మనమూ కనొచ్చు...కెమెరా కలలు!

ఏటా మన దేశంలో వేల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ వాటిని తెరపై అందంగా చూపే సినిమాటోగ్రఫీలో మాత్రం అమ్మాయిలు అతికొద్ది మందే. అందులోనూ తెలుగమ్మాయిలు మరీ అరుదు. కానీ యామినీ యజ్ఞమూర్తి మాత్రం బహుభాషల్లో రాణిస్తూ...‘చిన్ని’ సినిమాతో తనదైన ముద్రవేసింది. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది.. 

Published : 22 May 2022 01:27 IST

ఏటా మన దేశంలో వేల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ వాటిని తెరపై అందంగా చూపే సినిమాటోగ్రఫీలో మాత్రం అమ్మాయిలు అతికొద్ది మందే. అందులోనూ తెలుగమ్మాయిలు మరీ అరుదు. కానీ యామినీ యజ్ఞమూర్తి మాత్రం బహుభాషల్లో రాణిస్తూ...‘చిన్ని’ సినిమాతో తనదైన ముద్రవేసింది. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది.. 

పుట్టి పెరిగింది చెన్నైలో. మేం తెలుగు వాళ్లమే. తాతయ్యవాళ్లు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు. అమ్మ సుధ వస్త్ర డిజైనర్‌. నాన్న శివన్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. నేను, అక్క జనని ఇద్దరమే పిల్లలం. చిన్నప్పట్నుంచీ కెమెరా అన్నా, ఫొటోగ్రఫీ అన్నా చాలా ఆసక్తి. ఈ రంగంలో స్థిరపడాలని బీఎస్సీ విజువల్‌ కమ్యూనికేషన్స్‌ చేశా. ఆపైన గ్రాఫిక్‌ డిజైనర్‌గా, తర్వాత కమర్షియల్‌ ఫుడ్‌ ఫొటోగ్రాఫర్‌గా అయిదేళ్లు పనిచేశా. ఆ సమయంలోనే సినిమా ఆలోచన వచ్చింది. అమ్మానాన్నకి నా లక్ష్యాన్ని చెబితే వాళ్లు నచ్చింది చెయ్యమన్నారు. సినిమాటోగ్రఫీ చాలా కష్టమైన పని. రాత్రి-పగలు, ఎండ-వాన.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ ప్రదేశాల్లోనైనా పనిచేయాలి. అందుకేనేమో ఇక్కడ మహిళలు తక్కువ. నేనైతే అన్నింటికీ సిద్ధమయ్యాకే, ఈ నిర్ణయం తీసుకొన్నా. 

పీసీ శ్రీరామ్‌ శిష్యరికం..

 లైటింగ్‌ మీద ప్రయోగాలు చేస్తూ దేన్నైనా కెమెరాలో అందంగా బంధించాలనుకుంటా. కెమెరా పనితనం బాగున్న సినిమాలు ఎక్కువగా చూస్తా. కమల్‌హాసన్‌ ‘నాయకుడు’ ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. అందులో ప్రతి ఫ్రేమ్‌నీ అద్భుతంగా చిత్రీకరించారు పీసీ శ్రీరామ్‌. ఆయన సినిమాలన్నీ అలానే ఉంటాయి. అవన్నీ చూశాక ఆయన దగ్గర పని చేయాలనుకున్నా. 2018లో ఓ రోజు నేను తీసిన ఫొటోలు, వీడియోల్ని శ్రీరామ్‌సర్‌కి ఫేస్‌బుక్‌లో పంపించి, ఆయన దగ్గర పనిచేయాలని ఉందని చెప్పా. ఆశ్చర్యంగా అరగంటలో  బదులొచ్చింది. ఆఫీస్‌కొచ్చి కలవమన్నారు. ఎగిరి గంతేసి వెళ్లా. ‘నీ వర్క్‌ బాగుంది. అయితే ఈ రంగంలో చాలా కష్టపడాలి. నేను పని విషయంలో చాలా కఠినంగా ఉంటా. ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడమంటూ ఉండదు. గమనిస్తూ, పనిచేస్తూ నేర్చుకోవాలి’ అన్నారు. మరుసటి రోజే పనిలో చేరిపోయా. సెట్లో చురుగ్గా ఉండేదాన్ని. అందరితో సమానంగా కాకుండా కాస్త ఎక్కువ పనే అప్పజెప్పేవారు. ఆయనకు అసిస్టెంట్‌గా హిందీలో ప్యాడ్‌మాన్, మూడు భాషల్లో తీసిన నిత్యామీనన్‌ చిత్రం ‘ప్రాణ’, తెలుగులో తమన్నా చేసిన ‘నా నువ్వే’, తమిళంలో ‘సైకో’కి పనిచేశా. శ్రీరామ్‌ సర్‌ దగ్గర క్రమశిక్షణ, వేగంగా పనిచేయడంతోపాటు లైటింగ్‌ ప్రాముఖ్యత తెలుసుకున్నా. తక్కువ వెలుతురులో సహజంగా సీన్‌ వచ్చే టెక్నిక్స్‌ నేర్చుకున్నా. ఆయన దగ్గర పనిచేస్తూనే మూడు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌కీ, ‘ఫ్లిప్‌’ అనే టీవీ సిరీస్‌కీ పనిచేశా. తమిళంలో ‘మైఖేల్‌’, ‘లెగా’ లఘుచిత్రాలకు కెమెరా వర్క్‌ చేశా. పీసీ గారితో ‘సైకో’ చిత్రం చేస్తున్నప్పుడు ‘సిల్లు కరుపట్టి’ వెబ్‌ సిరీస్‌కి పిలుపొచ్చింది. దాంతో పరిశ్రమలో 29 ఏళ్ల వయసులో నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. 

తెలుగులోనూ చేస్తున్నా..

దర్శకుడు అరుణ్‌ మహేశ్వరన్‌ 2020లో ఓరోజు ఫోన్‌చేశారు. నా చిత్రీకరణ బావుందని మెచ్చుకుంటూనే తన సినిమాకి పనిచేయమన్నారు. అదే ‘చిన్ని’(తమిళంలో సాని కాయిదం). కీర్తి సురేశ్, దర్శకుడు సెల్వరాఘవన్‌ నటించారు. హీరోయిన్‌కు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కథ. ఈ సినిమాకి ‘హ్యాండ్‌ హెల్డ్‌’ కెమెరా వాడితే బావుంటుందన్నారు దర్శకుడు. స్క్రిప్టు చదివాక నాకూ అలానే అనిపించింది. భావోద్వేగాల్ని దగ్గర నుంచి చిత్రీకరించడానికి ఇది సాయపడుతుంది. కానీ 15 కేజీలుండే ఆ కెమెరాను నడుముకి కట్టుకొనే పనిచేయాలి. టేక్‌ ఓకే అయ్యేంతవరకు బ్రేక్‌ ఉండదు. ఇందుకోసం నన్ను సాంకేతికంగానే కాదు, శారీరకంగానూ సిద్ధం చేసుకున్నా. కెమెరా మోసేందుకు అవసరమైన వ్యాయామాలు చేసేదాన్ని. మోయడం కష్టంగా ఉన్నా దీంతో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ బాగుందంటూ పీసీ సర్‌ మెచ్చుకోవడం పెద్ద అవార్డు. మొదటి కాపీ చూసిన తర్వాత చిత్ర దర్శకుడు, కీర్తితోపాటు బృందమంతా ప్రశంసిస్తుంటే కష్టమంతా మర్చిపోయా. నేనిప్పటికీ నేర్చుకునే దశలోనే ఉన్నా. ‘చిన్ని’ ఫైట్‌ మాస్టర్, దర్శకుల నుంచి చాలా తెలుసుకున్నా. ప్రస్తుతం తెలుగులోనే ఒక సినిమా, వెబ్‌సిరీస్‌లకు చేస్తున్నా. ఈ మార్చిలోనే సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌ను పెళ్లి చేసుకున్నా. ఈ రంగంలో అడుగుపెట్టాలనుకునే అమ్మాయిలకు నే చెప్పేదేంటంటే... ‘మనమూ కనొచ్చు కెమెరా కలలు. ఇది చాలా కష్టమైన పని.. నీవల్ల కాదు’ అని ఎవరెన్ని చెప్పినా మనసేం చెబుతుందో అదే చేయండి. విజయం మీ సొంతమవుతుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్