అమ్మకు ఉపాధి.. ఆమె వ్యాపారం!

అమ్మగా, ఉద్యోగినిగా.. రెండు బాధ్యతలూ ఒకేసారి నిర్వహించడం ఎంత కష్టం? పిల్లల్ని చూసుకుంటూ.. ఖాళీ సమయంలో ఉద్యోగం చేసుకునే వీలుంటే! ఇదే ఆలోచన వచ్చింది అనామికా సింగ్‌కి. దాన్ని ఆచరణలోనూ పెడితే.. కోట్ల వ్యాపారమైంది. అదెలాగో.. చదివేయండి.

Published : 22 May 2022 01:27 IST

అమ్మగా, ఉద్యోగినిగా.. రెండు బాధ్యతలూ ఒకేసారి నిర్వహించడం ఎంత కష్టం? పిల్లల్ని చూసుకుంటూ.. ఖాళీ సమయంలో ఉద్యోగం చేసుకునే వీలుంటే! ఇదే ఆలోచన వచ్చింది అనామికా సింగ్‌కి. దాన్ని ఆచరణలోనూ పెడితే.. కోట్ల వ్యాపారమైంది. అదెలాగో.. చదివేయండి.

అమ్మయ్యాక అనామిక ప్రపంచమే మారిపోయింది. అప్పటిదాకా సులువుగా సాగిన ఉద్యోగ జీవితం కష్టమైంది. ఓవైపు పాపను చూసుకుంటూ.. ఉద్యోగాన్ని కొనసాగించడం కష్టమై రాజీనామా చేసింది. అమ్మవడమంటే.. కెరియర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టడం తప్ప ఇంకే మార్గం లేదా అని ఆలోచించింది. అప్పుడే ఓ వ్యాపార ఆలోచన తట్టింది. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ అనే చిన్న పట్టణం. ఇంటర్‌ వరకూ హిందీ మాధ్యమంలోనే చదివింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాక, మేనేజ్‌మెంట్‌ విద్య కోసం దిల్లీ చేరింది. తను కోరుకున్నట్టుగానే ఎంఎన్‌సీలో హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం సాధించింది. 2011లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పుష్పేందర్‌తో వివాహమైంది. తర్వాతా ఉద్యోగం కొనసాగించింది. అవకాశాలు రావడంతో సంస్థ మారింది. తన ప్రతిభతో పదోన్నతులు సాధించింది. ఇంతలో బాబు. తనను చూసుకుంటూ ఆఫీసుకు వెళ్లడం కష్టమయ్యేది. కోరితే ఇంటి నుంచి పనిచేయడానికి సంస్థ అవకాశమిచ్చింది. అయినా సమన్వయం కుదిరేది కాదు. ఒక్కోసారి పని ఆలస్యమయ్యేది. నాలుగేళ్లు నెట్టుకొచ్చాక 2017లో రాజీనామా చేసింది. తనలా ఎంతోమంది కెరియర్‌కి దూరమవుతున్నారని అనిపించిందామెకు. దీంతో 2018లో రూ.యాభై వేలతో దిల్లీలో ‘లిత్సా సర్వీసెస్‌’ ప్రారంభించింది.

‘అమ్మగా, ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహించడం ఎంత కష్టమో స్వయంగా అనుభవించా. సంస్థలూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. ఎవరో ఎందుకు నేనే ఆ వాతావరణాన్ని కల్పించాలని ‘లిత్సా సర్వీసెస్‌’ ప్రారంభించా. ఇంటి నుంచి పని చేయాలనుకునే అమ్మలకు నచ్చిన వేళల్లో ఉద్యోగాలు చేసుకునే వీలు కల్పించడం మా సంస్థ ఉద్దేశం. సంస్థలతో ఒప్పందం చేసుకుని, ఉద్యోగావకాశాలను కల్పిస్తాం. మహిళలు తీరిక వేళల్లో పనిచేయొచ్చు. సంస్థకీ, మహిళలకీ వారధిగా మేం పనిచేస్తాం. మహిళల నేపథ్యం, అనుభవం ఆధారంగా కొన్ని పరీక్షలు, ఇంటర్వ్యూ నిర్వహిస్తాం. సంస్థలు మళ్లీ తుది ఇంటర్వ్యూ చేస్తాయి. దానిలోనూ నెగ్గితే ఉద్యోగం కల్పిస్తాయి. ఇందుకు సంస్థల నుంచే కొంత మొత్తం తీసుకుంటాం. ఉద్యోగార్థుల నుంచి ఏమీ తీసుకోం. నా సంస్థను ఇంటి నుంచి నేనొక్కదాన్నే నిర్వహించే దాన్ని. దీని నిర్వహణ కోసం మొదట్లో ఎన్నో హేళనలూ భరించా. ఇప్పుడు ఎన్నో సంస్థలు నన్ను నమ్ముతున్నాయి. నోయిడాలో కార్యాలయాన్నీ ప్రారంభించా. ఇప్పుడు నా దగ్గర 25 మందికి పైగా పనిచేస్తున్నారు. వారిలోనూ నచ్చిన వేళల్లో చేసుకునే వారున్నారు’ అంటోంది 35 ఏళ్ల అనామిక. ఫెయిర్‌సెంట్, లింక్‌ గ్రూప్, ఇన్ఫోగెయిన్‌ ఇండియా వంటి పాతిక సంస్థలకు ఈమె వందల మంది ఉద్యోగులను అందిస్తోంది. గత ఏడాది తన ఆదాయం రూ.2.5 కోట్లు. దేశవ్యాప్తంగా గ్రామీణ యువతులకు వివిధ అంశాల్లో శిక్షణతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పించి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది తను. దీన్నీ సాధించగలనని నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్