పది లక్షల మందికి వ్యవసాయం!

పేదమ్మాయే.. కానీ పట్టణంలో పెరగడంతో పొలాన్నే చూసెరుగదు. పరిస్థితుల వల్ల చేలో అడుగుపెట్టాల్సొచ్చింది. ఎండ వేడి, అలవాటు లేని శ్రమకి కన్నీళ్లొచ్చేశాయి. పైగా ఆమె పని తీరు చూసి చుట్టూ ఉన్న వాళ్ల నవ్వులు... పోనీ ఉద్యోగం చేద్దామా అంటే కనీసం పదోతరగతి కూడా పాసవ్వలేదు.

Published : 28 Apr 2022 06:40 IST

సవిత

పేదమ్మాయే.. కానీ పట్టణంలో పెరగడంతో పొలాన్నే చూసెరుగదు. పరిస్థితుల వల్ల చేలో అడుగుపెట్టాల్సొచ్చింది. ఎండ వేడి, అలవాటు లేని శ్రమకి కన్నీళ్లొచ్చేశాయి. పైగా ఆమె పని తీరు చూసి చుట్టూ ఉన్న వాళ్ల నవ్వులు... పోనీ ఉద్యోగం చేద్దామా అంటే కనీసం పదోతరగతి కూడా పాసవ్వలేదు. అలాంటమ్మాయి.. ఇప్పుడు లక్షల మంది మహిళా రైతుల్ని ప్రభావితం చేస్తోంది! సవితా డాక్లేకి ఇదంతా ఎలా సాధ్యమైంది? చదవండి...

నాన్నది ఓ పరిశ్రమలో చిరుద్యోగం.. అయిదుగురు సంతానంలో ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయిపోయాయి. తను, ఇంకా ఇద్దరు తమ్ముళ్లు. చదువు, ఆటలు.. ఇదే ఏడో తరగతి వరకు సవిత లోకం. తర్వాత నాన్న పనిచేసే పరిశ్రమ మూతపడ్డంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వాళ్లమ్మే నాలుగు ఇళ్లలో పని చేస్తూ ఇంటికి ఆసరా అయ్యింది. వీళ్లది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌. సవిత కూడా చిన్నాచితకా పనులు చేస్తూ పదో తరగతి వరకూ నెట్టుకొచ్చింది. కానీ పాస్‌ కాలేదు. దీంతో ఓ ఫార్మా పరిశ్రమలో పనికి చేరింది. పెరుగుతున్న ఖర్చులతో పట్టణంలో బతుకు కష్టమై వీళ్ల కుటుంబం సొంతూరు పెండగావ్‌ చేరుకుంది. అక్కడే తనని ఒక చిన్న రైతుకిచ్చి పెళ్లి చేశారు.

నవ్వేవారు..
అత్తగారిదీ అంతంత మాత్రపు పరిస్థితే. కొద్ది పాటి సొంత పొలం చేస్తూనే కూలికీ వెళ్లేవారు. సవితనీ పనులకు రమ్మన్నారు. ‘పెళ్లయ్యేవరకు ఇంటి పనులే ఎరుగను. ఇక పొలం పనులెలా తెలుస్తాయి? అదే చెప్పాను. వస్తే అవే తెలుస్తాయని తీసుకెళ్లారు. ఎండల్లో తెలియని పని చాలా కష్టమనిపించేది. ఓరోజు పత్తి తీయమన్నారు. అందరూ కనీసం 15 కేజీలు తీస్తే.. నాదేమో 5 కేజీలే. మా మామగారు సహా అందరూ నవ్వారు. ఏడుపు తన్నుకొచ్చింది. ఏంటీ జీవితం అనిపించింది. అక్కలిద్దరూ హాయిగా ఉన్నారు. నన్నూ చిన్నదో చితకదో ఉద్యోగం చేసేవాడికిచ్చేసుండొచ్చు కదా! నాకెందుకిలా అన్యాయం చేశారని చాలాసార్లు అనుకున్నా. కానీ రాత మార్చలేం కదా... నవ్విన వాళ్లతోనే శెభాష్‌ అనిపించుకోవాలనుకున్నా. అందుకే అందరి కంటే ఎక్కువ కష్టపడేదాన్ని. చివరికోరోజు మా మామగారు.. ‘పట్నం పిల్ల.. కొత్తగా నేర్చుకొని అందర్నీ ఎలా దాటేసి ముందుకెళుతోందో చూశారా?’ అన్నారు. ఆరోజు మర్చిపోలేను’ అని ఆనందంగా చెబుతుంది సవిత.

