వెయ్యితో మొదలై... కోట్లకు చేరిన ఆకాంక్ష!

ఎండా వానలు ఇంట్లోకి చొచ్చుకు వచ్చే రేకుల షెడ్డులో పెరిగిన ఆ అమ్మాయి పెద్దయ్యాక వ్యాపారం చేయాలనుకుంది. వెయ్యి రూపాయల పెట్టుబడితో ఆ కలకు శ్రీకారం చుట్టింది. 2010లో ఆమె ప్రారంభించిన ‘రూట్స్‌ అండ్‌ హెర్బ్స్‌’ సంస్థ కోట్ల టర్నోవర్‌తో వర్థిల్లుతోంది...

Published : 03 May 2022 01:22 IST

ఎండా వానలు ఇంట్లోకి చొచ్చుకు వచ్చే రేకుల షెడ్డులో పెరిగిన ఆ అమ్మాయి పెద్దయ్యాక వ్యాపారం చేయాలనుకుంది. వెయ్యి రూపాయల పెట్టుబడితో ఆ కలకు శ్రీకారం చుట్టింది. 2010లో ఆమె ప్రారంభించిన ‘రూట్స్‌ అండ్‌ హెర్బ్స్‌’ సంస్థ కోట్ల టర్నోవర్‌తో వర్థిల్లుతోంది...

మధ్యతరగతి కుటుంబాల్లో గృహవైద్యం మామూలే. దాన్నే వ్యాపార సూత్రంగా అవలంబించింది కోల్‌కతాకి చెందిన ఆకాంక్షా మోదీ.  రసాయనాలు ఉపయోగించి చేసే సౌందర్య సాధనాలతో దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తడం గమనించిన ఆకాంక్ష... సహజసిద్ధ పదార్థాలతో ఫేస్‌మాస్క్‌, ఫేస్‌వాష్‌, టోనర్లు, సీరమ్స్‌, సన్‌స్క్రీన్‌, కేశతైలం- ఇలా 80 రకాల సౌందర్య ఉత్పత్తులు రూపొందిస్తోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లలో సాగుతున్న ఆమె వ్యాపారం 40 దేశాలకు విస్తరించింది.

ఊహించనంత జీతం...

ఈమె తండ్రి టీవీ డాక్యుమెంటరీల నిర్మాణంలో పనిచేస్తారు. తల్లి గృహిణి. కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. ‘మేడమీద చిన్న రేకుల షెడ్డులో జీవనం. ఎండకాలం, వానాకాలం ఎన్నో ఇబ్బందులు. అయినా ఆనందంగానే గడిపేవాళ్లం’ అంటూ జ్ఞాపకాలను నెమరేసుకుంటుంది ఆకాంక్ష. ఆకులూ పూలూ వేళ్లతో మేనత్త చేసే చర్మసౌందర్య సాధనాలు అద్భుతంగా పనిచేయడం చూసి పదేళ్లకే  ప్రేరణ పొందింది తను. పెద్దయ్యాక అలాంటివి చేసి అమ్మాలనుకునేది. స్కూలు దశలోనే అధ్యయనం ప్రారంభించింది. అనేక సెమినార్లకు వెళ్లింది. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో మధ్యాహ్నానికి కాలేజీ కాగానే సౌందర్యోత్పత్తుల సంస్థలో కొలువుకి వెళ్లేది. ‘మూడున్నర వేలకు సేల్స్‌ ప్రమోటర్‌గా చేరా. అమ్మకాలు పెంచడమే నా పని. పనితీరు నచ్చడంతో ఏడాదికే మేనేజర్‌ని చేసి రూ.45 వేలు ఇచ్చారు. దానికి తగ్గట్టే లక్ష్యాలూ పెరిగినా భయపడలేదు..

జీవితాన్ని మార్చేసిన సంఘటన

2004లో నగల వ్యాపారి కృనాల్‌ మోదీని పెళ్లాడింది. అత్తింటివారు ఉద్యోగం మానేసి భర్తకు సహకరించమన్నారు. కానీ అందులో తనకు ఆసక్తి కలగలేదు. మరో ఆరేళ్లు అలాగే కొనసాగింది. ఈలోపు అత్తగారికి చర్మ సమస్య వస్తే డాక్టరు వద్దకు తీసుకెళ్లింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. క్లినిక్‌లో ఒక మహిళ మొటిమలతో ఇబ్బంది పడుతున్నానని, ఎందర్ని సంప్రదించినా ఫలితం లేదని వాపోయింది. తాను పాటిస్తున్న సహజ చిట్కాల్ని చెప్పింది ఆకాంక్ష. రెండు వారాల తర్వాత ఆమె ఫోన్‌ చేసి మొటిమలు దాదాపుగా తగ్గిపోయాయంటూ సంతోషపడింది. ఆమె మరికొందరికి చెప్పడంతో వాళ్లంతా ఆకాంక్షను సంప్రదించడం మొదలుపెట్టారు. ఆ ప్రేరణతో స్కిన్‌ గ్లో బ్లెండ్స్‌, యాంటీ ట్యాన్‌ బ్లెండ్‌.. లాంటివి తయారుచేసింది. వెయ్యి రూపాయల పెట్టుబడితో 2010లో ‘రూట్స్‌ అండ్‌ హెర్బ్స్‌’ పేరుతో ఇంట్లోనే తయారుచేసి అమ్మింది. అందరూ బాగున్నాయనడంతో ఒకసారి ప్రదర్శనలో పెట్టింది. ‘మూడున్నర వేలు అద్దె చెల్లిస్తే ఒక బల్ల కూడా పటనంత చిన్న స్టాల్‌ దొరికింది. కానీ మూడు రోజులకే తొమ్మిది వేలు లాభమొచ్చింది. అలా మొదలై రెండు మూడేళ్లలోనే రూ.50 లక్షల విలువైన యంత్రాలతో పదివేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకునేంతగా సంస్థ విస్తరించింది. ఇప్పుడు తన టర్నోవర్‌ రూ. ఆరు కోట్లు!


‘వ్యాపారం చేయాలనుకున్నపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరాశ చెందక లక్ష్యం దిశగా సాగాలి. కృషి, పట్టుదల ఉంటే విజయం తప్పక వరిస్తుంది’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్