Updated : 26/05/2022 09:31 IST

అభిలాష..తొలి మహిళా యుద్ధ పైలట్‌!

ఆమె పుట్టి పెరిగిందంతా మిలిటరీ వాతావరణమే! అన్నా ఆ దారిలోనే వెళ్లాక ఆమె మనసూ దేశవైపు మళ్లింది. విదేశీ ఉద్యోగాన్ని కాదని మిలిటరీలో చేరింది. పురుషులతో పోటీ పడుతూ 36 మంది ఆర్మీ పైలట్‌ల్లో ఒకరిగా.. దేశంలోనే మొదటి మహిళా యుద్ధపైలట్‌గా నిలిచింది.. కెప్టెన్‌ అభిలాషా బరాక్‌. ఆమె ప్రయాణమిది.

నాన్న కల్నల్‌ ఎస్‌ ఓం సింగ్‌ మిలిటరీ ఆఫీసర్‌. ఊహ తెలిసినప్పటి నుంచీ యూనిఫాం ధరించిన సైనికుల మధ్యే పెరిగింది. దీంతో అదో పెద్ద విషయమని ఆమెకి అనిపించలేదు. కానీ నాన్న 2011లో పదవీ విరమణ పొందారు. దీంతో వాళ్ల కుటుంబం హరియాణాకు మారిపోయింది. అన్న కూడా నాన్న బాటలోనే ఆర్మీలో చేరాడు. 2013లో మిలటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత పొంది పెరేడ్‌లో పాల్గొన్న అతన్ని చూశాక తనకూ అటువైపు వెళ్లాలనిపించింది. అభిలాష.. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. యూఎస్‌లోని ప్రముఖ సంస్థలో ఉద్యోగాన్నీ సాధించింది. కానీ వాటిని కాదని ఆర్మీ వైపు వెళ్లింది. 2018లో చెన్నైలోని ఆర్మీ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకుంది. తర్వాత ఆర్మీ డిఫెన్స్‌ను ఎంచుకుంది. ‘ఆర్మీ ఏవియేషన్‌కి దరఖాస్తు చేేసుకునేప్పటికి యుద్ధ విభాగాల్లోకి అమ్మాయిలకు అనుమతి లేదు. గ్రౌండ్‌ డ్యూటీకే పరిమితమవుతానని తెలుసు. అయినా కొన్ని ప్రొఫెషనల్‌ కోర్సులు చేశా. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమూ అయ్యా. ఎప్పటికైనా అమ్మాయిలకీ యుద్ధంలో పాల్గొనే అవకాశమొస్తుందన్నది నా నమ్మకం. అనుకున్నట్టుగానే వచ్చింది. దాన్ని గట్టిగా ప్రయత్నించా. నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నుంచి విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొని తొలి యుద్ధ పైలట్‌నయ్యా. ఆర్మీ ఏవియేషన్‌ డీజీ ఏకే సూరి నుంచి పట్టానీ, ప్రత్యేక పురస్కారాన్నీ అందుకున్నా. 1987.. ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌! వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. నాన్న ఆ పరిస్థితుల్లో నాయకత్వం వహిస్తూ జబ్బుపడ్డారు. హుటాహుటిన వేరే ప్రాంతానికి తరలించడంతో మాకు దక్కారు. ఆర్మీ ఏవియేషన్‌ కోసం ఆయన తన ప్రాణాల్నీ పణంగా పెట్టారు. ఇప్పుడది నా వంతు’ అని చెప్పుకొచ్చింది 26 ఏళ్ల అభిలాష.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి