లావూ.. లావణ్యమేనంటా!

మంచి ఎత్తు, తీరైన శరీరాకృతి, తెల్లగా మెరిసే ఛాయ... మోడల్‌కి కనీసార్హతలు అనుకుంటారు. కానీ అందానికి ఇవే ప్రమాణాలు కావంటూ రంగంలోకి అడుగుపెట్టింది వర్షిత తటవర్తి. కొద్ది కాలంలోనే ప్లస్‌ సైజ్‌ మోడల్‌గా అంతర్జాతీయ బ్రాండ్‌లతో పనిచేసే అవకాశాల్ని దక్కించుకుంది. అందమంటే ధైర్యం... ఆత్మవిశ్వాసం అంటున్న ఈ తెలుగమ్మాయి తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా..

Updated : 05 Jun 2022 07:37 IST

మంచి ఎత్తు, తీరైన శరీరాకృతి, తెల్లగా మెరిసే ఛాయ... మోడల్‌కి కనీసార్హతలు అనుకుంటారు. కానీ అందానికి ఇవే ప్రమాణాలు కావంటూ రంగంలోకి అడుగుపెట్టింది వర్షిత తటవర్తి. కొద్ది కాలంలోనే ప్లస్‌ సైజ్‌ మోడల్‌గా అంతర్జాతీయ బ్రాండ్‌లతో పనిచేసే అవకాశాల్ని దక్కించుకుంది. అందమంటే ధైర్యం... ఆత్మవిశ్వాసం అంటున్న ఈ తెలుగమ్మాయి తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా..

ది 2019.. స్నేహితులను కలవడానికి చెన్నై వెళ్లా. ‘అంతర్జాతీయ డిజైనర్‌ సవ్యసాచిది నగల ఎగ్జిబిషన్‌ జరుగుతోంది వెళ్దామా’ అన్నారు. తీరా వెళ్లేసరికి అక్కడాయన ఉన్నారు. వెళ్లి పలకరిస్తే.. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌’ అన్నారు. షాకయ్యా. నేను బొద్దుగా ఉంటా. చామన ఛాయ. మాది వైజాగ్‌. నాన్న ప్రసాదరావు కామర్స్‌ ప్రొఫెసర్‌, అమ్మ రమ. నా చిన్నప్పుడే దిల్లీలో స్థిరపడ్డాం. అక్కడి అమ్మాయిలేమో సన్నగా, తెల్లగా ఉండే వారు. నన్ను చాలా ఏడిపించేవారు. నాకేమో నటిని కావాలని కోరిక. జర్నలిజంలో డిగ్రీ అయ్యాక సినీ అవకాశాల కోసం చాలా ప్రయత్నించా. ఎక్కడికెళ్లినా నొసలు విరిచే వారు. ‘కలర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోండి, కాస్త బరువు తగ్గి రండి’ అనేవారు. అలాంటిది అంత పెద్ద వ్యక్తి పొగిడితే.. షాకే కదా! ‘కాకపోతే కాస్త లావు’ అని నవ్వేశా. ఆయన మాత్రం ‘నీ రూపం, రంగు.. నీ బలాలు. వాటిని చూసి బాధ కాదు, గర్వపడు’ అన్నారు. ఆ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆనందంగా ఆయనతో ఫొటో దిగి ఇంటికొచ్చేశా.

అది ఊహించలేదు

అప్పటికి నేనో ప్రకటనల సంస్థలో పని చేస్తున్నా. రెండు నెలల తర్వాత సవ్యసాచి బృందం నుంచి ఫోన్‌... ‘మోడలింగ్‌ కోసం టెస్ట్‌ షూట్‌కి కోల్‌కతా రాగలరా?’ అని. ఆశ్చర్య పోయా. ప్లస్‌ సైజ్‌ మోడళ్లు మన దేశంలో లేరు. పట్టలేనంత ఆనందంగా వెళ్లా, ఎంపికయ్యా. కానీ మళ్లీ సందేహం.. ‘తీరా ఫొటోలు బయటి కొచ్చాక ఏమంటారో’నని! నేనూహించని స్పందన వచ్చింది. నాతో పనిచేసిన వారూ ప్రొఫెషనల్‌గా, మర్యాదగా మెలగడం.. వంటివన్నీ నచ్చాయి.  ఇంట్లో చెబితే ‘నువ్వేం చేసినా మా మద్దతు నీకే’ అన్నారు. మొదలు పెట్టిన నెలలోనే ఎన్నో అవకాశాలు వచ్చాయి. నైకా, అమెజాన్‌ ఫ్యాషన్‌, మింత్రా, గార్నియర్‌ వంటి ఎన్నో ఫ్యాషన్‌, బ్యూటీ అండ్‌ లగ్జరీ బ్రాండ్‌లకు చేశా. ఫెమినా, గ్రాజియా, కాస్మొపాలిటన్‌ వంటి పత్రికల ముఖపత్రాల మీదా మెరిశా. ఎంతోమంది అమ్మాయిలు ‘మిమ్మల్ని చూశాక మాకూ ఆత్మవిశ్వాసం పెరిగింది. మీరు వేసుకున్న దుస్తుల్ని మేమూ ప్రయత్నిస్తున్నాం’ అని మెసేజ్‌లు పెడుతుంటారు. మొదట్లో నేనొక్క దాన్నే ప్లస్‌ సైజ్‌ మోడల్‌ని. ఇప్పుడు ఇంకొందరు కనిపిస్తున్నారు. ఇది చూసి నేనూ మార్పుకి కారణమయ్యా అని సంతోషిస్తుంటా.

ఆ సలహానిస్తా..

ఇప్పటికీ ఈ అమ్మాయి మోడలేంటి అనే వారున్నారు. విని ఊరుకుంటా. తోటి అమ్మాయిలకూ ఒకటే చెబుతా... మీరెలా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని వీడకండి అని. సక్సెస్‌ దక్కింది కాబట్టి, ఎన్నైనా చెబుతారు అనుకోవచ్చు. నేనూ చిన్నతనం నుంచి నా రూపంపై ఎన్నో హేళనలు విన్నదాన్నే. అయిదేళ్లు సినిమాల్లో ప్రయత్నించి భంగపడ్డా. అయినా నన్ను నేను ప్రేమించుకోవడం ఆపలేదు. ‘నాకేం తక్కువ? అందంగా ఉంటా, కష్టపడతా. నాకు నేనే రాణి’నని ప్రతీ క్షణం చెప్పుకునే దాన్ని. అందుకే అవమానాలకు కుంగి పోలేదు. దానికి తగ్గట్టుగానే అవకాశం వచ్చింది. అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.

కత్రినాకైఫ్‌ బ్యూటీ సంస్థ ‘కే బ్యూటీ’ యాడ్‌లో తనతో కలిసి నటించా. ఆమె తన ప్రయాణాన్ని నాకు చెప్పింది. మొదట్లో తనూ మోడలే. ‘మరీ తెల్లగా ఉన్నావ్‌, మరీ పొడవున్నావ్‌, ఇంకా బరువు తగ్గాలి’ ఇలా ఎన్నో అనే వారట. ఎన్నో సినిమాలకు తనని తిరస్కరించారు. ‘తపన, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించ గలవు. ఎవరి మాటలూ పట్టించుకోకుండా సాగిపో’ అని చెప్పింది. సమంత, సాయిపల్లవి, రెజీనా, ఐశ్వర్య రాజేష్‌ వంటి స్టార్లతో పనిచేశా. ఇప్పుడు అంతర్జాతీయ ప్రయత్నాల్లో ఉన్నా. శరీరానికి హాని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ఫెయిర్‌ నెస్‌, వెయిట్‌ లాస్‌, కలరింగ్‌ ఉత్పత్తులకు పని చేయను. 

నలుపు, లావు, మొటిమలు, స్ట్రెచ్‌ మార్క్స్‌.. ఇవన్నీ సహజం. వీటిని లోపాల్లా భావించి దాయకండి. మీరెలా ఉంటే అదే అందం. ధైర్యం, ఆత్మవిశ్వాసాలే మనకందం. ఓపిక, ‘నో’కి తట్టుకోగలగడం, మీపై మీకు నమ్మకం ఉంటే ఫ్యాషన్‌ రంగమే కాదు... ఎందులోనైనా దూసుకెళ్లొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్