కలల బైక్‌పై వేలకిలోమీటర్లు!

‘డుకాటి.. నా కలల బైక్‌’ ఈ మాటలు వినగానే మనకి కచ్చితంగా కాలేజీ కుర్రాళ్లు గుర్తొస్తారు. కానీ ఏడో తరగతి చదివేటప్పుడే ఈ మాటలు చెప్పేది అంకిత. అంతేకాదు తన గది గోడమీద డుకాటి పోస్టర్‌ని అతికించుకుంది కూడా. చదువుకుని

Updated : 07 Jun 2022 05:42 IST

‘డుకాటి.. నా కలల బైక్‌’ ఈ మాటలు వినగానే మనకి కచ్చితంగా కాలేజీ కుర్రాళ్లు గుర్తొస్తారు. కానీ ఏడో తరగతి చదివేటప్పుడే ఈ మాటలు చెప్పేది అంకిత. అంతేకాదు తన గది గోడమీద డుకాటి పోస్టర్‌ని అతికించుకుంది కూడా. చదువుకుని మంచి ఉద్యోగంలో చేరి.. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత తన కలని నిజం చేసుకుంది అంకిత. తనిప్పుడు జాతీయస్థాయి బైకర్‌. తన కలల బైక్‌మీద లాంగ్‌ రైడ్‌లు చేస్తూనే తనలాంటివారికి బైకు రైడింగ్‌లో శిక్షణ ఇస్తోంది కూడా. వివరాల్లోకి వెళ్తే...

అంకిత ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒక పత్రికలో డుకాటి బైకు ఫొటో చూసి మనసు పారేసుకుంది. ఎప్పటికైనా అటువంటి బైకు కొనుక్కొని నడపాలని కలలు కనేది. ఆ బైకు పోస్టర్‌ను తన గది గోడకు అంటించుకొని రోజూ చూసి మురిసిపోయేది. బండి నేర్చుకుంటా అని అమ్మా నాన్నల్ని అడిగితే, కాలేజీలో చేరాకే అన్నారు. మాట ప్రకారమే కాలేజీలోకి అడుగుపెట్టగానే బైకు కొనిస్తానని నాన్న చెప్పాడు. కానీ నా కాళ్లపై నేను నిలబడ్డాకే కొనుక్కుంటానంది అంకిత. స్నేహితుల సాయంతో బైకు నేర్చుకుంది. చదువయ్యాక ఓ ఫ్యాషన్‌ సంస్థలో ఉద్యోగానికి చేరింది. జీతాన్ని పొదుపు చేస్తూ, స్థానికంగా ఉన్న మోటార్‌సైక్లింగ్‌ జట్టులో చేరి, వారితో కలిసి డ్రైవ్‌ చేసేది. ఏడాదిలోపే రూ.90 వేలు పొదుపు చేసి తొలి బైకు కొనుక్కొంది.

దేశమంతా తిరిగి..

మగ బైకర్స్‌తో కలిసి, చాలా ట్రిప్స్‌ వేసే దాన్ని అంటుంది అంకిత. ‘ఓసారి పది రాష్ట్రాల్లో పర్యటించడానికి ప్రయాణం మొదలుపెట్టా. పట్టణాలు, నగరాలు, పర్వతాలు, ఎడారులంటూ ఆరునెలలకు పైగా లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణించా. ఈ ట్రిప్‌ నాకు జీవితమంటే ఏంటో నేర్పింది. బైకులపై ప్రేమ మరింత పెరిగింది. ఉద్యోగం చేస్తూనే, వారాంతాల్లో చిన్న చిన్న ట్రిప్స్‌కు వెళ్లేదాన్ని. బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ‘ఢాకా బైక్‌ కార్నివాల్‌’ నిర్వహకుల నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇండియా నుంచి అలా ఆహ్వానం అందుకున్న ప్రముఖ బైకర్లలో నేనూ ఉండటం సంతోషంగా అనిపించింది. టీవీఎస్‌ వన్‌ మేక్‌ ఛాంపియన్‌షిప్‌, మోటో దంగల్‌ తదితర పోటీల్లో సత్తా చాటా. ఉద్యోగం చేస్తూ, జీతాన్ని పొదుపు చేసుకునేదాన్ని. అలా అయిదేళ్లలో మరో బైకు కొన్నా. అయితే నా కలల ‘డుకాటి’ బైకును 27వ ఏట రూ.12.5 లక్షలతో కొనుక్కోగలిగా. ఎక్స్‌బీహెచ్‌పీ కోర్‌ టీంలో చేరి ప్రొఫెషనల్‌ మోటార్‌ సైక్లిస్ట్‌గా మారా. 45 రోజుల్లో 10 వేల కిలోమీటర్లు బైకుపై పర్యటించా’ అని చెప్పుకొస్తున్న అంకిత, దేశమంతా వేల సంఖ్యలో పురుషులు బైకర్స్‌గా ఉంటే అమ్మాయిలు వందల్లోనే ఉన్నారని, ఈ సంఖ్య ఇంకా పెరగాలంటుంది. ఏ రంగంలో అయినా అనుకున్నది సాధించడానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. బతికి ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల’నే ఈ మోటార్‌సైక్లిస్ట్‌ ఎందరికో స్ఫూర్తి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్