ఈ పని నావల్ల కాదన్నారు

‘మేమూ మగవాళ్లలానే కరెంట్‌ స్తంభాలు ఎక్కి... విద్యుత్‌ పనులు చేస్తాం’అంటే అంతా విచిత్రంగా చూశారు. ఆ పనికి దరఖాస్తు చేసుకుంటే.. ఆడవాళ్లు ఈ పనికి అర్హులు కాదు పొమ్మన్నారు. ఈ అవరోధాలని, సవాళ్లని పట్టుదలతో తిప్పికొట్టింది శిరీష. ఇప్పుడు డిస్కంలో తొలి మహిళా లైన్‌ ఉమెన్‌గా అందరి మన్ననలు అందుకుంటోంది. సిద్దిపేట జిల్లా మార్కుక్‌ మండలం చిబర్తీ గ్రామానికి చెందిన బబ్బూరి శిరీష 2017లో మేడ్చల్‌లో ఐటీఐ(ఎలక్ట్రికల్‌) పూర్తిచేసింది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తుంటారు....

Updated : 13 May 2022 03:14 IST

అందరూ నడిచే దారి సౌకర్యంగానే ఉండొచ్చు... కానీ కొత్తదారుల గురించి తెలుసుకోకపోతే సరికొత్త గమ్యాలు ఎలా తెలుస్తాయి? 21 ఏళ్ల శిరీష ఎవరూ నడవని దారిలో నడిచి నవతరం అమ్మాయిలకు స్ఫూర్తినందిస్తోంది. ఇందుకోసం రెండేళ్లు పోరాడి... మొదటి మహిళా జేఎల్‌ఎమ్‌గా చరిత్ర సృష్టించింది.  

‘మేమూ మగవాళ్లలానే కరెంట్‌ స్తంభాలు ఎక్కి... విద్యుత్‌ పనులు చేస్తాం’అంటే అంతా విచిత్రంగా చూశారు. ఆ పనికి దరఖాస్తు చేసుకుంటే.. ఆడవాళ్లు ఈ పనికి అర్హులు కాదు పొమ్మన్నారు. ఈ అవరోధాలని, సవాళ్లని పట్టుదలతో తిప్పికొట్టింది శిరీష. ఇప్పుడు డిస్కంలో తొలి మహిళా లైన్‌ ఉమెన్‌గా అందరి మన్ననలు అందుకుంటోంది. సిద్దిపేట జిల్లా మార్కుక్‌ మండలం చిబర్తీ గ్రామానికి చెందిన బబ్బూరి శిరీష 2017లో మేడ్చల్‌లో ఐటీఐ(ఎలక్ట్రికల్‌) పూర్తిచేసింది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తుంటారు. 2019లో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నుంచి 534 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయ్యినప్పుడు చాలా సంతోషపడింది శిరీష.. తనూ దరఖాస్తు చేసుకోవచ్చని. కానీ ఆ ఉద్యోగానికి పురుషులు మాత్రమే అర్హులు అనడంతో నిరాశ పడింది. అయితే అప్పటికే ట్రాన్స్‌కోలో మహిళలకు లైన్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వడంతో.. శిరీష మాదిరిగానే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 32 మంది మహిళలు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రాత పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు స్తంభం ఎక్కే పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టారు. మహిళలకి మాత్రం నిర్వహించలేదు. దాంతో శిరీష సహా 8 మంది మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా అవకాశం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. రాత పరీక్షలో అర్హత సాధించిన భారతీ, శిరీషలకు 2020 డిసెంబరు 23న ఎర్రగడ్డలోని సెంట్రల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరీక్షలు నిర్వహించారు. ఇద్దరూ 8 మీటర్ల ఎత్తున్న స్తంభాలను విజయవంతంగా ఎక్కారు. ట్రాన్స్‌కోలో ముందుగా నియామకాలు చేపట్టడంతో భారతి హన్మకొండలో జూనియర్‌ లైన్‌ ఉమెన్‌గా చేరింది. తాజాగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ శిరీషకు జేఎల్‌ఎంగా మేడ్చల్‌ సర్కిల్‌లో పోస్టింగ్‌ ఇచ్చింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ చరిత్రలోనే తొలి లైన్‌ ఉమెన్‌గా సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.

‘మామయ్య విద్యుత్తు శాఖలో పనిచేస్తారు. ఆయనే మున్ముందు అమ్మాయిలకు అవకాశాలు ఉంటాయి అని నాతో ఐటీఐ ఎలక్ట్రికల్‌ చదివించారు. చదువు పూర్తి కావడం, పోస్టులు పడటం చకచక జరిగినా.. కోర్టుకెళితే గానీ పరీక్షల దాకా రాలేకపోయాం. పోటీ తీవ్రంగా ఉండటంతో కసితో చదివి రాత పరీక్షలో అర్హత సాధించాను. మొదటి నుంచి అర్హత సాధిస్తాననే నమ్మకం ఉండటంతో మామయ్యతో పాటూ వెళ్లి స్తంభాలు ఎక్కడం సాధన చేశా. అందరూ కొత్తగా, వింతగా చూసినా నా పని నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. పట్టుదొరికితే స్తంభం ఎక్కడం తేలిక. అందుకోసం దాదాపు నెలరోజులు శ్రమించాను. ఆ తర్వాత వేగంగా ఎక్కడం అలవాటైంది. స్తంభం ఎక్కే పరీక్షను విజయవంతంగా పూర్తిచేయడంతో ఎప్పటికైనా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉండేది. ఆలస్యం కావొచ్చు తప్ప ఉద్యోగమైతే గ్యారంటీ అనుకున్నాను. కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడేవి. ఈ మధ్యలో ఖాళీగా ఉండకుండా డిగ్రీలో చేరాను. నాకు పెళ్లి కూడా అయ్యింది. నా భర్త సందీప్‌, అత్తామామలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు’ అంటోంది శిరీష. మరో వెయ్యి జేఎల్‌ఎం పోస్టులకు డిస్కం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఇందులో మహిళలు సైతం పోటీపడవచ్చని దారి చూపించింది శిరీష.

- రమేష్‌ మల్లేపల్లి, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్