వరుస గాయాలు.. ఆమెను ఆపలేకపోయాయి..

రెజ్లర్‌ అంటే మగవారే అనే నమ్మకాన్ని మార్చింది 31 ఏళ్ల చేతనాశర్మ. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ప్రవేశం ఉన్న ఈమెకు ఆర్మ్‌ రెజ్లింగ్‌ గురించి తెలిసి అందులోకి అడుగుపెట్టి ఎన్నోసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.

Updated : 21 May 2022 09:20 IST

రెజ్లర్‌ అంటే మగవారే అనే నమ్మకాన్ని మార్చింది 31 ఏళ్ల చేతనాశర్మ. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ప్రవేశం ఉన్న ఈమెకు ఆర్మ్‌ రెజ్లింగ్‌ గురించి తెలిసి అందులోకి అడుగుపెట్టి ఎన్నోసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మధ్యలో వరుస గాయాలెన్ని బాధపెట్టినా తిరిగి కోలుకొని టైటిల్స్‌ గెలుచుకున్న ఈ ఆర్మ్‌ రెజ్లర్‌ ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి తెలుసుకుందాం.

స్కూల్‌లో జరిగే క్రీడా పోటీలన్నింటిలో చేతన ప్రథమ స్థానంలో నిలవాల్సిందే. లాంగ్‌ జంప్‌, హైజంప్‌, పరుగు పోటీల్లో ముందుంటూ పాఠశాల చదువు పూర్తయ్యే సరికి ఉత్తమ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. అసోంకు చెందిన చేతనకు చేతి కుస్తీ క్రీడాకారుడు (ఆర్మ్‌ రెజ్లర్‌) నాయన్‌జ్యోతి బోరాతో వివాహం కావడం జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. చాలా క్రీడల్లో ప్రవేశం ఉన్న చేతనకు భర్త ప్రోత్సాహం అందింది. ఆడపిల్లవని సంకోచించవద్దని చెప్పి చేతి కుస్తీలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఇలా 2011 నుంచి సాధన మొదలు పెట్టిన చేతనను ఆర్మ్‌ రెజ్లింగ్‌ పోటీలకూ తీసుకెళ్లే వాడు. ఐఐటీ ముంబయిలో జరిగిన ఆవాహాన్‌ స్పోర్ట్స్‌ ఫెస్ట్‌లో ఆర్మ్‌రెజ్లింగ్‌ పోటీలో చేతన పాల్గొంది. ఇందులో వంద మంది విద్యార్థులు పాల్గొంటే చివరికి అయిదుగురు మిగిలారు. వారిలో నలుగురు అబ్బాయిల మధ్య ఒకే ఒక మహిళ చేతన. వారిపైనా గెలుపు సాధించి తానేంటో నిరూపించుకుంది. ప్రొ పంజా లీగ్‌లో 65 కేజీల ఉమెన్‌ క్యాటగిరీలో ఛాంపియన్‌ అయ్యింది. అలా పోటీల్లో పాల్గొన్న ప్రతిసారీ గేలిచేది. ఆరు సార్లు జాతీయ స్థాయిలో కూడా ఛాంపియన్‌ అయ్యింది.

సవాళ్లు ఎదురైనా...

అప్పటి వరకు ఏ పోటీలో అడుగుపెట్టినా విజేతగా నిలిచిన చేతనకు మధ్యలో అపజయాలు ఎదురయ్యాయి. వరుస గాయాలు ఈమెను కుదేలు చేశాయి. ఆ సమయంలో భర్త ప్రోత్సాహం ఆమెలో పట్టుదలను నింపింది. రెండేళ్ల తర్వాత తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడంలో విజయం సాధించింది. అసోం ఛాంపియన్‌షిప్‌ - 2013 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత మాస్టర్స్‌ చేయాలనే ఆసక్తి ఈమెను మూడేళ్లపాటు ఆటకు దూరంగా ఉంచింది. జీవితానికి క్రీడలొక్కటే కాదు, చదువు కూడా ముఖ్యమే అనుకున్నా అంటుంది చేతన. ‘దాంతో చదువుపై ధ్యాస పెట్టా. పంజాబ్‌ టెక్నికల్‌ యూనివర్శిటీలో బీసీఏ, అసోం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎమ్‌సీఏ పూర్తిచేశా. ఆ తర్వాత అసోం పోలీస్‌ విభాగంలో 2016లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా చేరా. స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు చేపట్టా. మూడేళ్లు క్రీడలకు దూరంగా ఉన్న నేను ఉద్యోగంలోకి అడుగుపెట్టగానే మైదానంలోకి కూడా నడిచా. 2017 నుంచి 2021 వరకు నా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. అలా ఛత్తీస్‌గడ్‌లో జరిగిన నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌, ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ మిస్‌ ఇండియా ఆర్మ్‌ రెజ్లింగ్‌తోపాటు 2020లో దిల్లీలో జరిగిన ప్రొ పంజా లీగ్‌, గోవాలో పీపీఎల్‌ 2021 సూపర్‌ మ్యాచ్‌ విన్నర్‌గా టైటిల్స్‌ గెలుచుకున్నా. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సిద్ధమవుతున్నా. ఉజ్బెకిస్తాన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. ఆసియన్‌ ఆర్మ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనేది నా కల. ఓవైపు ఆట, మరోవైపు ఉద్యోగం.. రెండింటినీ సమన్వయం చేయడం కష్టంగా ఉన్నా.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండతో ఆ సమస్యను దాటగలుగుతున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్