మేజర్‌ కోసం... పెద్ద పరిశోధనే చేశా!

ఓవైపు తల్లికాబోతున్న ఆనందం.. మరోవైపు కెరియర్‌ని మలుపు తిప్పే అవకాశం. చాలామంది మహిళలకు ఎదురయ్యే సవాలే రేఖ బొగ్గరపు కూడా ఎదుర్కొంది. ఆమె ధైర్యం చేసి రెంటికీ సిద్ధమైంది. కడుపులో బిడ్డతోనే మేజర్‌ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. ఫలితమే రెట్టింపు సంతోషం. ఆ అనుభవాలనీ, సినిమాల్లోకి వచ్చిన తీరునీ వసుంధరతో పంచుకున్నారిలా...

Updated : 23 Jun 2022 07:24 IST

ఓవైపు తల్లికాబోతున్న ఆనందం.. మరోవైపు కెరియర్‌ని మలుపు తిప్పే అవకాశం. చాలామంది మహిళలకు ఎదురయ్యే సవాలే రేఖ బొగ్గరపు కూడా ఎదుర్కొంది. ఆమె ధైర్యం చేసి రెంటికీ సిద్ధమైంది. కడుపులో బిడ్డతోనే మేజర్‌ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. ఫలితమే రెట్టింపు సంతోషం. ఆ అనుభవాలనీ, సినిమాల్లోకి వచ్చిన తీరునీ వసుంధరతో పంచుకున్నారిలా...

రోజే ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అయింది. ఆ సంతోషాన్ని మావాళ్లతో పంచుకుంటుండగా ఆఫీసుకి రమ్మని దర్శకుడు శశి నుంచి ఫోన్‌. ‘మేజర్‌’ లైన్‌ చెప్పారు. చాలా బావుందన్నా. ‘నువ్వే కాస్ట్యూమ్‌ డిజైనర్‌’ అన్నారు. ఏం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు. మావారు చంద్రకృష్ణ డాక్టర్‌. ఆయన్ని అడిగితే.. ‘ఇబ్బందవుతుందేమో, విషయం చెప్పు’ అన్నారు. ప్రెగ్నెన్సీ గురించి శశికి చెబితే.. పక్కకి వెళ్లి ఎవరితోనే ఫోన్లో మాట్లాడొచ్చి ఫర్వాలేదన్నారు. వెంటనే మా గైనకాలజిస్ట్‌ని కలిసి విషయం చెప్పా. సినిమా చాలా ముఖ్యం, బిడ్డ ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదంటే చేస్తానన్నా. ఆమె భరోసా ఇవ్వడంతో ఓకే చెప్పా.

అర్ధరాత్రి దాటేది..

షూటింగ్‌ మొదలవ్వడానికి టైమ్‌ తక్కువ ఉంది. సకాలంలో అవసరమైన పరిశోధన చేయగలనా అనుకున్నా. ఎందుకంటే ఇది మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితకథ. వాస్తవికంగా ఉండాలి. పైగా యూనిఫామ్‌ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. సందీప్‌ పాత్ర కోసం ఏడెనిమిది రకాల యూనిఫామ్‌లు ధరిస్తారు శేష్‌. ఎన్డీఏ, ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ.. వీటికి వేర్వేరు ర్యాగ్‌లూ, బ్యాడ్జీలూ ఉంటాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఇంకా పోలీసులూ ఉంటారు చిత్రంలో. మొత్తంగా యూనిఫామ్‌లమీద పెద్ద పరిశోధనే చేశా. మామూలు వాళ్లకి తేడాలు తెలియకపోవచ్చు. కానీ ఆ రంగంలో ఉన్న వాళ్లకి తెలుస్తాయి. నటి స్వాతి నా స్నేహితురాలు. వాళ్ల నాన్న నేవీలో పనిచేశారు. ఎన్డీఏలో సందీప్‌గారి జూనియర్‌.. విజయ్‌, ఆడిషన్స్‌కి వచ్చిన ఓ అమ్మాయి వాళ్ల నాన్నగారు శరత్‌.. ఎన్‌ఎస్‌జీలో చేశారు. వీళ్లతో మాట్లాడా. ఆర్మీ దుకాణాల్లో ఉండే బ్యాడ్జీలు బయటవాళ్లకి ఇవ్వరు. మన ఆధారాలూ, సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ లెటర్‌ అన్నీ అందించాలి. నాకేమో తిరిగే పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో ఉంటూనే అతి కష్టంమీద అవన్నీ సేకరించగలిగా. పనులతో ఒక్కోసారి అర్ధరాత్రి దాటేది. బాగా అలసిపోయే దాన్ని. రిస్కు చేస్తున్నానేమో అనిపించేది. కానీ చిత్ర బృందం నామీద పెట్టుకున్న నమ్మకమే నన్ను నడిపించింది. ఎనిమిదో నెల వరకూ పనిచేస్తూనే ఉన్నా. అంతలో మొదటి లాక్‌డౌన్‌. అప్పుడే బాబు పుట్టాడు. కాస్త విరామం తర్వాత బాబుని చూసుకుంటూ మిగతా భాగానికి పనిచేశా. సినిమాని ఆర్మీ క్లియరెన్స్‌ కోసం చూపించినప్పుడు యూనిఫామ్‌ల విషయంలో ఒక్క మార్పూ చెప్పకపోయే సరికి ఊపిరి పీల్చుకున్నా.

ఇన్నాళ్లకి మెచ్చుకున్నారు

మేజర్‌ రిలీజయ్యాక స్కూల్‌ ఫ్రెండ్స్‌, టీచర్స్‌, కాలేజీ ఫ్రెండ్స్‌, లెక్చరర్స్‌ ఎక్కడెక్కడినుంచో ఫోన్స్‌ చేస్తూనే ఉన్నారు. ‘సినిమాల్లోకి వెళ్లావా నమ్మలేకపోతున్నాం’ అంటున్నారు. నేను బాగా చదివేదాన్ని మరి. నాన్న లాయర్‌, అమ్మ హైదరాబాద్‌లో ఓ విద్యా సంస్థని నడుపుతారు. ఆ బాధ్యతలు చూసుకోవాలని మావాళ్లు కోరుకునేవారు. నాకేమో ఫ్యాషన్‌ అంటే ఇష్టం. ఇంట్లో వాళ్ల కోసం పీజీ చేస్తూనే చిన్న బొటిక్‌ నడిపేదాన్ని. ఆ తర్వాత ఫ్యాషన్లో పీజీ డిప్లొమా చేశా. బొటిక్‌కి వచ్చిన ఓ అమ్మాయి నన్ను గూఢచారి సినిమా కోసం శేష్‌, శశిలకు పరిచయం చేసింది. ఆ సినిమాకి పనిచేస్తూ చాలా నేర్చుకున్నా. ఆ తర్వాత మరో పీజీ చేశా. తర్వాత ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ వెబ్‌ సిరీస్‌కి పనిచేశా. దాని కోసం సోషల్‌ మీడియా సాయంతో ఆ కాలానికి సంబంధించిన వెయ్యి ఫొటోలు సేకరించా. ఏ ప్రాజెక్టుకీ సినిమాల్ని ఆధారం చేసుకోను. దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి, నిజమైన ఫొటోల్ని చూసి.. అప్పుడే డిజైన్‌ చేస్తా. మేజర్‌ తర్వాత హిట్‌-2లో శేష్‌ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశా, మరో టీవీ సిరీస్‌కి పనిచేశా. ఇప్పుడు చాలా అవకాశాలు వస్తున్నాయి. మా ఇంట్లో, అత్తారింట్లో మొన్నటివరకూ నా వృత్తిపైన కొంత అసంతృప్తి ఉండేది. ఇప్పుడు వాళ్లు నన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని