ఆటతో అదరగొడుతున్నారు!

ఆ అమ్మాయిలకి ఆటలంటే ఆసక్తి.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా లక్ష్యాన్ని మార్చుకోలేదు. అరకొర వసతులతోనే సాధన చేస్తూ అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు. ‘గెలుపు పొందువరకూ అలుపు లేదు’ అంటూ దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఈ క్రీడామణులు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు.

Updated : 11 Jun 2022 08:16 IST

ఆ అమ్మాయిలకి ఆటలంటే ఆసక్తి.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా లక్ష్యాన్ని మార్చుకోలేదు. అరకొర వసతులతోనే సాధన చేస్తూ అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు. ‘గెలుపు పొందువరకూ అలుపు లేదు’ అంటూ దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఈ క్రీడామణులు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు.


సిక్కోలు నుంచి టీమిండియాకి..!

శ్రీకాకుళానికి చెందిన కూర్మాపు రమ్యకు ఆటలంటే ఇష్టం. స్థోమత లేకపోయినా కూతురి ఇష్టాన్ని కాదనలేకపోయారు తల్లిదండ్రులు బాబూరావు, నర్సాబాయి. తండ్రి ఆటోలో పొద్దున్నే నగరంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానానికి చేరుకునేది రమ్య. రన్నర్‌గా ప్రాక్టీసు ప్రారంభించిన రమ్య.. తర్వాత హాకీ వైపు ఆకర్షితురాలైంది. ఆడేందుకు అమ్మాయిలు లేకపోవడంతో సీనియర్‌  బాలమురళీకృష్ణ సహకారంతో అబ్బాయిల జట్టుతోనే సాధన చేసింది. ఎనిమిదో తరగతిలో కడపలోని క్రీడా పాఠశాలకు ఎంపికైంది. ఎత్తు ఎక్కువగా ఉండటం చూసి అక్కడ శాప్‌ శిక్షకుడు ఖాదర్‌బాషా.. గోల్‌ కీపింగ్‌ చేయమని సలహా ఇచ్చి ఆ కిట్‌ని  కొనిచ్చాడు. తన జిల్లాకి హాకీ జట్టులేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి సహకారంతో ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి, నెల్లూరు జట్ల తరఫున ఆడేది. ఆ సమయంలోనే తండ్రి మరణించడంతో హాకీపై ఆశలు వదులుకోవడానికి సిద్ధమైనా.. తాను టైలరింగ్‌ చేస్తూ కుమార్తె ఆశయాన్ని నెరవేర్చుకునేలా చేసింది నర్సాబాయి. అలా కొనసాగిస్తూ దిల్లీలోని భారత హాకీ అకాడమీకి ఎంపికైంది. అక్కడున్నప్పుడు తల్లికి జబ్బు చేయడంతో ఉపకార వేతనంలో కొంత మిగిల్చి ఇంటికి పంపేది. నార్త్‌జోన్‌ మహిళా, ఆలిండియా, ఖేలో ఇండియా.. ఇలా ప్రతిచోటా మెరుగైన ప్రదర్శన చేసేది రమ్య. ఈమె ఆంధ్రప్రదేశ్‌ హాకీ జట్టు కెప్టెన్‌ కూడా. ఈ క్రమంలో గోల్‌కీపర్‌గా గుర్తింపు సాధించింది. జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కి ముందు శిక్షణకు పిలుపొచ్చినా తుది జట్టుకు ఎంపిక కాలేదు. అయినా నిరాశ చెందకుండా మరింత కష్టపడింది. ఫలితంగా ఐర్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ అండర్‌-23 టోర్నీలో ఆడేందుకు భారత జట్టుకు ఎంపికైంది. జూన్‌ 19-26 మధ్య జరిగే ఈ పోటీల్లో భారత జట్టు నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, అమెరికా, ఉక్రెయిన్‌లతో తలపడుతుంది. హరియాణాలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేస్తోన్న రమ్య.. ఒలింపిక్స్‌లో దేశానికి పసిడి పతకం అందించడమే తన లక్ష్యమంటోంది.

- రుప్ప రమణమూర్తి, శ్రీకాకుళం


పతకంతో రావాల్సిందే..

హరియాణాలోని పంచకులలో జరుగుతున్న ఖేలో ఇండియా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణం(81 కిలోలు) సాధించింది చుక్కా శ్రీలక్ష్మి. ఈమెది విజయనగరం జిల్లా కొండ వెలగాడ. తల్లిదండ్రులు మంగమ్మ, సీతయ్య భవన నిర్మాణ కార్మికులు. శ్రీలక్ష్మి వీలున్నప్పుడల్లా ఊళ్లోని తోటల్లో పూలు ఏరడానికి వెళ్తూ తన ఖర్చులకు సంపాదించుకుంటుంది. కొండవెలగాడకే చెందిన కామన్వెల్త్‌ రజత పతక విజేత మత్స సంతోషి స్ఫూర్తితో ఈ క్రీడలో అడుగు పెట్టింది. 2016 నుంచి గ్రామంలోని ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో చేరి బూస రవి పర్యవేక్షణలో సాధన చేస్తోంది. ఈ ఏడాది ఇంటర్‌ పూర్తిచేసిన శ్రీలక్ష్మి.. క్రీడల్లో అడుగుపెట్టిన మొదటి సంవత్సరమే అండర్‌-17 విభాగంలో స్వర్ణం సాధించింది. ఈమె ప్రతిభను గుర్తించి స్థానిక జడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, శిక్షకుడు రవితోపాటు గ్రామస్థులూ ఆర్థిక సాయం చేస్తున్నారు. 2021లో భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ విభాగాల్లో రెండు బంగారు పతకాలు దక్కించుకుంది. 2020లో పంజాబ్‌లో జరిగిన పోటీల్లోనూ రెండు బంగారు పతకాలు వచ్చాయి. అదే సంవత్సరం గువాహటిలో నిర్వహించిన నేషనల్‌ యూత్‌ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో అక్కడే జరిగిన పోటీల్లో రజతం సాధించింది. ‘క్రీడల్లో రాణించడం కష్టమే.. కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా కొనసాగుతున్నా’ అని చెప్పే శ్రీలక్ష్మి కామన్వెల్త్‌ పోటీల్లో పతకమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.


రైల్వే ఉద్యోగం వదులుకుని మరీ..

కొండవెలగాడకు చెందిన శనపతి పల్లవి ఇంటర్‌ పూర్తిచేసింది. తండ్రి లక్ష్మునాయుడు తాపీమేస్త్రి, తల్లి నాగమణి కూలీ. ఆరేళ్ల కిందట గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్ని చూసిన లక్ష్మునాయుడు శిక్షకుడు చల్లా రాము వద్దకు వెళ్లి పల్లవికి శిక్షణ ఇవ్వాలని కోరారు. అప్పట్నుంచీ ఆయన ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతూ పతకాల పంట పండిస్తోంది పల్లవి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఒకానొక దశలో మానేద్దామనుకుంది. ఆ సమయంలో స్థానికులతో మాట్లాడి ఆర్థిక సహకారం అందేలా చేశారు కోచ్‌. గ్రామానికి చెందిన అజయ్‌బాబుతోపాటు రాము కూడా తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా ఖేలో ఇండియా పోటీల్లో 64 కిలోల విభాగంలో స్వర్ణం దక్కించుకొని సత్తా చాటింది పల్లవి. 2021లో జాతీయస్థాయి పోటీల్లో జూనియర్స్‌ విభాగంలో స్వర్ణం, సీనియర్స్‌ విభాగంలో రజతం సాధించింది. 2020 నేషనల్‌ యూత్‌ గేమ్స్‌లో స్వర్ణం, అదే సంవత్సరం గువాహటిలో నిర్వహించిన పోటీల్లో కాంస్యం దక్కించుకుంది. ‘మొదట్లో సరదాగా ప్రాక్టీసు చేసేదాన్ని. పతకాలు సాధించడంతో నాలో ఉత్సాహం పెరిగింది. రైల్వేలో ఉద్యోగం వచ్చినా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని చేరలేదు. వచ్చే కామన్వెల్త్‌ పోటీల్లో పతకమే నా లక్ష్య’మంటోంది పల్లవి.

-కె.మునీందర్‌, విజయనగరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్