 

‘ఆడవాళ్లం మనమేమీ చేయలేమనుకొని అడుగు వేయం. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా భావించొద్దు. ఎవరి కోసమూ ఆగిపోవద్దు. నేను చేయగలను అని ప్రయత్నించండి. ఏదైనా సాధ్యమే.

అదీ మలుపు
తనకు క్రమంగా వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. గ్రామంలో సేవా సమితి వాళ్లు మహిళలకు వ్యవసాయంలో మెలకువలు, కొత్తపద్ధతులు చెబుతారని తెలిసి తనూ వెళ్లాలనుకుంది. అత్తమామలు ఒప్పుకోలేదు. రెండు గంటలు అదనంగా కూలీ చేస్తానని ఒప్పించి వెళ్లింది. ‘ఆ రెండు గంటల్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. నాకూ ఆ సమితిలో భాగస్వామి అవ్వాలనిపించి దరఖాస్తు చేసుకున్నా. దీనిలో చేరితే ఎంతో తెలుసుకోవడమే కాదు.. ఆ విషయాల్ని నలుగురికీ పంచొచ్చు కూడా. ఎంపికవ్వగానే నేను చేసిన పని- ఫేస్‌బుక్‌లో ‘విమెన్‌ ఫార్మింగ్‌’ గ్రూపుని రూపొందించడం. పెళ్లికి ముందు నాన్న కొనిచ్చిన ఫోన్‌ అలా ఉపయోగపడింది. మొదట మా గ్రామంలోని 400 మంది మహిళల్ని దాన్లో చేర్చా. వ్యవసాయ మెలకువల్ని దానిలో ఉంచుతుంటా. ఎప్పుడూ ఫోన్‌ పట్టుక్కూర్చుంటావ్‌ అనేవారు ఇంట్లో. కానీ నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. అయితే నా ఫేస్‌బుక్‌ గ్రూపులో పది లక్షల మందికి పైగా చేరతారని ఊహించలేదు’ అని వివరిస్తోందీమె. దుక్కి నుంచి పంట కోయడం వరకు అందరికీ ఉపయోగపడే చిట్కాలు, పద్ధతులు, వివిధ పంటల సాగు, మార్కెటింగ్‌ సహా అన్ని అంశాలూ ఈ గ్రూపులో వివరిస్తుంది, చర్చిస్తుంది.

‘నేను ధైర్యం చేశా కాబట్టే ముందుకు సాగగలుగుతున్నా. నలుగురికీ సాయపడుతున్నా. కొత్త పద్ధతులను నేను నేర్చుకొని అందరికీ నేర్పిస్తున్నా. మా వారి కంటే ముందు బండి నేనే నేర్చుకున్నా. వ్యవసాయంలో సాయపడే భారీ వాహనాలనూ నేర్చుకుంటున్నా’ అంటోంది సవిత. అన్నట్టూ ఈమె ఇటీవలే పది పూర్తిచేసి, ఇంటర్‌ చదువుతోంది. తనకిద్దరు పిల్లలు. ఇంగ్లిష్‌ కూడా నేర్చుకుంటోంది. లింక్‌డిన్‌లో ఈమె ఖాతాను పదివేలకు పైగా అనుసరిస్తున్నారు. దానిలో చక్కని ఆంగ్లంలో తన అభిప్రాయాలను పంచుకుంటుంది. మొదట్లో ఏవైనా బిల్లులు చెల్లించడానికీ, పంట అమ్మడానికీ వెళుతోంటే చూసి ముక్కు మీద వేలు వేసుకున్న వాళ్లే ఇప్పుడామెను తమ పిల్లలకు ఆదర్శంగా చూపిస్తున్నారు. ఆమె స్ఫూర్తితో ఆ గ్రామ మహిళలు అడుగు బయట పెట్టడమే కాదు... వ్యవసాయం, ఆర్థిక వ్యవహారాలు సొంతంగా నిర్వహించుకునే స్థాయికి ఎదిగారు. ఓ సాధారణ మహిళ స్వయంకృషితో లక్షల మందికి మార్గదర్శిగా నిలవడం స్ఫూర్తిదాయకం కదూ.




 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్