ఆక్స్‌ఫర్డ్‌లో చదివొచ్చి.. ఐపీఎస్‌ అయ్యింది!

చిన్నప్పటి నుంచీ కష్టాలే తనకి. తన తలరాతను తనే మార్చుకోవాలని కష్టపడి చదివింది. శ్రమకు తగ్గట్టే విదేశాల్లో మంచి ఉద్యోగం. కానీ ఆమె మనసు మాత్రం దేశంపైనే! దీంతో ఉద్యోగాన్ని కాదని సివిల్‌ సర్వీసెస్‌ అందుకుంది. తన మార్గాన్ని తానే వేసుకుని ఇప్పుడెంతో మంది అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. ఇమ్లా అఫ్రోజ్‌!

Updated : 05 Jun 2022 06:22 IST

చిన్నప్పటి నుంచీ కష్టాలే తనకి. తన తలరాతను తనే మార్చుకోవాలని కష్టపడి చదివింది. శ్రమకు తగ్గట్టే విదేశాల్లో మంచి ఉద్యోగం. కానీ ఆమె మనసు మాత్రం దేశంపైనే! దీంతో ఉద్యోగాన్ని కాదని సివిల్‌ సర్వీసెస్‌ అందుకుంది. తన మార్గాన్ని తానే వేసుకుని ఇప్పుడెంతో మంది అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. ఇమ్లా అఫ్రోజ్‌!

పల్లెటూరి అమ్మాయి. చిన్న వయసులోనే నాన్న చనిపోయారు. అయినా కలలు కనడానికీ, వాటిని అందుకునే ప్రయత్నంలో ఎప్పుడూ ఇమ్లా వెనకడుగు వేయలేదు. వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుందార్క్‌. నాన్న రైతు. తనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన ఆకస్మికంగా మరణించారు. తల్లే ఒంటి చేత్తో తననీ, తమ్ముడినీ సాకింది. అమ్మ కష్టాన్ని చూస్తూ పెరిగింది ఇమ్లా. అందుకే పట్టుదలగా చదివేది. దానికి ప్రతిఫలంగా యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో చదువుకునే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇంట్లోనేమో అక్కడికి వెళ్లడానికి ప్రయాణ ఖర్చుల్నీ సమకూర్చలేని పరిస్థితి. అయినా వాళ్లమ్మ వెనకడుగు వేయలేదు. కష్టపడి డబ్బును సమకూర్చింది. ఇది చూసి చాలామంది తాహతుకు మించి ప్రయత్నించొద్దనేవారు. ఆడపిల్లను అంత దూరం ఒంటరిగా పంపితే అక్కడేం చేస్తుందో, ఏం తలవొంపులు తెస్తుందోనని భయపెట్టేవారు. కానీ ఇమ్లా తనను తాను నిరూపించుకుంటానంది. దీంతో వాళ్లమ్మా తనకు మద్దతు పలికింది.

అమ్మ నమ్మకాన్ని నిలబెడుతూ ఇమ్లా విజయవంతంగా చదువు పూర్తిచేసింది. యూఎస్‌లో మంచి ఉద్యోగాన్నీ సంపాదించింది. ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి. కానీ తన మనసు మాత్రం దేశంవైపే మళ్లేది. తనలాంటి వారికి ఏదైనా చేయాలని తాపత్రయపడుతూ ఉండేది. కొన్నాళ్లు ఈ సంఘర్షణ తన మనసులో సాగింది. చివరకు తిరిగొచ్చేసింది. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు ప్రయత్నించి 2017లో 217 ర్యాంకు సాధించింది. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘నా కల నెరవేరింది. నా పట్టుదల, ఇంట్లో వాళ్ల సాయంతోనే ఇదంతా సాధ్యమైంది. ఆ అవకాశం లేని అమ్మాయిలెందరో! కలలు కనడానికీ సంశయించే వారున్నారు. వాళ్లకి సాయం చేయాలనుకున్నా’ అంటుంది ఇమ్లా. వాళ్ల గ్రామంలో ‘హోప్‌’ అనే సంస్థను ప్రారంభించి, పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తోంది. ఒకప్పుడు అమ్మాయికి పెద్ద చదువులెందుకు? అంత దూరం పంపడం అవసరమా అని ప్రశ్నించిన వారే ఇప్పుడు తనను చూసి గర్వపడుతున్నారు. తన సేవలను పొగుడుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలను సాకారం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగడమే కాక మరెందరికో సాయమందిస్తోన్న ఇమ్లా ఎందరికో ఆదర్శవంతమేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్