కష్టాన్ని మరిచి వ్యాధులపై యుద్ధానికి కదిలి..

కొవిడ్‌ కారణంగా తండ్రి దూరమయినా ఆ దుఃఖాన్ని అదిమిపెట్టి... తనలా ఆ మహమ్మారివల్ల మరొకరు నష్టపోకూడదనుకున్నారు జంపాల ప్రీతి. అందుకే సీసీఎంబీ తయారుచేస్తున్న టీకా తయారీలో భాగస్వామి అయ్యారు. ఆ అనుభవంతో మరిన్ని వ్యాధులపై పరిశోధనల కోసం అంతర్జాతీయ పరిశోధన సంస్థలో పోస్ట్‌ డాక్టొరల్‌ అవకాశాన్ని సాధించారు.. 

Updated : 17 Jun 2022 06:51 IST

కొవిడ్‌ కారణంగా తండ్రి దూరమయినా ఆ దుఃఖాన్ని అదిమిపెట్టి... తనలా ఆ మహమ్మారివల్ల మరొకరు నష్టపోకూడదనుకున్నారు జంపాల ప్రీతి. అందుకే సీసీఎంబీ తయారుచేస్తున్న టీకా తయారీలో భాగస్వామి అయ్యారు. ఆ అనుభవంతో మరిన్ని వ్యాధులపై పరిశోధనల కోసం అంతర్జాతీయ పరిశోధన సంస్థలో పోస్ట్‌ డాక్టొరల్‌ అవకాశాన్ని సాధించారు.. 

కొవిడ్‌ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థ ఒక్కోరకమైన సాంకేతికతను వాడి టీకాలు తయారు చేసింది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌లు ఒక పద్ధతిని అనుసరిస్తే.. మోడెర్నా, ఫైజర్‌ కంపెనీలు మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) అనే విధానంలో టీకాలు తయారు చేశాయి. కానీ ఈ ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఇటీవల వరకూ మనకు అందుబాటులో లేదు. దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికే సీసీఎంబీ స్థానికంగా పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ పరిశోధనల్లో పాల్గొని టీకా తయారీలో తనవంతు సేవ
అందించింది ప్రీతి.

స్వచ్ఛందంగా ముందుకొచ్చి...

వైరస్‌ నిర్థారణ కోసం సీసీఎంబీ మొదటిసారి ల్యాబ్‌ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పనిచేసేందుకు అంతా వెనకాడుతున్న సమయం అది. కొవిడ్‌ కారణంగా తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నా.. ఆ ల్యాబ్‌లో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది ప్రీతి. ఆ తర్వాత ఆ సంస్థ చేస్తున్న పరిశోధనల్లో భాగమైంది. ‘సైన్స్‌ అంటే ఇష్టం నాకు. ప్లస్‌2 తర్వాత హైదరాబాద్‌లోని జీఆర్‌ఐఈటీలో బయోటెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీలో చేరాను. అప్పట్నుంచీ పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత తంజావూరులోని శాస్త్రలో ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ చేశాను. ఆ సమయంలో కొంతమంది శాస్త్రవేత్తలను కలుసుకున్నా. వారు కలిగించిన స్ఫూర్తితోనే సీసీఎంబీలో పీహెచ్‌డీ పూర్తి చేశాను. అందులో భాగంగానే ఈ టీకా తయారీలో పాల్గొన్నా. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సాంకేతికతకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం సేకరించి.. ప్రయోగాలు చేపట్టాం. డిజైన్‌ దశ నుంచి కొత్త పద్ధతులు ఉపయోగించి స్వదేశీ సాంకేతికతను మా బృందం రూపొందించింది. పదినెలల వ్యవధిలోనే ఈ టీకాను విజయవంతంగా అభివృద్ధి చేశాం. తక్కువ వ్యవధిలో దీన్ని సాధించడం, పరిశోధనల్లో దీన్నొక మైలురాయిగా శాస్త్రవేత్తలు అభినందించినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. ఇప్పుడున్న సంప్రదాయ టీకా తయారీ పద్ధతుల్లో కొత్త వైరస్‌ను తట్టుకునేలా టీకా చేయాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో 30 నుంచి 40 రోజుల్లోనే చేయవచ్చు. ఇందుకు కొత్త వైరస్‌ జన్యుక్రమం తెలిస్తే చాలు. ఒక్క కొవిడ్‌ మాత్రమే కాదు ఇతర అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకూ ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సాంకేతికత ఉపయోగపడనుంది. క్షయ, మలేరియా, డెంగ్యూ, క్యాన్సర్‌, అంటువ్యాధులకు సైతం ఈ పరిజ్ఞానం వాడి టీకా తయారు చేయొచ్చు. ఈ విషయంలో నేను సంపాదించిన జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకుని మరిన్ని వ్యాధులకు టీకాలు రూపొందించాలన్నది నా లక్ష్యం. దాన్ని నెరవేర్చుకోవడం కోసం అమెరికాలోని విఖ్యాత ఎండీ అండర్సన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ చేస్తున్నా.  టీకా సాంకేతికతపై పనిచేసిన నా అనుభవం క్యాన్సర్‌ పరిశోధనలో సాయపడుతుందని, తద్వారా మానవాళికి నా వంతు సేవల్ని అందించగలనని ఆకాంక్షిస్తున్నా’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ప్రీతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్