ఆమెకు.. ఎవరెస్ట్‌ తలవంచింది!

భువనగిరి కోట పక్కనుంచి వెళ్లినప్పుడల్లా ఆమెలో ఓ కోరిక. ఎప్పటికైనా ఆ కోటని ఎక్కాలని! ఆ కల తేలిగ్గానే నెరవేరింది.. అప్పుడొచ్చిన ఆత్మవిశ్వాసం.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలని అధిరోహించాలనే మరో గొప్ప సంకల్పానికి ప్రాణం పోసింది. సవాళ్లకి ఎదురొడ్డి ఎన్నో పర్వతాలని అధిరోహించిన పడమటి అన్వితారెడ్డి.. తాజాగా ఎవరెస్ట్‌ శిఖరాన్నీ అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఆకాశపు అంచున ఎగరేసింది..

Published : 18 May 2022 01:48 IST

భువనగిరి కోట పక్కనుంచి వెళ్లినప్పుడల్లా ఆమెలో ఓ కోరిక. ఎప్పటికైనా ఆ కోటని ఎక్కాలని! ఆ కల తేలిగ్గానే నెరవేరింది.. అప్పుడొచ్చిన ఆత్మవిశ్వాసం.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలని అధిరోహించాలనే మరో గొప్ప సంకల్పానికి ప్రాణం పోసింది. సవాళ్లకి ఎదురొడ్డి ఎన్నో పర్వతాలని అధిరోహించిన పడమటి అన్వితారెడ్డి.. తాజాగా ఎవరెస్ట్‌ శిఖరాన్నీ అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఆకాశపు అంచున ఎగరేసింది..

ష్యాలోని మౌంట్‌ఎల్‌బ్రస్‌ పర్వతం అది. సముద్రమట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతంలో.. గాలికూడా గడ్డకట్టేంత శీతాకాలపు చిక్కటి చలి. పదిరోజుల క్రితమే ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకున్న ఐదుగురు చనిపోయారని తెలిసినా, అన్విత ధైర్యంగా అక్కడ అడుగుపెట్టింది. మైనస్‌ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఎక్కిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కింది. ఆ విజయంలో చిన్న అపశృతి కూడా జరిగింది. శిఖరాగ్రం చేరుకున్నాక జెండాను ఎగరేసే క్రమంలో జరిగిందీ ప్రమాదం. వేగంగా వీస్తున్న చలిగాలుల వల్ల ముఖానికున్న కవర్‌ ఊడిపోయింది. దాంతో నోటివద్ద బలమైన గాయమైంది. స్పర్శ తెలియకుండా పోయింది. నల్లటి మచ్చ. రెండు నెలల పాటు చికిత్స తీసుకున్నాకే.. నయమైంది. ఇంత రిస్క్‌ తీసుకోవడానికి కారణం... ఎవరెస్ట్‌ కల. దానిని అధిరోహించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రూ.25 లక్షలు వరకూ ఖర్చవుతుంది. స్పాన్సర్స్‌ కోసం వెతికితే ‘బక్కగా ఉన్నావు. అమ్మాయివి’.. అంటూ నిరుత్సాహపరిచారు. దాంతో తనని తాను నిరూపించుకోవడం కోసం మౌంట్‌ ఎల్‌బ్రస్‌ ఎక్కింది అన్విత.

అన్విత స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి. తల్లి చంద్రకళ అంగన్‌వాడీ టీచర్‌. తండ్రి రైతు. చిన్నప్పుడు భువనగిరి కోట పక్కనుంచే స్కూల్‌కు వెళుతుండేది. అప్పుడప్పుడు అక్కడ కొందరు రాక్‌ క్లైంబింగ్‌ చేయడం చూసి తను కూడా ఎప్పటికైనా అలా చేయాలని అనుకునేది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాక సెలవుల్లో రాక్‌ క్లైంబింగ్‌లో శిక్షణనిస్తామని పత్రికలో ఓ ప్రకటన చూసి అమ్మానాన్నలని ఒప్పించి, ఐదు రోజుల శిక్షణకు వెళ్లింది. అన్విత ఉత్సాహం, చురుకు చూసి అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇస్తే అద్భుతాలు చేస్తుందని కోచ్‌ అన్విత తల్లిదండ్రులకు సూచించాడు. అలా ఇంటర్‌ పూర్తయ్యాక సిక్కింలోని బీసీ రాయ్‌ పర్వతం వద్ద 40 రోజుల శిక్షణ తీసుకుంది. భువనగిరిలోనే నవభారత్‌ డిగ్రీ కాలేజ్‌లో జాయిన్‌ అయ్యి, సెలవుల్లో రాక్‌ క్లైంబింగ్‌ సాధన చేస్తుండేది. హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభలో ఎంబీఏ సీటు వచ్చినప్పుడు శని, ఆదివారాలు తాను క్లైంబింగ్‌కి వెళతానని ముందుగానే ప్రిన్సిపల్‌తో చెప్పింది. దాంతో ‘మీ అమ్మాయి ఇలా అంటోంది. క్లాసులకు డుమ్మా కొట్టనంటేనే సీటు ఇస్తాం’ అంటూ హామీపత్రం రాయించుకుని చేర్చుకున్నారు కాలేజీ వాళ్లు. ఇచ్చిన మాట ప్రకారం చదువుని నిర్లక్ష్యం చేయకుండా ప్రథమశ్రేణిలో పూర్తి చేసింది. మరోవైపు నైపుణ్యాలు పెంచుకోవడం కోసం ట్రాన్సెన్డ్‌ అడ్వెంచర్స్‌ సంస్థలో చేరి శిక్షకుడు శేఖర్‌బాబు వద్ద మెలకువలు నేర్చుకుంది.

విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ...

తన కల ఎవరెస్ట్‌ని చేరుకోవడం. ఇందుకోసం హిమాలయాల్లో నెల పాటు బేసిక్‌ కోర్సు పూర్తి చేసింది. కానీ జాకెట్లు, బూట్లు, గేర్‌లకు లక్షల రూపాయలవుతాయి. దాంతో స్పాన్సర్స్‌ దొరక్క ఎన్నో ఇబ్బందులు పడింది. మరోపక్క కొవిడ్‌. చివరకు అన్వితా కన్‌స్ట్రక్షన్స్‌ అందించిన సాయంతో మే 12న సాహస యాత్ర ప్రారంభించి ఈనెల 16న ఎవరెస్టు శిఖరం చేరుకుంది. ‘ఎవరెస్ట్‌ ఎక్కిన మలావత్‌ పూర్ణ, ఆనంద్‌లే నాకు ఆదర్శం. ఫిట్‌నెస్‌ కోసం రోజూ యోగా చేస్తాను. రన్నింగ్‌, పుల్‌అప్స్‌ వంటి వర్కవుట్స్‌ చేస్తా. డైట్‌లో ఎక్కువగా మాంసాహారం, ప్రొటీన్‌ ఉండేట్టు చూసుకుంటాను’ అనే అన్విత భువనగిరి కోటలోనే శిక్షకురాలిగా మారి.. గురుకుల పాఠశాలల విద్యార్థినులను మెరికల్లా తయారుచేస్తోంది. ఇప్పటివరకూ సిక్కింలోని రీనాక్‌, బీసీరాయ్‌, కిలిమంజారో, కడే,  ఎల్‌బ్రస్‌ పర్వతాలు అధిరోహించింది. తాజాగా ఎవరెస్ట్‌. ఈ ఆత్మవిశ్వాసంతో మరో 7 పర్వతాల అధిరోహణకు సిద్ధమవుతోంది.

- భూపతి సత్యనారాయణ, ఈనాడు జర్నలిజం స్కూల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్