శక్తి, ముక్తి... ఒక బ్రాండ్‌!

శక్తి మోహన్‌, ముక్తి మోహన్‌.. డ్యాన్స్‌ ప్రేమికులకు ఈ రెండు పేర్లు బాగా పరిచయమే. గత పదేళ్లుగా చాలా డ్యాన్స్‌ షోలలో పోటీదార్లుగా, న్యాయనిర్ణేతలుగా... కనిపిస్తున్నారు. వీరిద్దరే వ్యాఖ్యాతలుగా షోలనీ చేస్తున్నారు.

Updated : 10 Jun 2022 07:16 IST

శక్తి మోహన్‌, ముక్తి మోహన్‌.. డ్యాన్స్‌ ప్రేమికులకు ఈ రెండు పేర్లు బాగా పరిచయమే. గత పదేళ్లుగా చాలా డ్యాన్స్‌ షోలలో పోటీదార్లుగా, న్యాయనిర్ణేతలుగా... కనిపిస్తున్నారు. వీరిద్దరే వ్యాఖ్యాతలుగా షోలనీ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ‘శక్తి-ముక్తి’ బ్రాండ్‌గా ఎదిగారు. ఆ ప్రయాణం ఎలా సాగిందంటే...

క్తి, ముక్తిలతో కలిసి ఆ తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. దాంతో మొదట్లో వీరి తండ్రి బ్రజ్‌ మోహన్‌కి కొంత అసంతృప్తి ఉండేది. అయితే ‘మేం అబ్బాయిలకి ఏం తక్కువకాద’ంటూ తమ కెరియర్లలో రాణిస్తున్నారీ అక్కాచెల్లెళ్లు. దిల్లీలో పుట్టి పెరిగిన 36 ఏళ్ల శక్తి.. సివిల్స్‌కు సిద్ధమయ్యేది. ఆ సమయంలోనే ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ రియాలిటీ షో గురించి తెలుసుకుని అందులో పోటీపడి, విజేతగా నిలిచింది. దాంతో తన లక్ష్యాన్ని మార్చుకుని ముంబయిలోని టెరెన్స్‌ లూయీ డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి డిప్లొమా చేసింది. తర్వాత ‘దిల్‌ దోస్తీ డ్యాన్స్‌’ టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. కొన్నాళ్లకి ‘డ్యాన్స్‌ ప్లస్‌’ షోకి జడ్జిగానూ పనిచేసింది. శక్తి కంటే ముక్తి రెండేళ్లు చిన్న. ఈమె డిగ్రీ తర్వాత అక్కని అనుసరించి.. ‘జరా నాచ్‌కే దిఖా’ షోలో అడుగుపెట్టింది. ఆ పోటీలో ఈమె బృందమే గెలిచింది. తర్వాత నచ్‌ బాలియే, జలక్‌ దిఖలాజా షోలలోనూ పాల్గొంది.

ఈ అక్కాచెల్లెళ్లు చిన్నప్పుడు డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. దాంతో వాళ్ల ఇల్లు ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. ఇప్పుడు బాలీవుడ్‌లో పనిచేస్తున్నారు. పద్మావత్‌ సినిమాలో ‘నయినోవాలేనే’ పాట ఆలోచన శక్తిదే. ‘నృత్య శక్తి’ పేరుతో డ్యాన్సర్‌గా, శిక్షకురాలిగా రాణిస్తోంది. ఈ పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌కు పది లక్షలకుపైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. మరోవైపు ‘ముక్తి మంచ్‌’ పేరుతో ఫిల్మ్‌ యాక్టింగ్‌ అకాడమీ నిర్వహిస్తోంది ముక్తి. అమిత్‌ త్రివేది కోక్‌ స్టూడియో ఆల్బమ్‌లో ‘తేరీయాన్‌ తు జానే’ పాటకు డ్యాన్స్‌తో పాటు నటనతోనూ అదరగొట్టేసింది కూడా.

డ్యాన్స్‌ జీవితంలోనూ భాగం..

అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి పనిచేస్తారు. శక్తి, ముక్తి ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేసే పాటలకు లక్షల్లోనే వీక్షణలు. 2020లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన డ్యాన్స్‌ వీడియోకి యూట్యూబ్‌లో దాదాపు 40 లక్షల వీక్షణలు వచ్చాయి. ముంబయిలోని వీరి ఇంటి టెర్రస్‌పైనే ఈ పాటని చిత్రీకరించడం మరో విశేషం. తమ డ్యాన్స్‌ ప్రాక్టీసుకీ ఈ విశాలమైన టెర్రస్‌ని ఉపయోగిస్తారీ అక్కాచెల్లెళ్లు. ‘డ్యాన్స్‌ విత్‌ మి’ టీవీ షో కార్యక్రమాన్ని రెండ[ు సీజన్లు నిర్వహించారు. దీన్లో బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌ నేర్పించేవారు.

‘ఇద్దరం ఒకే ఇంట్లో ఒకే పద్ధతిలో పెరిగాం. ఒకటే స్కూల్‌. కాలేజీ రోజుల్లో ఇద్దరికీ ఒకటే ఫోన్‌. శక్తి డ్యాన్స్‌ వైపు వెళ్తోంది. నేను యాక్టింగ్‌ వైపు వచ్చా. కానీ డ్యాన్స్‌ మా జీవితంలో భాగం అందుకే ఏదైనా పాటకి డ్యాన్స్‌ చేయాలంటే ఇద్దరం కలిసే పనిచేస్తాం’ అంటుంది ముక్తి.

‘మామధ్య జన్యుపరమైన సమన్వయం ఉంటుంది. మా సామర్థ్యాల్ని పరస్పరం మెచ్చుకుంటాం. ఇద్దరం కలిసి పనిచేస్తామనే మాటే కానీ, అది పనిలానే ఉండదు. ఆ సమయం ఎంతో సరదాగా గడిచిపోతుంది’ కూడా అంటుంది శక్తి.

పండగలపుడు స్నేహితులతో వీళ్ల ఇల్లు నిండిపోతుంది. విశాలమైన హాల్‌ కాస్తా డ్యాన్స్‌ ఫ్లోర్‌ అయిపోతుంది. వీళ్ల అక్క నీతి మోహన్‌ బాలీవుడ్‌లో గాయకురాలు. ముగ్గురూ కలిసి వీడియో ఆల్బమ్‌లు తెస్తుంటారు. అమ్మాయిలకే కాదు, చాలామంది అక్కాచెల్లెళ్లకీ స్ఫూర్తి వీళ్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్