పదిహేడేళ్ల పాటకు... అంతర్జాతీయ స్థానం

‘వరల్డ్‌ ఇండీ మ్యూజిక్‌ ఛార్ట్‌’... ప్రపంచవ్యాప్తంగా గాయనీగాయకులంతా ఈ ఛార్ట్‌లో స్థానం సంపాదించుకోవాలని కలలుకంటారు. కేవలం ప్రతిభ ఆధారంగానే ఇందులో ర్యాంకులు కేటాయిస్తారు. డిజిటల్‌ రేడియో ట్రాకర్‌ సంస్థ దీన్ని రూపొందిస్తుంది.

Updated : 26 May 2022 03:29 IST

‘వరల్డ్‌ ఇండీ మ్యూజిక్‌ ఛార్ట్‌’... ప్రపంచవ్యాప్తంగా గాయనీగాయకులంతా ఈ ఛార్ట్‌లో స్థానం సంపాదించుకోవాలని కలలుకంటారు. కేవలం ప్రతిభ ఆధారంగానే ఇందులో ర్యాంకులు కేటాయిస్తారు. డిజిటల్‌ రేడియో ట్రాకర్‌ సంస్థ దీన్ని రూపొందిస్తుంది. తాజాగా విడుదల చేసిన ఈ ఛార్ట్‌లో మన దేశానికి చెందిన యువ గాయని తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఇది సాధించిన తొలి భారతీయ గాయనిగానూ గుర్తింపు పొందిన 17 ఏళ్ల అదితీ అయ్యర్‌ గురించి తెలుసుకుందాం.

వందలాది రేడియో స్టేషన్ల నుంచి ప్రపంచమంతా తమ గొంతు వినిపించే వారి ఆల్బమ్స్‌ ఆధారంగా గాయనీ గాయకుల స్థానాల్ని డిజిటల్‌ రేడియో ట్రాకర్‌ ప్రకటిస్తుంది. ఇందులో స్థానాన్ని పొందడం అంతర్జాతీయ గౌరవంగా గాయకులు భావిస్తారు. ఈ ఏడాది ముంబయికి చెందిన అదితి నెంబర్‌ 1 స్థానంలో నిలిచింది. చిన్నప్పటి నుంచి అదితిది ఇదే కల. తాను ‘వరల్డ్‌ ఇండీ మ్యూజిక్‌ ఛార్ట్‌’లో నెంబరు 1 కావాలని. ఇప్పుడామె కల నెరవేరింది. ఇటీవల ‘డెలిటెడ్‌ యువర్‌ నెంబర్‌’ పేరుతో ఈమె పాడిన బ్రేక్‌ అప్‌ సాంగ్‌ యువత మనసులను దోచేసింది. ‘ఎంతో చిన్నదైన ఈ జీవితంలో మనకు విలువనివ్వని వారి కోసం మనమెందుకు ఆలోచించాలి’ అంటూ పాడిన ఈ పాట వైరల్‌ అయ్యింది. దీంతో ఒలైవియా రోడ్రిగో, దోజా క్యాట్‌, ఎడ్‌ షీరన్‌ వంటి ప్రపంచ ప్రముఖ గాయకుల పక్కన అదితి పేరు చేరింది. గాయని మాత్రమే కాదు, తన పాటలు తనే రాసుకుంటుంది. అదే ఈ రోజు ఆమెను ఈ స్థాయికి చేర్చింది. చిన్న వయసులోనే వందల ప్రదర్శనలిచ్చిన ఈమెకు ముంబయి రాయల్‌ ఒపెరా హౌస్‌లో ప్రదర్శన ఇవ్వాలని కల. ప్రతి పాటలోనూ మహిళల సమస్యలను ప్రస్తావించడం తనకు మరింత ప్రత్యేకతను సంపాదించిపెట్టింది. గతేడాది వేధింపులకు గురిచేసే సంబంధాలతో కలిగే బాధను ‘డోల్‌హౌస్‌’ పాటలో నింపిందీమె. ఇందులో తను మానవ సంబంధాలను విశ్లేషించిన తీరు అందరి హృదయాలను హత్తుకునేలా చేసింది. భారతదేశంలో అతి తక్కువగా ఉండే ఒపెరా గాయకుల్లో ఒకరిగా నిలిచిన అదితి తన 10వ ఏట నుంచే సొంతంగా సాహిత్యాన్ని రచించి దానికి బాణీలు కట్టడం ప్రారంభించింది.

గర్వంగా ఉంది...పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో తాను తీసుకున్న శిక్షణే తనకీరోజు ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టింది అంటుంది అదితి. ‘బాల్యం నుంచి నాకు పాప్‌ సంగీతమంటే ప్రాణం. దాంతో ఇందులోనే శిక్షణ తీసుకున్నా. పదోతరగతి పరీక్షల చివర్లో ఉన్నప్పుడు నా పేరు ప్రపంచ పట్టికలో మొదటి స్థానంలో నేనుండటం పట్టరాని సంతోషాన్ని కలిగించింది. ప్రపంచప్రఖ్యాతి చెందిన గాయకులెందరో ఈ పట్టికలో ఉంటారు. అటువంటి చోట మొదటి స్థానమంటే మనసు గాలిలో తేలిపోతున్నట్టుంది. చాలా గర్వంగా ఉంది. దీంతో అమెరికా బెర్క్లీ మ్యూజిక్‌ స్కూల్‌ నుంచి పిలుపును అందుకోవడం మరింత సంతోషంగా ఉంది. అక్కడ ఎంతో ప్రతిభ ప్రదర్శించే గాయనీగాయకుల సహకారాన్ని అందుకొని నన్ను నేను మరింత తీర్చిదిద్దుకొంటా’ అని చెబుతున్న అదితి త్వరలో అమెరికాకు ప్రయాణం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్