తిండి.. ఆమెకు శత్రువు!

జీవించడానికి తినడం మామూలే. కానీ తినడమే లగ్జరీ అయితే? ఒంట్లో దాన్ని అరిగించుకోవడమే కష్టమైతే! ఇదెక్కడి సమస్య అంటారా? దానిపైనే వేల మందికి అవగాహన కల్పిస్తోంది శ్రుతి విజయ్‌.కడుపు నిండినట్లు.. కాదు కాదు

Updated : 20 Jun 2022 06:46 IST

జీవించడానికి తినడం మామూలే. కానీ తినడమే లగ్జరీ అయితే? ఒంట్లో దాన్ని అరిగించుకోవడమే కష్టమైతే! ఇదెక్కడి సమస్య అంటారా? దానిపైనే వేల మందికి అవగాహన కల్పిస్తోంది శ్రుతి విజయ్‌.

డుపు నిండినట్లు.. కాదు కాదు తిన్నది ఎక్కువై కడుపు పగిలిపోతుందేమో అన్నట్లున్న భావన ఎప్పుడైనా అనుభవించారా? ఏదో ఒక సందర్భంలో బాగా నచ్చిన పదార్థాలు కనిపించినపుడో.. తిన్నది సరిగా అరగనప్పుడో అలాంటి భావన మామూలే. దీనిలో గొప్పేముంది అంటారా? అలాంటప్పుడు ఏం చేస్తారు? అరగడానికి ఓ నాలుగు అడుగులు వేస్తాం కదా! ‘నేను గంటన్నర పరుగు తీసేదాన్ని. ఈ ఉబ్బరం అనే భావన ఎలా ఉండేదో తెలుసా? ఊపిరి పీల్చుకోవడమూ భారంగా ఉండేది. కడుపు, ఊపిరితిత్తులు పగిలి పోతాయేమోన్నంత బాధ. వెన్నంతా ఒకటే నొప్పి. తట్టుకోలేక బలవంతంగా వాంతి చేసుకునేదాన్ని. అప్పుడు కానీ ప్రాణం తేలిక పడేది కాదు. తినకపోవడంలో ఆనందం కనిపించేది’ అంటుంది శ్రుతి.
తనది చెన్నై. ఎప్పుడైనా ఇలా అనిపించడం మామూలే కదా అనుకుందీమె. కొన్ని గంటలు కడుపు ఖాళీగా ఉన్నా తినాలన్న ఆసక్తి కానీ, ఆకలి కానీ ఉండేది కాదు. నాలుగు గంటలు కాస్తా 8, 12, 16, 24 ఇలా పెరుగుతూ వచ్చింది. అప్పుడే ఏదో సమస్య ఉందన్న విషయం తనకు అర్థమైంది. ‘గంటలు రోజులకు మారింది. అద్దంలో నా రూపం చూసుకుంటే ఎముకల గూడే. దీనికి తోడు విపరీతమైన చలి. గంటల కొద్దీ వ్యాయామం చేసినా, మండు టెండలో నడిచినా వణుకు వదిలేది కాదు. ఇక అప్పటికీ ఇది మామూలే అని ఊరుకోలేకపోయాను. వైద్యులను కలిస్తే అనోరెక్సియా నెర్వోసా.. అదీ తీవ్రంగా ఉందన్నారు. ఇదో రుగ్మత. బరువు పెరుగుతున్నామన్న ఆందోళన, దాంతో విపరీతమైన ఎక్సర్‌సైజ్‌లు చేయడం, తిండి మీద అనాసక్తి, ప్రతి కెలొరీనీ లెక్కేసుకోవడం, తిన్నది వాంతి చేసుకోవడం.. లాంటివెన్నో చేస్తుంటారు. మానసిక రుగ్మతలూ చుట్టుముడతాయి. చావు ఆలోచనలూ వస్తాయి.

‘ఆసుపత్రిలో చేరా. కొన్నిసార్లు ఈ జీవితం ఎందుకనిపించేది. వెంటనే బతుకు మీద ఆశ కలిగేది. నా ఆలోచనలు నాకే వింతగా తోచేవి. నాకేమవుతుందోనన్న నాన్నను చూసి వాళ్లకోసమైనా బతకాలనిపించేది. నెమ్మదిగా కోలుకున్నా. అయినా తినడానికి నేను అనర్హురాలినన్న భావనే. అమ్మానాన్న కోసం బలవంతంగా తినేదాన్ని. ఇదో నిరంతర యుద్ధమని అర్థమైంది. రోజూ పోరాటమే. నావాళ్ల కోసం వాళ్ల ఆనందం కోసం కొద్దిగా అయినా తినేదాన్ని. కానీ అదో నరకం. దానికి ఎవరినీ బాధ్యుల్ని చేయలేను. కానీ ఎన్నోసార్లు దీనిపై అవగాహన ఉంటే ఇంతవరకూ వచ్చేది కాదు. నా పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదనిపిస్తుంది’ అని చెబుతుంది శ్రుతి. అందుకే తను ఆ పని చేయాలనుకుంది. తన పరిస్థితిని వివరిస్తూ దీనిపై అవగాహన కల్పిస్తోంది. మానసిక, ఆహార సంబంధిత రుగ్మతలు ఏవైనా ఉన్నా, అనుమానంగా తోచినా వెంటనే వైద్యులను కలవమని సూచిస్తోంది. తన పరిస్థితి మెరుగుదల కోసం యోగాను ఆశ్రయించిన శ్రుతి ఇప్పుడు అందులో ఇన్‌స్ట్రక్టర్‌ అయిపోయింది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసిన ఈమె న్యూట్రిషన్‌, మానసిక ఆరోగ్యంపై దాని ప్రాధాన్యం వంటి అంశాలపైనా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లలో అవగాహన కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్