కార్లకు భాష నేర్పిస్తా!

మనం పక్కవాళ్లతో మాట్లాడినట్టుగా... కార్లు కూడా పక్క కార్లతో ముచ్చట్లాడితే ఎలా ఉంటుంది? అరె.. ఇదేం వెటకారం కాదు. నిజంగానే కార్లు ముచ్చటించుకుంటాయి. సాంకేతిక పరిభాషలో దీనిని వీటూఎక్స్‌ టెక్నాలజీ అంటారు. ఇందులో అగ్రగామిగా ఉన్న సుజుకీ సంస్థ సాంకేతిక బృందాన్ని నడిపిస్తోంది.. మన తెలుగమ్మాయి తమ్మినేని ప్రత్యూష. తన పరిశోధనల్ని వసుంధరతో పంచుకుంది...

Updated : 19 May 2022 02:51 IST

మనం పక్కవాళ్లతో మాట్లాడినట్టుగా... కార్లు కూడా పక్క కార్లతో ముచ్చట్లాడితే ఎలా ఉంటుంది? అరె.. ఇదేం వెటకారం కాదు. నిజంగానే కార్లు ముచ్చటించుకుంటాయి. సాంకేతిక పరిభాషలో దీనిని వీటూఎక్స్‌ టెక్నాలజీ అంటారు. ఇందులో అగ్రగామిగా ఉన్న సుజుకీ సంస్థ సాంకేతిక బృందాన్ని నడిపిస్తోంది.. మన తెలుగమ్మాయి తమ్మినేని ప్రత్యూష. తన పరిశోధనల్ని వసుంధరతో పంచుకుంది...

కార్లు... వాటి చుట్టూ ఉండే టవర్లూ, పరికరాలు, ఇతర కార్లతో అనుసంధానం అవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. వాటిలో రహదారి భద్రత, ఇంధన ఆదా, ట్రాఫిక్‌ నియంత్రణ వంటివి ప్రధానమైనవి. అంబులెన్స్‌లు వస్తుంటే... డ్రైవర్‌కి చెప్పి దారిమ్మని సూచిస్తాయి. ఎవరైనా రాంగ్‌రూట్లో వస్తుంటే... ప్రమాదం జరగకుండా నివారిస్తాయి. అవసరం అయితే వాహన వేగాన్నీ తగ్గిస్తాయి. 5జీ పరిజ్ఞానంతో కార్లు ఈ పనులన్నీ చేస్తాయి. ఈ పరిజ్ఞానాన్ని వీటూఎక్స్‌ అంటారు. ఈ రంగం వైపు నేను అడుగులు వేయడానికి కారణం మా నాన్నగారే. ‘పరిశోధనా రంగాన్ని ఎంచుకుంటే.. సమాజానికి అవసరమైన ఆవిష్కరణలు చేయొచ్చు. అవి ఎంతోమందికి ఉపయోగపడతాయి’ అని చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన మాటలు నా మనసులో బలంగా నాటుకున్నాయి. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా. మాది నెల్లూరు జిల్లా కావలి దగ్గరున్న కమ్మవారిపాలెం. నాన్న వెంకయ్య. ఫార్మా పరిశ్రమలో మేనేజర్‌. అమ్మ రేవతి. నాకో తమ్ముడు. నాన్న హైదరాబాద్‌లో ఉద్యోగం చేయడంతో తొమ్మిదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా. ఆయనకు విశాఖపట్నం బదిలీ కావడంతో ఇంటర్‌ అక్కడ చదివా. తర్వాత ఐఐటీ హైదరాబాద్‌లో సీటొచ్చింది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ తీసుకున్నా. ఐఐటీలో ఉన్న నాలుగేళ్లలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)పై పనిచేశా. ఇది తర్వాత నేనెంచుకున్న కెరియర్‌కి బాగా కలిసొచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఒక స్టార్టప్‌ పెట్టాలని ఎంతో ప్రయత్నించాను. స్మార్ట్‌ స్ట్రీట్‌లైట్లపై పరిశోధనలు చేశా. ఏడునెలలు దీనికోసం పనిచేశా. జపాన్‌లో ఎంఎస్‌ చేసేందుకు అవకాశం వచ్చినా... ఈ స్టార్టప్‌ కోసం వదులుకున్నా. కానీ ఆ ఉత్పత్తులని పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. దాంతో బాగా నిరుత్సాహ పడ్డాను. ఒక దారి మూసుకుపోతే మరోదారి తెరుచుకుంటుందంటారు కదా. అది నా విషయంలో నిజమయింది. ఆ సమయంలోనే జపాన్‌లో సుజుకీ సంస్థలో పరిశోధన, అభివృద్ధి విభాగంలో ఉద్యోగాలున్నట్లు తెలిసింది. దరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. దానికి హాజరై విజయం సాధించా. అలా 2019లో జపాన్‌ వెళ్లాను. అక్కడ ఇంగ్లిష్‌ కంటే జపనీస్‌లోనే ఎక్కువగా మాట్లాడతారు. దాంతో నా ఆలోచనలు ఇతరులతో పంచుకోవాలన్నా... వాళ్లు చెప్పేది అర్థం చేసుకోవాలన్నా కష్టంగా ఉండేది. అందుకే మూడు నెలలు జపనీస్‌లో శిక్షణ తీసుకున్నా. ఏడాదిలోపే ఆ భాషలో మాట్లాడటం నేర్చుకున్నా.



అమ్మానాన్నతో...

గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు తమదైన ముద్రవేస్తున్నారు. ఆటోమొబైల్‌ అయినా, సాంకేతిక పరిశోధన అంశాల్లోనైనా అమ్మాయిలు బాగా రాణించగలుగుతారు. ఫలానా రంగంలో మనం చేయలేమేమో అనే భావన సరికాదు. దేంట్లో అయినా అవకాశాలు అందిపుచ్చుకొని ధైర్యంగా ముందడుగు వేయాలంతే.


నాయకత్వం

నాకు ఐవోటీపై పనిచేసిన అనుభవం ఉండటంతో సుజుకీలోని ఉన్నతాధికారులు... ‘మీరెందుకు వీటూఎక్స్‌ గురించి పరిశోధన చేయకూడదం’టూ ప్రోత్సహించారు. దాంతో మరో ఆలోచన లేకుండా రెండేళ్ల క్రితం ఈ సాంకేతిక బృందంలో చేరిపోయా. సుజుకీతో పాటు ఐఐటీ హైదరాబాద్‌, మారుతీ సుజుకీ, మరికొన్ని సంస్థలు కూడా వీటూఎక్స్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌ వేదికగా దాదాపు 50 మంది వరకు ఇదే అంశంపై పనిచేస్తున్నాం. ఇందులో వివిధ దేశాల వారున్నారు. పరిశోధనల్లో 30 ఏళ్ల అనుభవమున్నవారూ ఉన్నారు. నా సహోద్యోగి విపుల్‌తో కలిసి ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నా. మాకంటే పెద్దవారు కూడా మేం చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. మా నిర్ణయాలను గౌరవిస్తారు. ఇటువంటి గొప్ప బృందానికి నాయకత్వం వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బీటెక్‌ చదివే రోజుల నుంచే ఇలాంటి అవకాశం రావాలని కలలుకన్నాను. చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధిస్తూ ముందుకు సాగితే మంచి ఫలితముంటుంది. అప్పుడు ఏ లక్ష్యమూ కష్టంగా అనిపించదు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలమంది చనిపోతున్నారు, వికలాంగులు అవుతున్నారు. ఇలాంటి ఆధునిక సాంకేతికతతో ప్రమాదాలని తగ్గించాలన్నదే నా లక్ష్యం.

 

రాజేందర్‌ సురకంటి, సంగారెడ్డి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్