Updated : 30/05/2022 07:47 IST

పేదింటి అమ్మాయిల్ని కాలేజీకి పంపిస్తోంది!

ఆమె వయసు 33. అయినా ఇప్పటివరకు 300మంది నిరుపేద చిన్నారులను విద్యావంతులను చేసింది. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ఉన్నత చదువువైపు అడుగులేసేలా చేస్తున్న సుజితకు ఈ ఆలోచనెలా వచ్చిందో తెలుసుకుందాం.

గేబ్రియల్‌ కళ్లు తెరిచిన మూడు నెలలకే తండ్రి చనిపోయాడు. ఈమె తల్లి  కూలీగా పనిచేస్తూ తన ఒక్కగానొక్క ఆడపిల్లను చదివించాలని అహోరాత్రులు కష్టపడేది. నెలకు రూ.6వేల ఆదాయంతో ఇబ్బందులెన్నొదురైనా కూతురిని పెంచింది. రామనాధపురానికి చెందిన గేబ్రియల్‌కు చిన్నప్పటి నుంచి పెద్దచదువులపై ఆసక్తి. ఇంటర్‌లో 500కు 470 మార్కులు సాధించింది. ఆ తర్వాత డిగ్రీలో చేరాలనుకున్నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఈ అమ్మాయి గురించి సామాజిక సేవాకార్యకర్తగా పేరుపొందిన సుజితకు తెలిసింది. ఆ అమ్మాయి కలను నెరవేర్చడానికి ముందడుగు వేసింది. క్రౌడ్‌ ఫండ్‌ సాయంతో గేబ్రియల్‌కు కాలేజీ, హాస్టల్‌ ఫీజులు కట్టడంతోపాటు తిరుచ్చి కాలేజీకి పంపడానికి ఆమె తల్లిని కూడా ఒప్పించింది. అలా గేబ్రియల్‌లాంటి పేద విద్యార్థినులకు విద్యనందించడమే లక్ష్యంగా పెట్టుకొంది సుజిత.

చదివేటప్పుడే..  చాలా కుటుంబాలు ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు తమ ఆడపిల్లల చదువులను నిరభ్యంతరంగా నిలిపేస్తాయి అంటుంది సుజిత. ‘అటువంటి పిల్లలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంటా. అలా డ్రాపవుట్్సగా మారినవాళ్లను కనిపెట్టి చదువుపై వారికున్న ఆసక్తి తెలుసుకుంటా. అటువంటివారికి దాతల ద్వారా ఆర్థికసాయం అందేలా చేసి తిరిగి బడివైపు అడుగులేసేలా చేస్తా. పీజీ చేసేటప్పుడు తమిళనాట చాలా గ్రామాలు తిరిగేదాన్ని. వారి ఇబ్బందులు తెలుసుకొని, సాయం అందించాలని కోరుతూ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసేదాన్ని. చదువులోనే కాదు, అనారోగ్యంతో చికిత్స చేయించుకోవడానికి వైద్యఖర్చుల్లేని వారికి ఆన్‌లైన్‌ ఫండింగ్‌ అందేలా చేస్తుంటా. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వాళ్లను చూసొచ్చి వారి అవసరాన్ని తీర్చడానికి కృషి చేసేదాన్ని’ అని చెప్పుకొస్తోంది సుజిత.

లాక్‌డౌన్‌లో... కొవిడ్‌ సమయంలో చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ‘స్మార్ట్‌ఫోన్స్‌ లేక ఆన్‌లైన్‌ తరగతులకు గ్రామాల్లో చాలామంది హాజరు కాలేకపోయారు. వారంతా డ్రాపవుట్స్‌గా మారేవారు. అటువంటివారిని గుర్తించి, తిరిగి పాఠశాల వైపు నడిపించగలిగా. ఇదంతా జరగడానికి దాతల సాయమే కారణం. సామాజిక మాధ్యమాల్లో వీరి గురించి చెబుతూ సాయం అందించమనేదాన్ని. పలు ఎన్జీవోలు, ఆర్థిక చేయూతనందించే వలంటీర్ల నుంచి సహాయనిధి రూ.7లక్షలు వరకు అందింది. దీన్నంతా పేద పిల్లల చదువుల కోసమే వినియోగించా. సాయమంతా ఆన్‌లైన్‌లోనే జరిగేలా చేసి, ప్రతి దాతకూ లబ్ధిదారుల వివరాల్ని తెలియజేసేదాన్ని. అలా ఇప్పటివరకు దాదాపు 300 మంది విద్యార్థులను తిరిగి చదువుకునేలా చేయగలిగా. ఓసారి నేత్రసంబంధిత వ్యాధి కారణంగా చూపు కోల్పోతున్న ఓ అనాధ విద్యార్థినికి శస్త్రచికిత్స చేపట్టడానికి పలువురు వైద్యులను అడిగితే ఫలితం ఉండదన్నారు. ఈ అంశాన్ని సోషల్‌మీడియాలో పొందుపరిచి ఈ విద్యార్థినికి వైద్యులు తిరిగి చూపు తెప్పించాలని కోరా. ఆ పోస్ట్‌ చూసిన రాధాత్రి నేత్రాలయకు చెందిన ఓ వైద్యుడు ముందుకొచ్చి, తాను ఉచితంగా చికిత్స చేస్తానన్నారు. కొందరు వలంటీర్ల సాయంతో ఆమెను ఆసుపత్రికి చేర్చగా చికిత్స నిర్వహించి తిరిగి చూపు వచ్చేలా చేశారు’ అని చెప్పుకొస్తున్న సుజిత భవిష్యత్తులో మరికొందరి ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చేలా చేయడానికి కృషి చేస్తానంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని