మోడర్న్‌ జలకన్య.. రికార్డు కొట్టింది!

సముద్రం, దాని అందం చూసి మురిసిపోవడానికే పరిమితం కావాలనుకోలేదామె. దానిలోని జీవుల్నీ, పర్యావరణాన్నీ కాపాడాలనుకుంది. మరింత మందిలో అవగాహన కలిగించాలంటే ఏదైనా పెద్దగా

Published : 22 Jun 2022 01:47 IST

సముద్రం, దాని అందం చూసి మురిసిపోవడానికే పరిమితం కావాలనుకోలేదామె. దానిలోని జీవుల్నీ, పర్యావరణాన్నీ కాపాడాలనుకుంది. మరింత మందిలో అవగాహన కలిగించాలంటే ఏదైనా పెద్దగా సాధించాలనుకున్న ఆమె ఏకంగా ప్రపంచ రికార్డునే కొట్టింది.

మెర్లే లీవండ్‌కి చిన్నప్పటి నుంచీ ఈతపై ఆసక్తి. ఈత నేర్చుకొంది. ఏమాత్రం సమయం దొరికినా సముద్రంలో ఈతకి వెళ్లిపోయేది. కానీ ఎక్కడ చూసినా వ్యర్థాలే. అవి సముద్ర జీవులకు హాని కలిగిస్తోంటే కోపం, బాధ కమ్ముకొచ్చేవి. దీంతో సముద్ర జలాల కాలుష్యం, దానివల్ల నష్టాలపై అందరికీ అవగాహన కలిగించాలనుకుంది. ఈమెది అమెరికాలోని ఫ్లోరిడా.  ‘ఈతకెళ్లినప్పుడల్లా నాకు కనిపించిన చెత్తనంతా ఒడ్డుకు తీసుకొచ్చేదాన్ని. కానీ అదెంత? ఇంకా లోపల చాలా పేరుకుపోయింది. నా చిన్న ప్రయత్నం దానికి పరిష్కారం కాదు. సముద్ర జలాల్లో వ్యర్థాల గురించి అందరికీ అవగాహన కల్పించాలనుకున్నా. కానీ ఎంతమందికని చెప్పగలను? ఏదైనా సాధిస్తే ఎక్కువమందికి చేరుతుందనిపించింది. అందుకోసం ప్రపంచ రికార్డు సాధించడానికి సిద్ధమయ్యా. అప్పుడు ప్రపంచం మొత్తానికీ చెప్పొచ్చనిపించింది. నాకు డాల్ఫిన్‌లంటే చాలా ఇష్టం. వాటికీ, నాకూ అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంటుంది. వీటిలాగే ఈదాలనిపించేది. అందుకే చేప తోకలా ఉండే మోనోఫిన్‌ను తయారుచేయించుకున్నా. అంటే... జలకన్యలకు ఉండే చేప తోకలాంటిది. దాన్ని సిలికాన్‌తో తయారు చేయించుకున్నా. దీన్ని ధరిస్తే చేతులను ఉపయోగించనక్కర్లేదు. కాళ్లను కదుపుతూ ముందుకెళ్లొచ్చు. దీన్ని ధరించి ఈదడంలో ఏడాది శిక్షణ తీసుకున్నా. తెల్లవారు జాము నాలుగు గంటలకు సాధన మొదలుపెట్టేదాన్ని. ఈదేటప్పుడు శ్వాస పీల్చడంలో మెరుగుదలకు యోగా చేశా. పోషకాహారంపై దృష్టిపెట్టా. ఈత కొట్టేటప్పుడు కండరాలు పట్టేసే సమస్యను అధిగమించడానికి మెగ్నీషియం, పొటాషియం మాత్రలు వేసుకునేదాన్ని. నామీద నాకు నమ్మకం ఏర్పడ్డాక ఫ్లోరిడా మియామీ బీచ్‌ నుంచి గత నెలలో 26.2 మైళ్లు ఈదాను. ఈదినంతసేపూ నాక్కనిపించిన వ్యర్థాలన్నింటినీ నా వెంట వచ్చిన బోటుల్లో వేస్తూ వచ్చా. మొత్తం 11.54 గంటలు పట్టింది. రికార్డు కోసం 18.6 మైళ్లు ఈదితే చాలు. దాన్ని దాటిమరీ ప్రయాణించా. ఇది గిన్నిస్‌ రికార్డు. సాధించాక ఒకటే చెప్పా.. పర్యావరణంలో సముద్రాలూ భాగం. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతా మనదే. ఇది అందరికీ తెలియజేయడమే నా సాహసం ఉద్దేశమని’ అంటున్న మెర్లే లీవండ్‌ను అందరూ మోడర్న్‌ జలకన్యగా అభివర్ణిస్తున్నారు. అన్నట్టూ రికార్డు చేసి తన పని అయిపోయిందనుకోలేదీమె. సముద్రజలాల పరిరక్షణ కోసం న్యాయవాదిగా పనిచేస్తూ తనవంతు సేవలు అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్