Published : 07/05/2022 00:41 IST

పవర్‌ లిఫ్టింగ్‌లో రికార్డుకెక్కింది!

వినుత

ఎవరైనా ‘కెరియర్‌ మారతా’ అంటే ఏమనుకుంటాం? ఇది నచ్చలేదనో, సరైన అవకాశాలు లేవనో మారుతున్నారనుకుంటాం. కానీ వినుత రంగనాథ్‌.. ఏరికోరి తెచ్చుకుని- నీడపట్టున చేసుకునే ఉద్యోగాన్ని కాదన్నారు. ఏమాత్రం పరిచయం లేని రంగంలోకి అడుగుపెట్టారు. ‘అయ్యో ఎందుకీ రిస్క్‌?’ అనిపిస్తోంది కదా! చాలామంది పిచ్చితనమంటూ తిట్టిపోశారు కూడా. అయినా వినకుండా ఆమె వేసిన అడుగు పేరు తేవడమే కాదు.. ప్రపంచ రికార్డును నెలకొల్పేలానూ చేసింది.

చిన్నప్పటి నుంచీ ‘బాగా చదివితేనే భవిష్యత్తు..’ అన్న అమ్మానాన్నల మాటల్నే అనుసరించారు వినుత. సీఏ పూర్తిచేసి చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. ఇల్లు, ఉద్యోగం ఇవే ఆమె ప్రపంచం. ఇంకా నలభయ్యో పడిలోకీ అడుగు పెట్టలేదు. ఊబకాయం, కీళ్లనొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి వెళితే.. శరీరానికి వ్యాయామం లేదన్నారు. అప్పటికిగానీ ఆమెకు అర్థం కాలేదు.. ఏళ్లుగా కుర్చీకే పరిమితమై గడిపేస్తున్నానని! దీంతో జిమ్‌లో చేరారు. వెయిట్‌ ట్రైనింగ్‌తో త్వరలోనే నొప్పులు మాయమయ్యాయి. దీంతో అదామెకు విపరీతంగా నచ్చి మరింత ఉత్సాహంగా చేసేవారు. దీన్నిచూసి ఓసారి ఒకరు ‘అచ్చంగా ప్రొఫెషనల్‌లాగే బరువులు ఎత్తుతున్నావే! పోటీలకు ఏమైనా ప్రయత్నిస్తున్నావా?’ అన్నారు. అప్పటికి ఆమె నవ్వి ఊరుకున్నా.. ఆ మాటలు జిమ్‌ శిక్షకుల చెవిలో పడ్డాయి. దీంతోవాళ్లు సీరియస్‌గా ప్రయత్నించమని సలహానిచ్చారు. వాళ్ల ప్రోత్సాహంతో పవర్‌ లిఫ్టింగ్‌ ప్రయత్నించారు.

‘36 ఏళ్లవరకూ ఒక్క ఆటనీ ఆడలేదంటే నమ్ముతారా? మాది తిరువనంతపురంలోని బ్రాహ్మణ కుటుంబం. చదువే నా లోకం. జిమ్‌లో చేరేవరకూ పవర్‌ లిఫ్టింగ్‌ అనేదొకటి ఉందనే తెలియదు. జిమ్‌ శిక్షకుల పరిధి తక్కువ. దీంతో దీని గురించి నేర్పే వాళ్ల కోసం ప్రయత్నించా. ఫలితం లేదు. ఆన్‌లైన్‌లో నిపుణుల వీడియోలతో సాధన చేశా. ఇదీ వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటిదే. అయితే దీనిలో బరువులను తలపైకి ఎత్తాల్సిన పనుండదు.ఇంట్లోనే గ్యారేజీలో జిమ్‌ ఏర్పాటు చేసుకున్నా. పోటీల్లో పాల్గొనడం ప్రారంభించా. మొదటిసారే రజతం సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొనడం మొదలుపెట్టా. యూఎస్‌ అకాడమీ నుంచి సర్టిఫికెట్‌నూ సాధించి, పవర్‌ లిఫ్టింగ్‌ ట్రైనర్‌నయ్యి ఇతరులకీ శిక్షణనిస్తున్నా. 46 ఏళ్ల వయసులో.. కామన్‌వెల్త్‌ పోటీల్లో దేశానికి బంగారు పతకం తేవడం, అంతర్జాతీయ వేదికలపై బెస్ట్‌ లిఫ్టర్‌ అవార్డులను అందుకోవడం ఆనందం. ఇన్నేళ్లలో 8 స్ట్రాంగ్‌ ఉమన్‌ టైటిళ్లు, 2 ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లూ గెల్చుకున్నా. ఇటీవలే 54 ఏళ్ల వయసులో ‘బెస్ట్‌ లిఫ్టర్‌ ఆఫ్‌ ఇండియా’తోపాటు 130 కేజీల బరువెత్తి ప్రపంచ రికార్డునూ అందుకున్నా. నేను దీనిలోకి అడుగుపెట్టినపుడు బ్రాహ్మణ మహిళవై ఉండి.. ఏమిటివన్నీ అన్నారు. కానీ మావారు, పాప నాకు అండగా నిలిచారు. గెలవడం మొదలుపెట్టాక ‘ఇంకేం.. గెలిచావుగా! ఆపొచ్చుగా’ అనో ‘ఈ వయసులో ఇంకా ఎందుకు’ అనో అంటుంటారు. వాళ్లకి.. విజయమంటే ఒక స్థానం కాదు.. నిరంతరం నిరూపించుకునే ప్రక్రియ అని సమాధానమిస్తా’’ అని చెప్పే వినుత.. త్వరలో కెనడా, న్యూజీలాండ్‌ల్లో జరిగే పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో తన రికార్డును తానే బద్దలు కొట్టడం లక్ష్యమని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి