మన జీవితాలే... రోజుకొక కథగా!

తనదైన దారిలో నడవాలన్నది ఆమె ఆలోచన. అందుకే ప్రతి ఇంటి కథనీ తనదైన శైలిలో చెబుతూ లక్షల మంది అభిమానాన్ని చూరగొంది. ‘ఇందు’గా అందరికీ సుపరిచితమైన కొసనా ఇంద్రజ గురించే ఇదంతా! రోజుకొక కథ పేరుతో మానవ సంబంధాల్లోని సౌందర్యాన్ని పరిచయం చేస్తోన్న ఈమె.. వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకుందిలా..!

Updated : 21 May 2022 07:21 IST

తనదైన దారిలో నడవాలన్నది ఆమె ఆలోచన. అందుకే ప్రతి ఇంటి కథనీ తనదైన శైలిలో చెబుతూ లక్షల మంది అభిమానాన్ని చూరగొంది. ‘ఇందు’గా అందరికీ సుపరిచితమైన కొసనా ఇంద్రజ గురించే ఇదంతా! రోజుకొక కథ పేరుతో మానవ సంబంధాల్లోని సౌందర్యాన్ని పరిచయం చేస్తోన్న ఈమె.. వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకుందిలా..!

భార్యాభర్తల మధ్య చిన్ని గిల్లికజ్జాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పిల్లలకు చెప్పాల్సిన విషయాలు.. ఇవన్నీ మన మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించే విషయాలే. వీటినే కథా వస్తువులుగా చేసుకున్నా. చాలా చిన్న విషయాలే కానీ.. వాటిని మనం చూసే కోణంలో తేడా ఉంటుంది. ఫలితమే దూరాలు. ఈ సున్నితాంశాలనే తీసుకుని వీడియోలు చేస్తుంటా. మాది విశాఖపట్నం. బీకాం చదివా. నాకు నటనన్నా, డ్యాన్స్‌ అన్నా చాలా ఇష్టం. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో చిన్నచిన్న వీడియోలు పెట్టేదాన్ని. దీంతో అనుసరించే వారి సంఖ్య పెరిగింది. ‘బాగా చేస్తున్నావ్‌.. యూట్యూబ్‌ ఛానెల్‌ను మొదలుపెట్టొచ్చు కదా!’ అన్నారు మావారు ప్రసాద్‌. ఆయన ప్రైవేటు ఉద్యోగి. ఫొటో, వీడియో ఎడిటింగ్‌ సహా అన్నీ నేర్పారు కూడా. దీంతో 2014లోనే ‘రోజుకో కథ’ ప్రారంభించా. కానీ వీడియోలు పెట్టడం ప్రారంభించింది మాత్రం 2020 నుంచే. మనం చేసేది సమాజానికీ ఉపయోగపడాలి అనుకుంటా. అందుకే మొదట్లో స్ఫూర్తిదాయక అంశాలను కథలుగా చెప్పేదాన్ని. ఇవి అంతగా ప్రభావం చూపలేదు. దీంతో స్క్రిప్టుగా రాసి, పాత్రల రూపంలో చూపించడం మొదలుపెట్టా. నటించేదీ నేనే. తర్వాత మావారినీ ఒప్పించి తీసుకొచ్చా.

ఆ వీడియోకి స్పందన..

ఎంత మంచి విషయాన్ని చెప్పినా వీక్షణలు పెరిగేవి కాదు. ఒకానొక దశలో మానేద్దామా అనిపించింది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు వీడియోలు. ఇంత కష్టపడుతున్నా ఎవరూ గుర్తించలేదన్న బాధ. అసలే మా ఇల్లు రోడ్డుకు దగ్గర. దీంతో వాహనాల శబ్దాలెక్కువ. అందుకే రాత్రుళ్లు 11 గంటలకు వీడియోలు చేసేదాన్ని మరి. కానీ మా ఆయన ఓపికతో ప్రయత్నించాలనే వారు. ఓసారి భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న తగాదా మీద మావారిపై ‘ప్రాంక్‌’ వీడియో చేశా. అది చాలామందికి బాగా నచ్చింది. అక్కడ్నుంచి నా పాత వీడియోలకీ ఆదరణ బాగా పెరిగింది. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లను చూసుకోవడం, మరో వైపు ఈ వ్యాపకం. సమయం సరిపోక ఉద్యోగం మానేశా. ఇప్పటికీ రాత్రుళ్లే వీడియోలు చేస్తా. నెలకు ఇన్ని చేయాలన్న నియమమేమీ పెట్టుకోలేదు. మంచి ఆలోచన రాగానే దాన్ని కాగితం మీద పెడతా. వినోదంతో పాటు ఏదైనా సందేశం ఉండేలా చూస్తా. కష్టం విలువ తెలుసు. అందుకే ఆర్థికపరమైన సమస్యలనూ ప్రస్తావిస్తాను. ఏ వీడియో అయినా చేసే ముందు వయసుతో నిమిత్తం లేకుండా కుటుంబమంతా చూడగలరా అని మాత్రం ఆలోచిస్తా. అందుకే సమయం పడుతుంది.

అదే గొప్ప విజయం

ఇంత ఆలోచించి చేసినా అడపాదడపా నెగెటివ్‌ కామెంట్లు మామూలే. మొదట్లో బాధపడ్డా. తర్వాత పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళితే మాస్క్‌ ఉన్నా గుర్తుపట్టి పలకరిస్తుంటారు.. ఫొటోలు తీసుకుంటారు. ఇప్పటి వరకూ 129 వీడియోలు చేశా. కనీసం పదిలక్షల వీక్షణలు దాటినవి 29పైనే! మొత్తంగా నా ఛానెల్‌కు 52 కోట్లకు పైగా వీక్షణలున్నాయి. ఎనిమిది లక్షల మంది అనుసరిస్తున్నారు. కంచంలో మిగిలిన ఆహారాన్ని పక్షులు, జంతువులకు పెట్టడం, పొరపాటున అన్నంలో వెంట్రుక కనిపిస్తే అమ్మ మీద అరవడం.. వంటి వీడియోలు చూసి మా తీరు మార్చుకున్నామనో, పిల్లలకి చూపించి నేర్పిస్తున్నామనో కామెంట్లు పెట్టేవారే ఎక్కువ. అవి చూసినపుడు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. వాళ్లలో ఎన్‌ఆర్‌ఐలూ చాలా మంది ఉంటారు. విదేశాల్లో ఉంటున్న వాళ్లనీ చేరుకున్నా అనిపించినపుడు కొంత గర్వంగా ఉంటుంది. మా అత్తమామలు నా ఛానల్‌ గురించి బంధువులతో గొప్పగా చెప్పుకొంటారు. ఇది నేను సాధించిన గొప్ప విజయం. ఇప్పుడు ఇతర అవకాశాలూ వస్తున్నాయి. పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయేది చేయాలన్నది నా కోరిక. ప్రతీ రంగంలో కష్టం ఉంటుంది. పట్టుదలగా ఓపికతో ప్రయత్నిస్తే ఈ డిజిటల్‌ యుగంలో దూసుకుపోవడానికి అవకాశాలు పుష్కలం. రోజుకొక కథ ప్రయాణంలో నేను నేర్చుకున్న పాఠమిదే.

- జె.కాశ్యప్‌, ఈనాడు జర్నలిజం స్కూలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్