పూలమ్మిన చేతులతోనే పీహెచ్‌డీ

సిగ్నళ్ల దగ్గర పూలు అమ్మేదా అమ్మాయి. అయినా పెద్ద చదువులు చదవాలని కలగంది. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని సాకారం చేసుకుంది. ఇప్పుడు న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయడానికి అర్హత సాధించింది. తనలాంటి వారికి ఉచితంగా విద్యనందించాలన్నదే లక్ష్యం అంటున్న సరితామాలి స్ఫూర్తి కథనమిది.

Published : 18 May 2022 01:17 IST

సిగ్నళ్ల దగ్గర పూలు అమ్మేదా అమ్మాయి. అయినా పెద్ద చదువులు చదవాలని కలగంది. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని సాకారం చేసుకుంది. ఇప్పుడు న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయడానికి అర్హత సాధించింది. తనలాంటి వారికి ఉచితంగా విద్యనందించాలన్నదే లక్ష్యం అంటున్న సరితామాలి స్ఫూర్తి కథనమిది.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర కాసేపు వాహనాలు ఆగితే చాలనుకునేది ముంబయికి చెందిన సరితామాలి. తన చేతిలో పూలను ఎవరైనా కొంటారేమో అని చూసేది. వాటిని త్వరగా విక్రయిస్తే బడికెళ్లొచ్చనేది ఆమె ఆశ. ఉదయాన్నే మార్కెట్‌కెళ్లి తండ్రి తెచ్చే పూలను మాలలుగా గుచ్చి వాటిని సిగ్నల్స్‌ వద్ద సరిత విక్రయించేది. ఏ రోజైనా రూ.300 వస్తే తనకు పండగే.

నా బాల్యమే గుర్తొస్తుంది..

ముంబయి పారిశ్రామిక వాడ ఘట్‌కోపర్‌ వాళ్లది. నలుగురు పిల్లల్లో సరిత పెద్దది. చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు, అమ్మానాన్న అందరూ ఒకే చిన్న గదిలో ఉండేవారు. ఉత్తర్‌ప్రదేశ్‌, జౌన్‌పుర్‌కు చెందిన ఈ కుటుంబం బతుకుతెరువు కోసం ముంబయికి చేరింది. సరిత తండ్రి పూల వ్యాపారం చేసేవాడు. పిల్లలను బాగా చదివించాలని అనుకునే వారు. మున్సిపల్‌ స్కూల్‌లో పిల్లలను చేర్పించారు. తరగతులు పెరుగుతున్న కొద్దీ పుస్తకాలు వంటివి కొనుక్కోవాలంటే నాన్నను అడగడానికి సరిత ఇబ్బంది పడేది. దాంతో ప్రైవేట్లు చెప్పేది. తండ్రి ప్రోత్సాహంతో తన సంపాదనలో కొంత పొదుపు చేసేది. ఇంటర్‌ కొచ్చేసరికి తన ఫీజులు తానే చెల్లించుకునే స్థాయికి చేరింది. కేజే సోమయ్య కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో డిగ్రీ చేసింది. హిందీ సాహిత్యంపై మక్కువతో జేఎన్‌యూలో ప్రవేశపరీక్ష రాసి సీటు సాధించింది. అక్కడ హిందీ సాహిత్యంలో ఎంఏ చేసింది. దాతల సాయంతో ఈ యూనివర్శిటీలో పీజీ చేసే అవకాశం దక్కడం తన జీవితాన్ని మార్చేసింది అంటుంది తను. ‘సిగ్నల్స్‌ దగ్గర చిన్న పిల్లలు పూలు అమ్ముతున్న దృశ్యం ఎప్పుడు చూసినా.. నా బాల్యమే గుర్తొస్తుంది. అందుకే నా కాళ్లపై నేను నిలబడ్డాక వీధిబాలలకు విద్యనందించాలని ఉంది. హిందీ సాహిత్యమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే ఇందులోనే ఎంఏ చేశా. తర్వాత పీహెచ్‌డీ చేయడానికి కాలిఫోర్నియా విశ్వ విద్యాలయానికి దరఖాస్తు చేసుకొని అర్హత సాధించా. మురికివాడలో పెరిగి, పూలు అమ్ముతూ చదువుపై ఆసక్తితో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి విదేశం చేరుకున్న నన్ను చూసి నా తోబుట్టువులకు కూడా చదువుపై ఆసక్తి పెరిగింది. మేమందరం పెద్ద చదువులు చదవాలి. అమ్మానాన్నలకు అండగా నిలిచి వాళ్లు గర్వపడేలా ఎదగాలి’ అని చెబుతున్న 28 ఏళ్ల సరిత కథ స్ఫూర్తిదాయకం కదూ. జేఎన్‌యూ నుంచి ఎమ్‌ఏ, ఎమ్‌ఫిల్‌ పట్టభద్రురాలైన సరిత అక్కడ ఉన్న పిన్న వయస్కురాళ్లలో ఒకరు కావడం మరో విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్