26 ఏళ్లకే వేల కోట్ల వ్యాపారం!

చిన్నప్పటి నుంచి భవనాలు కట్టడం అంటే ఆమెకు పిచ్చి... విద్యార్థి దశలోనే ఖాళీ సమయంలో బిల్డర్‌ల దగ్గర పని చేసింది. ఆ రంగంలోని ఇబ్బందులను తానెలా తీర్చగలదా అని ఆలోచించేది. చదువు అవ్వగానే వినూత్న ఆలోచనతో వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లలోనే తన సంస్థను వేల కోట్ల రూపాయలకు చేర్చింది... ఇదంతా లండన్‌లో స్థిరపడ్డ భారతీయ యువతి, 26 ఏళ్ల ఆర్యా తవారే విజయగాథ......

Updated : 13 May 2022 06:25 IST

చిన్నప్పటి నుంచి భవనాలు కట్టడం అంటే ఆమెకు పిచ్చి... విద్యార్థి దశలోనే ఖాళీ సమయంలో బిల్డర్‌ల దగ్గర పని చేసింది. ఆ రంగంలోని ఇబ్బందులను తానెలా తీర్చగలదా అని ఆలోచించేది. చదువు అవ్వగానే వినూత్న ఆలోచనతో వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లలోనే తన సంస్థను వేల కోట్ల రూపాయలకు చేర్చింది... ఇదంతా లండన్‌లో స్థిరపడ్డ భారతీయ యువతి, 26 ఏళ్ల ఆర్యా తవారే విజయగాథ...

గూటి పక్షి ఆ పలుకే పలుకుతుందన్నట్లు ఆర్యా తవారే బిల్డర్‌ అయిన తన తండ్రి కళ్యాణ్‌ తవారేను చూసి ప్రేరణ పొందింది. మహారాష్ట్ర, బారామతి తాలూకాలోని కటేవాడికి చెందిన ఆర్య చిన్నప్పటి నుంచే ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది. మహిళలు అరుదుగా ఉండే ఈ రంగంలో అడుగుపెట్టాలని అప్పుడే నిర్ణయించుకుంది. ఇంటర్‌ వరకు పుణెలో, తర్వాత లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది. బడి, కాలేజీ రోజుల్లో సెలవులొచ్చినప్పుడల్లా బిల్డర్ల దగ్గర పనిచేసేది. ఆ సమయంలోనే చిన్న, మధ్యస్థాయి బిల్డర్స్‌ ఆర్థిక సమస్యలెదుర్కోవడం దగ్గర నుంచి చూసింది. ఈ సమస్యను పరిష్కరించాలని క్రౌడ్‌ ఫండింగ్‌ పద్ధతిని మొదలుపెట్టి, పెట్టుబడి సమస్య ఉన్న వారికి చేయూతనందించేది. తన ఉత్సాహం, చొరవ, ఆసక్తి, ఇతరులకు సాయం చేసే పద్ధతుల్నీ గుర్తించిన యూనివర్శిటీ ఇందుకోసం ఆమెకు ప్రత్యేకంగా చిన్నఆఫీస్‌ సౌకర్యాన్నీ కల్పించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తన వ్యాపార ఆలోచనలతో ‘యూసీఎల్‌ బ్రైట్‌ ఐడియా’ పురస్కారాన్ని సాధించింది. డిగ్రీ పూర్తవ్వగానే  ఆర్య ‘ఫ్యూచర్‌బ్రిక్స్‌’ స్టార్టప్‌ను స్థాపించింది.

పెద్ద పెద్ద సంస్థలే చేయి కలిపాయి

‘ఈ స్టార్టప్‌ ద్వారా కింది స్థాయిలో ఉన్న బిల్డర్స్‌కు పెట్టుబడి అందేలా చేస్తున్నా. ఈ నాలుగేళ్లలోనే (32.7 కోట్ల పౌండ్స్‌) రూ.3 వేల కోట్ల స్థాయికి మా సంస్థ చేరుకుంది. లండన్‌లో పెద్ద పెద్ద సంస్థలు మాతో చేయి కలిపాయి. మా సంస్థ స్థానికంగా 22 రకాల కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులతో కలిసి పనిచేస్తోంది. లండన్‌లోని గృహసముదాయాలూ, అతిపెద్ద గృహ నిర్మాణ ప్రాజెక్టులకూ కార్పొరేట్‌, బ్యాంకుల్లాంటి రుణ సంస్థల నుంచి రుణాలు అందేలా చేస్తున్నాం. దీంతో కింది స్థాయి బిల్డర్లు కూడా లబ్ధి పొందే అవకాశాలుంటాయి. 30 ఏళ్లలోపే యూరోపియన్‌ ఫినాన్షియల్‌ సెక్టార్‌లో ప్రజలను ప్రభావితం చేసిన అత్యంత శక్తివంతమైన యువ మహిళా వ్యాపారవేత్తగా ఫోర్బ్స్‌ గుర్తించింది. అందుకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది’ అని చెప్పుకొస్తున్న ఆర్యా ఈ సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా చేయడమే కాదు.. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగానూ నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్