Updated : 12/05/2022 06:21 IST

సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది...

ఆశల ఆనందాల్లో తేలిపోతూ, ఆకాశమెత్తున విహరించాలని కలలు కంటోందామె. ఒకే ఒక్క క్షణంలో అంతా తారుమారయ్యింది. రోడ్డు ప్రమాదం ఆమెని అమాంతం పాతాళంలోకి విసిరేసింది. జనం జాలి మాటలతో మరింత ముడుచుకు పోయింది. ఏమిటిది, ఎందుకిలా అని తిట్టుకోవడం, విధి రాత అని సరిపెట్టుకోవడం ఘోరమనుకుంది. కాళ్లు కదపలేకపోయినా ధైర్యాన్నే ఆసరా చేసుకుని విజేతగా దూసుకెళ్తోన్న డాక్టర్‌ దివ్యాసింగ్‌ కథ ఆమె మాటల్లోనే...

హ తెలిసిందగ్గర్నుంచీ డాక్టరవ్వాలన్నదే నా కలా, కోరికా. నాన్న ఊతంతో ఎంబీబీఎస్‌, ఎండీ అయ్యాక రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పీడియాట్రిక్స్‌ విభాగంలో సీనియర్‌ రెసిడెంట్‌గా చేరాను. అంతటితో తృప్తి కలగలేదు. మరింత చదవాలనుకుని డి.ఎం.నియోనెటాలజీకి సిద్ధమయ్యాను. 2013 డిసెంబర్‌ 15న దిల్లీలో పరీక్ష రాసి, మర్నాడు స్నేహితులతో ఆగ్రా బయల్దేరాను. నగరమంతా మంచు కప్పేసింది. ఎదురుగా ఏముందో కనిపించడంలేదు. మా కారును ఓ బస్సు గుద్దేసింది. కారు నడుపుతున్న స్నేహితురాలు అక్కడికక్కడే చనిపోయింది. వెనుక సీట్లో కూర్చున్న నన్ను రక్తం మడుగులోంచి తరలించడం వరకే గుర్తుంది. స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. ఎంత ఘోర ప్రమాదమంటే ఒళ్లంతా గాయాలే. వెన్ను దెబ్బతింది. వైద్య పరిభాషలో దాన్ని క్వాడ్రిప్లెజియా అంటారు.

చికిత్స దుర్భరంగా ఉండేది. బతుకు భారమనిపించేది. నేనొక డాక్టర్ని, నాకేమైందో నాకు తెలుసు. జీవితం పూర్వమున్నట్టు ఉండదు. ఇతరుల మీద ఆధారపడాలి.  రోజులెలా దొర్లించాలి అంటూ కుమిలి పోయేదాన్ని. వచ్చీ పోయేవారి జాలి మాటలు మరింత కుంగదీసేవి. ఆ క్లిష్ట సమయంలో ‘నీ కలలు తాత్కాలికంగా ఆగాయే తప్ప అవేం చనిపోలేదు’ అంటూ నాన్న, అన్నయ్య ఆసరా అందించారు, ఊతంగా నిలిచారు. వాళ్ల మాటలతో ఉత్తేజితురాల్నయ్యాను.

ఆర్నెల్ల తర్వాత చక్రాల కుర్చీలో సొంతూరు రాంచీ చేరాను. మొన్నటిదాకా ఉత్సాహంతో పరుగులుతీసిన నేను అలా కనిపించడం బాధేసింది. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నాను, బలం పుంజుకున్నాను. తిరిగి ఉద్యోగంలో చేరాను. చక్రాల కుర్చీలో ఉద్యోగమెలా చేయాలాని దిగులూ దుఃఖం కలిగినా త్వరలోనే వాటిని అధిగమించాను. భయాలను పట్టుదలతో గెలిచాను. ప్రమాదానికి ముందు ఎంత శ్రద్ధాసక్తులతో పని చేశానో ఇప్పుడూ అలాగే అంకితభావంతో చేస్తున్నాను. నా సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది.

కారులో ప్రయాణించలేను కనుక వ్యాన్‌ తీసుకుని దాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు నాన్న. ఆసుపత్రిలో దిగాక ర్యాంప్‌ మీద చక్రాల కుర్చీలో వార్డుకు వెళ్తాను. మొదట్లో వింతగా చూసినా ఇప్పుడంతా ‘వీల్‌ చెయిర్‌ డాక్టరమ్మ’ అంటారు ప్రేమగా. కొవిడ్‌ కాలంలో ఈ-సంజీవని అప్పగించారు నాకు. రెండున్నరేళ్లలో పదివేలకు పైగా కరోనా బాధితులకు ఆన్‌లైన్లో వైద్యం చేశాను. రెండుసార్లు నేనూ దాని బారిన పడినా వెనుకంజ వేయక నాకు నేను చికిత్స చేసుకుంటూ వేలాదిమందికి చేశాను. నా అనుభవాలన్నిటినీ కలబోసి ‘గర్ల్‌ విత్‌ వింగ్స్‌ ఆన్‌ ఫైర్‌’ పేరుతో ఆత్మకథ రాశాను. జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా కుంగిపోవద్దు, పారిపోవద్దు. మామూలు రోజుల్లాగే కష్ట దినాలూ వెళ్లిపోతాయి. మనల్ని మనం నమ్ముకుని ముందుకు సాగాలంతే..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి