మిల్లు కూలీ.. బంగారు పతకధారి
పేద కుటుంబం. ఇల్లే గడవని స్థితి. ఈ సమయంలో తన చదువు కుటుంబానికి భారమవకూడదనుకుంది నివేదా. కూలికి వెళుతూ పై చదువులు పూర్తిచేసింది. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు, బంగారు పతకమే కాదు జాతీయ స్థాయి పురస్కారాన్నీ దక్కించుకొని
పేద కుటుంబం. ఇల్లే గడవని స్థితి. ఈ సమయంలో తన చదువు కుటుంబానికి భారమవకూడదనుకుంది నివేదా. కూలికి వెళుతూ పై చదువులు పూర్తిచేసింది. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు, బంగారు పతకమే కాదు జాతీయ స్థాయి పురస్కారాన్నీ దక్కించుకొని కుటుంబానికే గర్వకారణంగా, తోటివారికి స్ఫూర్తిగా నిలిచింది.
నివేదా వాళ్లది ఊటీ. ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చారు. ముగ్గురు అమ్మాయిల్లో రెండో సంతానం తను. ఇంటర్ వరకూ సర్కారు బళ్లోనే చదివింది. తినడానికే లేని పరిస్థితి.. ఫీజు కట్టే స్థోమత ఎక్కడిది? దీంతో డిగ్రీ కలగానే మారింది. మరో దారి లేక అక్క వస్త్రాల మిల్లులో కూలికి చేరింది. నివేదా కూడా అక్క బాటే పట్టింది. కూతుళ్లను కూలికి పంపడం చూసి అమ్మానాన్న కుంగిపోయే వారు. కానీ వాళ్లు మాత్రం అక్కడితో ఆగాలనుకోలేదు. ఈ అక్కాచెల్లెళ్లు పనిచేసే కేపీఆర్ మిల్స్ సంస్థ యాజమాన్యానికి విద్యా సంస్థలూ ఉన్నాయి. వారు తమ సంస్థలో పని చేసే యువతులకు తమ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తారు. విషయం తెలిసి నివేదా యాజమాన్యాన్ని కలిసింది. అలా ఆ వస్త్రాల మిల్లులో ఆపరేటర్‌గా శిక్షణ పొంది, వారి సంస్థలోనే చదవడం మొదలుపెట్టింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పని; రాత్రి 7 - 9 కాలేజీ... ఇదే వీరి దినచర్య.
చిన్నతనం నుంచీ అమ్మానాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగింది నివేదా. ఆ పరిస్థితిని మార్చాలనుకుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా చదువుపైనే దృష్టిపెట్టేది. అలా దూరవిద్య ద్వారా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) మూడేళ్ల కోర్సును తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుంచి 86శాతం మార్కులతో పూర్తి చేసింది. మొదటి ర్యాంకు సాధించి తాజాగా చెన్నైలో జరిగిన స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి చేతుల మీదుగా బంగారుపతకంతో పాటు.. ప్రశంసల్నీ అందుకుంది. చదువే కాదు.. పనిలోనూ ప్రత్యేకతను చాటుకున్న ఆమె వస్త్రాల ఫినిషింగ్ విభాగానికి ఇన్‌ఛార్జి అయ్యింది. ఇప్పుడు తన పరిధిలో 90 మంది పని చేస్తున్నారు. తనలాగే పని చేస్తూ చదువుకోవాలనుకుంటున్న వాళ్లకు ఆదర్శంగా నిలవడమే కాదు.. వారిని ప్రోత్సహిస్తోంది కూడా. ‘ఏ దారీ లేదని అనుకున్నప్పుడు ఈ మిల్లు ఓ దారిచూపింది. మా చదువు కొనసాగించేలా చేసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లం బాగా చదువుకుంటున్నాం. మమ్మల్ని చూసి అమ్మానాన్నా ఆనందంగా ఉన్నారు’ అని గర్వంగా చెబుతోందీ 21 ఏళ్ల అమ్మాయి. నివేదా ప్రతిభను గుర్తించిన ‘కామన్‌వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా’ సంస్థ తనను సత్కరించింది. ప్రొఫెసర్ అయ్యి... చదవాలని ఉండీ, అవకాశం లేని అమ్మాయిలకు బాసటగా నిలవాలనుకుంటున్నా నంటోంది నివేదా. అన్ని సౌకర్యాలున్నా వెనకబడుతున్న వారుంటే.. ఓ వైపు పని, రాత్రిపూట చదువుతూ తను ముందంజలో నిలబడటమే కాదు. మరెందరినో చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్న నివేదా స్ఫూర్తిదాయకమే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.