సౌందర్య సమరంలో.. తెలుగమ్మాయిలు

చూపులకే కాదు.. మానసికంగా.. వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా కనిపించడమే అసలైన అందం. అందాల పోటీల ఉద్దేశమూ అదే! దేశం తరఫున అందాల కిరీటాన్ని అందుకోవడానికి పోటీలు మొదలయ్యాయి. జులైలో జరిగే తుదిపోటీలో పాల్గొంటున్న వారిలో ముగ్గురు తెలుగమ్మాయిలే! వారెవరో.. ఏం చెబుతున్నారో చూద్దామా!

Updated : 16 Jun 2022 07:39 IST

చూపులకే కాదు.. మానసికంగా.. వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా కనిపించడమే అసలైన అందం. అందాల పోటీల ఉద్దేశమూ అదే! దేశం తరఫున అందాల కిరీటాన్ని అందుకోవడానికి పోటీలు మొదలయ్యాయి. జులైలో జరిగే తుదిపోటీలో పాల్గొంటున్న వారిలో ముగ్గురు తెలుగమ్మాయిలే! వారెవరో.. ఏం చెబుతున్నారో చూద్దామా!


డాక్టర్‌.. మోడల్‌: సాయి లిఖిత యలమంచిలి

‘ఎంచుకున్నది ఏదైనా సాధించగలనని ముందు మానసికంగా సిద్ధమవ్వాలి. అమ్మాయిగా నువ్వు ఏమవ్వాలన్నది నీ చేతిలోనే ఉంటుంది. అది తెలుసుకుని ప్రయత్నించాలి. లేదంటే ఆ నిర్ణయం వేరొకరు తీసుకుంటారు ’

మ్మానాన్న యూకేలో ఉద్యోగులు. తను మాత్రం బామ్మా, తాతయ్యల దగ్గర పెరిగింది. తాత విశ్రాంత సైనికాధికారి. దీంతో చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ అలవాటైంది అంటుంది లిఖిత. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఎంపికైనా తన విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే. మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నుంచి ఎంబీబీఎస్‌ చేసింది. చదువులో ఎప్పుడూ ముందంజే. చిన్నతనం నుంచీ ఆటలంటే చాలా ఇష్టం. దీంతో ప్రతి దాన్నీ ప్రయత్నించేది. ఓసారి వేసవి శిబిరంలో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో గెలిచింది. అది ఆమెకు ఆ రంగంపై ఆసక్తిని కలిగించింది. తనకు బయాలజీ అన్నా ఇష్టమే. దీంతో వైద్యవృత్తికే ప్రాధాన్యమిచ్చింది. తర్వాత అందాల పోటీలు, వాటి ఉద్దేశం అర్థమయ్యాక చిన్ననాటి కలను నెరవేర్చుకోవాలని ఫెమినా ఇండియా అందాల పోటీలకు ప్రయత్నించి, ఎంపికైంది. సాధారణ స్థాయి నుంచి స్వయంకృషితో హాలీవుడ్‌ నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రా తనకు ఆదర్శమంటోంది లిఖిత. తనలాగే విభిన్న రంగాల్లో రాణించి యువతకు ఆదర్శమవ్వాలనుకుంటోంది.


తెలంగాణ.. డిజైనర్‌: ప్రజ్ఞ అయ్యగారి

‘ఎవరైనా పెద్ద కలలు కనొచ్చు, శ్రమిస్తే వాటిని నిజం చేసుకోవచ్చు. దాన్ని నిరూపిస్తూ రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నా’

పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌. ఐఎన్‌ఐఎఫ్‌డీ లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. కుటుంబమంతా ఇంజినీర్లు, డాక్టర్లు, కార్పొరేట్‌ ఉద్యోగులే. ఆ వాతావరణం తనకు సరిపోదనిపించింది ప్రజ్ఞకు. టీవీలో ప్రకటనలు చూసినప్పుడు అలా రంగుల దుస్తుల్లో  మెరవాలనుకునేది. తనకు చదరంగం, పెయింటింగ్‌ అన్నా ఇష్టం. వాటిలో బహుమతులూ గెల్చుకుంది. అది ఆమెకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఆసక్తిని కలిగించింది. ఇంట్లో వాళ్లను బతిమాలి, ఒప్పించి మరీ ఈ కోర్సులో చేరింది. పర్యావరణ హితమైన, అందరికీ అందుబాటులో ఉండే వస్త్రశ్రేణిని ఆవిష్కరించాలన్నది ఆమె కల. 2017లో మానుషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అందుకున్నప్పుడు తన మనసు మళ్లీ మోడలింగ్‌ వైపు మళ్లింది. ఈసారి ఇంట్లో ఒప్పించడానికి మరింత కష్టపడ్డానంటుంది ప్రజ్ఞ. తన ఆసక్తి, పట్టుదలను చూసి వాళ్లూ కాదనలేకపోయారు. రెండు వేల మందికి పైగా పోటీదారులను అధిగమించి తెలంగాణ కిరీటాన్ని అందుకుంది. తెలంగాణ సంస్కృతిని దేశానికి తెలియజేయడం, దేశం తరఫున ప్రపంచవేదికపై మిస్‌ వరల్డ్‌ పోటీలో నిలవడం లక్ష్యాలంటోన్న 20 ఏళ్ల ప్రజ్ఞ శాస్త్రీయ నృత్యకారిణి కూడా.


తమిళనాట నుంచి: శివానీ రాజశేఖర్‌

‘ఎవరిపై వారికి నమ్మకం ఉండాలి. ఎంతమంది నీ అభిప్రాయాన్ని మార్చాలని చూసినా నీ మనసు చెప్పిందే విను. నీ కలల్ని నువ్వు నెరవేర్చుకో. ఓటమి గురించి మాత్రం భయపడొద్దు. అదెప్పుడూ వెనక్కి లాగుతుంది. ఏది ఎదురైనా ముందుకు సాగినప్పుడే విజయం దక్కుతుంది’

మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి రావడం పరిపాటి. కానీ శివానీ సినిమాల్లో నటించి ఇప్పుడు మోడలింగ్‌పై దృష్టిపెట్టింది. ఈమె హీరో రాజశేఖర్‌, జీవితల పెద్ద కూతురు. పుట్టింది చెన్నై, పెరిగిందేమో హైదరాబాద్‌. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ప్రొడ్యూసర్‌, గాయని కూడా. అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ లో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన కలట. నాన్న అడుగుజాడల్లో నడిచి, ఆయనలానే వైద్యం, నటన రెండింటిపైనా దృష్టి పెట్టానని చెబుతోంది. ఫెమినా ఇండియా అందాల పోటీల్లో తను తమిళనాడు తరఫున ఎంపికైంది. దరఖాస్తులో వివిధ రాష్ట్రాలను ఎంచుకునే వీలుంటే తను ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణలను ఎంచుకుంది. నిర్వాహకులు తమిళనాడు నుంచి  అవకాశం ఇచ్చారు. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ ప్రవేశముంది 24 ఏళ్ల శివానికి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్