Updated : 06/05/2022 06:00 IST

నిశ్శబ్దంగా ఉండొద్దంటూ....

నెలసరిలో పరిశుభ్రత గురించి పని మనిషి చెప్పిన మాటలకు ఆ అమ్మాయి నిర్ఘాంతపోయింది. అప్పుడు వచ్చిన ఆలోచనలు తనతోపాటే పెరిగి పెద్దయ్యాయి. అవే ఏడేళ్ల తర్వాత ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ తయారీని ప్రారంభించేలా చేశాయి. దేశవ్యాప్తంగా నెలసరి పరిశుభ్రతపై అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్న 22 ఏళ్ల ఆస్తా నేగి గురించి తెలుసుకుందాం.

నెలనెలా వచ్చే రక్తస్రావం గురించి మహిళలు మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది పడతారనేది ఆస్తా సందేహం. పైగా ఆ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపైనా చాలా మందికి పెద్దగా అవగాహన లేదు. ప్యాడ్స్‌ వాడకం పర్యావరణ హితంగానూ ఉండాలన్నదైతే అసలే తెలియదు. మొత్తంగా ఈ విషయాల గురించి బయటకు చెప్పడానికి మొహమాటపడే వారే ఎక్కువగా ఉన్నారని తను గుర్తించింది. దీనికి కారణం ఒక సారి పనిమనిషితో జరిగిన సంభాషణ. నెలసరి సమయంలో తను పాత వస్త్రాల్ని వాడతానని చెప్పిందామె. అది సరి కాదు కదా అంటే అవన్నీ నాకు తెలియదంది. అదే విషయాన్ని 15 ఏళ్ల వయసులో అమ్మను అడిగింది. ఇది ఇతరులతో చర్చించే విషయం కాదని అందరూ భావించడమే కారణమని ఆమె చెప్పడం మరింత ఆలోచింపచేసింది. అవగాహన కొరవడటంతో చాలామంది మహిళలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలుసుకుంది. ఈ ప్రభావాన్ని తగ్గించాలంటే మొదట అందరిలో చైతన్యం రావాలి. అది రావాలంటే దానికి తగినట్లుగా ప్యాడ్‌ను తయారు చేయాలనుకుంది. పలు ప్రయోగాలు చేసి చివరికి పర్యావరణ హిత ప్యాడ్స్‌ను రూపొందించగలిగింది. డిగ్రీ తర్వాత ‘షికామ్‌ ఇండియా’ సంస్థను ప్రారంభించింది. తన దగ్గర ఉన్న రూ.4,500 పెట్టుబడితో చేసిన ఆర్గానిక్‌ శానిటరీ పాడ్స్‌ను తెలిసిన, ఇరుగు పొరుగు వారికి ఉచితంగా ఇచ్చేది. వాటిని వాడిన వారు దద్దుర్లేమీ రావడం లేదని, సౌకర్యంగానూ ఉన్నాయన్నారు. ఇంకా వారి సలహాలు, సూచనలూ సేకరించేది. పర్యావరణ హితమైనవి వినియోగిస్తే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు భూమిలో త్వరగా కలిసిపోతాయనే విషయాన్ని  ప్రచారం చేయడానికి నడుం కట్టింది. తన ఆలోచన, ఉత్సాహం చూసి 10 స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. వాటి సహకారంతో కళాశాలలు, ప్రైవేటు సంస్థలను సంప్రదించి అక్కడి యువతులు, మహిళలను కలుసుకునేది. వారికి ఆర్గానిక్‌ పాడ్స్‌ అందించి వాడి అభిప్రాయాన్ని చెప్పమనేది. అలా ఆరునెలల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో అయిదువేల మందికి నెలసరి పరిశుభ్రత అంశంపై అవగాహన కలిగేలా చేసి, వారికి షికామ్‌ ఇండియా న్యాప్‌కిన్లను వినియోగించడంపై ఆసక్తిని తీసుకొచ్చింది.

అవగాహనతోపాటు..

ఉచితంగా అందించడంతో వాటి గురించి తెలుసుకున్న వారంతా తాను తయారు చేస్తున్న ప్యాడ్స్‌ను కొనడం మొదలుపెట్టారని వివరించింది ఆస్తా. ‘మొదటి పెట్టుబడి ఉచిత ప్యాడ్స్‌ తయారీకే ఖర్చు అయిపోయింది. తర్వాత మరికొంత వెచ్చించి భారీగా తయారీ మొదలుపెట్టా. క్రమేపీ విక్రయాలు పెరిగాయి. నెలకు రూ.10 వేల నుంచి ప్రస్తుతం రూ.లక్ష ఆదాయం వచ్చే స్థాయికి పెరిగింది. దీని తయారీలో మహిళలకే ఉపాధిని కల్పిస్తున్నా. లాభాలు సంపాదించడం నా ఉద్దేశం కాదు... అందరిలోనూ దీనిపై మాట్లాడగలిగే ధైర్యాన్ని తేవాలి, నెలసరిలో పరిశుభ్రతపై గ్రామాల్లోనూ అవగాహన కల్పించాలి... ఇవీ నా లక్ష్యాలు. వీటి సాధన కోసమే ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా’ అని చెప్పుకొచ్చిందీ యువతేజం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి