ఆ సమయం.. మించిపోకూడదనీ!

నాన్న పేరుమోసిన వైద్యుడు. ఆయనే గుండె జబ్బు లక్షణాలను గమనించలేకపోయాడు. ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితేంటి? ఈ ఆలోచనే సృష్టి అదానీని ఆంత్రప్రెన్యూర్‌ని చేసింది. ఆమె సంస్థ రూపొందించిన పరికరం గుండె సంబంధిత సమస్యలను తేలిగ్గా తెలుసుకునేలా చేస్తోంది.

Updated : 11 Jun 2022 08:17 IST

నాన్న పేరుమోసిన వైద్యుడు. ఆయనే గుండె జబ్బు లక్షణాలను గమనించలేకపోయాడు. ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితేంటి? ఈ ఆలోచనే సృష్టి అదానీని ఆంత్రప్రెన్యూర్‌ని చేసింది. ఆమె సంస్థ రూపొందించిన పరికరం గుండె సంబంధిత సమస్యలను తేలిగ్గా తెలుసుకునేలా చేస్తోంది.

సృష్టి అమ్మానాన్న ఇద్దరూ వైద్యులే. సొంత ఆసుపత్రి నిర్మించి, సేవలందిస్తున్నారు. రాత్రుళ్లు రోగులకు అందుబాటులో ఉండొచ్చని హాస్పిటల్‌ పై అంతస్థులోనే నివసించేవారు. ‘చుట్టూ వైద్య వాతావరణమే! దీంతో చావులు, అద్భుతాలు లాంటివి ఎన్నో చూశాను. నాకూ ఈ రంగంపై ఆసక్తి కలిగింది. అయితే వైద్య వృత్తి కాదు.. దానికి అవసరమయ్యే టెక్నాలజీపై పనిచేయాలనుకున్నా. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేయొచ్చు’ అని చెబుతుంది సృష్టి. ఈమెది అహ్మదాబాద్‌. కోరుకున్నట్టుగానే యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో స్కాలర్‌షిప్‌ సహా బయో ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సౌత్‌ ఆసియన్‌ స్టడీస్‌లో డిగ్రీ చేసే అవకాశమొచ్చింది. పూర్తిచేసుకొని 2018లో దేశానికి తిరిగొచ్చింది.

‘నాన్న అత్యవసర విభాగంలో పనిచేస్తారు. చిన్నపాటి ఆలస్యం రోగి ప్రాణాలకు ఎంత ముప్పో ఆయనకు బాగా తెలుసు. అలాంటి ఆయన తన గుండెపోటు లక్షణాలను మాత్రం పట్టించుకోలేదు. గ్యాస్‌ అంటూ తోసిపుచ్చారు. చివరికి గుండెపోటుకు గురయ్యారు. ఆరోగ్య సంరక్షణ విధానంలో ఉన్న లోపాలు నాకప్పుడే అర్థమయ్యాయి’ అంటుదీమె. అవగాహన, స్థోమత, అందుబాటులో ఉండటం.. ఇవి కరవవ్వడం వల్లే చాలామంది గుండె జబ్బులకు బలవుతుంటారు. అన్నీ ఉన్నా తన నాన్న లాంటి నిపుణులే పొరబడుతుంటే సాధారణ ప్రజల పరిస్థితేంటని అనిపించిందామెకు. దీనికి పరిష్కారం చూపించాలనుకుంది. 2018లో వెల్‌నెస్ట్‌ టెక్‌ ప్రారంభించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే యాప్‌ ఆధారిత పరికరాలపై పరిశోధన మొదలుపెట్టింది. ఐఐటీ కాన్పూర్‌, ఐఐఎం- అహ్మదాబాద్‌, కార్నెగి మెలన్‌, యూసీ బర్క్‌లీ, ఎంఐటీ, ఎన్‌ఐడీ సంస్థల్లో చదివిన డిజైనర్లు, డెవలపర్లు, మాన్యుఫాక్చరర్లను ఎంచుకుంది. వీళ్లందరితో కలిసి 12ఎల్‌ అనే ఆప్‌ ఆధారిత ఈసీజీ సొల్యూషన్‌ సిస్టమ్‌ను రూపొందించింది. ఇది బ్లూటూత్‌తో పనిచేసే ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్‌. చిన్న బెల్డ్‌, బకుల్స్‌నూ ఇస్తారు. వాటిని శారీరానికి అతికించుకుంటే యాప్‌లో ఈసీజీ రికార్డు అవుతుంది. దాన్ని వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారా పంపుకునే వీలూ ఉంటుంది. యాప్‌లో తక్షణం చేయాల్సిన సూచనలూ అందుతాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి పరీక్షలు చేసే సమయం తగ్గుతుందన్నమాట. వెంటనే చికిత్స ప్రారంభించొచ్చు కూడా.


‘16 నెలల్లో దాదాపు 200 మందిని గుండెపోటు ముప్పు నుంచి తప్పించగలిగాం. ఐఐటీ, ఐఐఎం పూర్వవిద్యార్థులు కోఫౌండర్లుగా చేరారు. గ్రామాలకూ ఈ పరికరాన్ని చేర్చే పనిలో ఉన్నాం. ఏ వ్యక్తీ చికిత్స ఆలస్యమై చనిపోవద్దన్నది నా ఉద్దేశం. ఆ దిశగా నా సంస్థను నడిపిస్తున్నా. టెక్‌ రంగంలో అమ్మాయిలు రాణించలేరన్నది చాలామంది భావన. దాన్నీ మార్చి చూపిస్తా’ అని చెబుతోందీ 26 ఏళ్ల అమ్మాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్