ఈ ట్యాక్సీ గాల్లో ఎగురుతుంది..

రెక్కలుంటే బావుణ్ను.. ఈ ట్రాఫిక్‌ కష్టాలు తప్పేవి.. అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఎగిరే ట్యాక్సీతో మీ ఊహల్ని నిజం చేయనుందీమె. హాలీవుడ్‌ చిత్రాల్లో ఆకాశంలో ఎగిరే వాహనాల తరహాలో మన దేశంలోనూ గాలిలో ట్యాక్సీలు తిప్పుతానంటోంది శ్రేయా రస్తోగి. 

Updated : 02 Jun 2022 06:36 IST

రెక్కలుంటే బావుణ్ను.. ఈ ట్రాఫిక్‌ కష్టాలు తప్పేవి.. అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఎగిరే ట్యాక్సీతో మీ ఊహల్ని నిజం చేయనుందీమె. హాలీవుడ్‌ చిత్రాల్లో ఆకాశంలో ఎగిరే వాహనాల తరహాలో మన దేశంలోనూ గాలిలో ట్యాక్సీలు తిప్పుతానంటోంది శ్రేయా రస్తోగి. 

చిన్నప్పట్నుంచీ శ్రేయాకు పరిశోధనలు చేయడం, విమానాలు నడపడమంటే ఆసక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌, మొరాదాబాద్‌కు చెందిన శ్రేయ.. కాలిఫోర్నియాలో 2018లో ఏరోస్పేస్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. పైలట్‌ కావాలన్నది తన చిన్ననాటి కల. అమెరికాలో ప్రైవేటు పైలట్‌ శిక్షణ పూర్తిచేసి, లైసెన్స్‌ తీసుకుంది. ఆపైన నాసాలో పలు ప్రాజెక్టులు చేసింది. తన సృజనాత్మక ఆలోచనలతో అక్కడ పరిశోధన-అభివృద్ధి విభాగంలో ఇంజినీర్‌గా అర్హత సాధించింది. ఒక బృందానికి నాయకత్వం వహించింది కూడా. ఆ తర్వాత ఇండియా వచ్చి ‘ఎయిర్‌ ట్యాక్సీ’ అభివృద్ధి దిశగా పనిచేస్తోంది.

మూడు కి.మీ. ఎత్తులో..

ఈ ఫ్లైయింగ్‌ ట్యాక్సీని శ్రేయా సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘ఈ-ప్లేన్‌’ సంస్థ ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో అభివృద్ధి చేస్తోంది. దిల్లీలో ఇటీవల జరిగిన భారత్‌ డ్రోన్‌ ఫెస్టివల్‌లో దీని నమూనాని ప్రదర్శించారు. ఇంటిపైనా నిలపడానికి వీలుండేలా ఈ ట్యాక్సీని డిజైన్‌ చేశారు. ‘ఈ ట్యాక్సీ(ఇ-200) గాలిలో ఏకబిగిన 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో భూమి నుంచి 3వేల మీటర్ల ఎత్తు వరకూ ఎగరగలదు. ఈ ట్యాక్సీలో పైలట్‌, ఓ ప్రయాణికుడు కూర్చోడానికి రెండు సీట్లు ఉంటాయి. ఇది విద్యుచ్ఛక్తితోనే నడుస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి చేసి ఒక ప్రయాణికుడు మాత్రమే ఉండే పరిమాణానికి తగ్గించాలనుకుంటున్నాం. ఈ ఎయిర్‌ టాక్సీ ధరలు ట్యాక్సీకంటే ఎక్కువ, హెలికాప్టర్‌కంటే తక్కువగా ఉంటాయి. 2023లో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపిస్తాం’ అని చెబుతున్న శ్రేయాకు ఈ తరహా వినూత్నమైన ఆలోచనలు కొత్తేమీ కాదు. నాసాలో కొత్త తరహా స్పేస్‌ సూట్‌ తయారీకి అవసరమయ్యే నానో కంపోజిట్‌ మెటీరియల్స్‌ అభివృద్ధిలో పనిచేసింది. గుర్రపుస్వారీ, హాకీ, ఫొటోగ్రఫీ అభిరుచులు తనని ఉత్సాహంగా ఉంచుతాయంటోంది శ్రేయ. ఇంత చేస్తున్న ఈమె వయసు మూడు పదుల్లోపే! 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్