయీ పెళ్లి కొడుకునే కాదు... ఆ సందర్భంలో తాను ధరించే దుస్తులనూ అందంగా ఊహించుకుంటుంది. అయితే నిరుపేద అమ్మాయిలకు ఇది తీరని కలగా మిగిలిపోవాలా? కాదంటోంది 20 ఏళ్ల షెహరాబాను. ఇటువంటి వారి కోసమే ప్రత్యేకంగా దుస్తుల దుకాణాన్ని తెరిచి, ఉచితంగా వివాహ దుస్తులను అందిస్తోంది. నిజానికి తనదీ అదే పరిస్థితి... మరెలా అంటారా?

షెహరాబాను వాళ్లది కర్ణాటక, మడికేరి తాలూకాలోని ఛెత్తల్లి అనే కుగ్రామం. తల్లిదండ్రులు అమీనా, మాను దినసరి కూలీలు. ఆ కూలీతోనే ఇల్లు గడిచేది. ఆ పరిస్థితుల్లోనూ ఇతరులకు చేయూతనందించడంలో షెహరా బానుకు ఆసక్తి ఎక్కువ. పీయూసీ తర్వాత బ్యుటీషియన్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక్కోసారి తన స్నేహితులకు పెళ్లి కుదిరినప్పుడు అనుకున్నట్లుగా దుస్తులను ఎంపిక చేసుకోలేక, ఉన్నంతలోనే కొనుగోలు చేయడం చూసేది. అప్పుడు వారి కళ్లల్లో అసంతృప్తిని గమనించేది. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ఆ సందర్భాన్ని తృప్తిగా మలుచుకోలేకపోతున్న పేదరికాన్ని చూసి బాధపడేది. కేరళలో ఇటువంటి పేద వధువుల కోసం పెళ్లి దుస్తులను ఉచితంగా అందిస్తున్న బొటిక్‌ గురించి తెలిసింది. తానూ అలా ఏదైనా చేయాలనుకుంది.

ఆ సంతోషం చెప్పలేనిది..

ఈ ఆలోచన వచ్చిన వెంటనే తన వాట్సప్‌ గ్రూపుల్లో ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లో దీనిగురించి వివరించా అంటుంది షెహరాబాను. ‘చాలామంది సానుకూలంగా స్పందించి, చేయూతనందించడానికి ముందుకొచ్చారు. కొందరు మహిళలైతే వాళ్ల దగ్గర ఉన్న మంచి చీరలను విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు. మరికొందరు తమ వివాహానికి ధరించిన దుస్తులనే నాకు పంపించారు. అలా ఫ్యాన్సీ దుస్తులు కూడా వచ్చాయి. వీరంతా దాదాపు మధ్యతరగతికి చెందిన వారే కావడం విశేషం. ఈ దుస్తులన్నింటినీ డ్రై క్లీనింగ్‌ చేయించా. ఆ తర్వాత ఓ చిన్న దుకాణాన్ని తెరిచా. ఇది దుస్తులను విక్రయించేది కాదు.. కేవలం ఉచితంగా అందించడానికి మాత్రమే. నిరుపేద లేదా అనాథ వధువులు ఇక్కడకొచ్చి నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. కొందరు ఇప్పుడు ధనిక కుటుంబాల మహిళలు కూడా పేద వధువులకు చేయూతనందించడానికి ముందు కొస్తున్నారు. సోషల్‌ మీడియా, వాట్సప్‌ గ్రూపుల ద్వారా కొందరు వధువులు నన్ను సంప్రదిస్తున్నారు. వారు మా బొటిక్‌కు వచ్చేటప్పుడు వారి మత పెద్దల నుంచి ఒక లేఖను, వారి ఆర్థిక పరిస్థితిని వివరించే పత్రాలను తీసుకొస్తే చాలు. వారికి కావాల్సిన దుస్తులను అందిస్తున్నా. నెలలోపే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నూతన వధువులు మా బొటిక్‌ నుంచి దుస్తులను ఉచితంగా పొందారు. నచ్చిన దుస్తులను వారి సైజుకు తగినట్లుగా మార్చి అందిస్తున్నా. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే ఆనందం ఇచ్చే తృప్తి వెలకట్టలేనిది. ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది’ అంటున్న షెహరాబాను మరెందరినో ఈ సత్కార్యంలో భాగస్వాములను చేయడం స్ఫూర్తిదాయకం కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్