పెద్దవాళ్లకు డిజిటల్ పాఠశాల
షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతి చిన్న పనికీ స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. కానీ పెద్దవాళ్లకేమో వాటి వాడకంపై అవగాహన ఉండదు. దాంతో వయసు మళ్లినవారికి ఈ రకమైన డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంచేందుకు ‘ది సోషల్ పాఠశాల’ని ప్రారంభించింది ముంబయికి చెందిన మహిమా...
షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతి చిన్న పనికీ స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. కానీ పెద్దవాళ్లకేమో వాటి వాడకంపై అవగాహన ఉండదు. దాంతో వయసు మళ్లినవారికి ఈ రకమైన డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంచేందుకు ‘ది సోషల్ పాఠశాల’ని ప్రారంభించింది ముంబయికి చెందిన మహిమా...
‘ఫేస్‌బుక్‌లో ఫొటోలు ఎలా ఉంచాలిరా?’ అని ఇంట్లో పిల్లల్ని అడిగితే ‘ఎన్నిసార్లు చెప్పాలి..నీకు?’ అని విసుక్కుంటారు. అందరిలా ఫోన్ వినియోగించాలనే ఆసక్తి ఉన్నా... వయసుపైబడిన వారికి సోషల్‌మీడియా వినియోగంపై, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై అంతగా అవగాహన లేక నిరాశ పడుతుంటారు. కొన్నిసార్లు ఈ దిశగా మోసపోవడం కూడా జరుగుతుంటుంది. వీటిని దగ్గరగా చూసింది ముంబయికి చెందిన 29 ఏళ్ల మహిమాభలోటియా. కొవిడ్ సమయంలో వృద్ధులు ఒంటరిగా ఉండటం, మందులు, ఆహారం, సామాన్లను తెప్పించుకోవడం కోసం ఇబ్బందులు పడటం గుర్తించిందీమె. ఇటువంటివారికి డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తే వాళ్ల పనులను వారే పూర్తిచేసుకోగలుగుతారు కదా అనుకుంది. కానీ ఓ సంస్థలో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండటంతో సమయం దొరికేది కాదు. అయితే లాక్‌డౌన్ సమయంలో తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తర్వాత పూర్తి సమయం పెద్దవాళ్ల కోసమే కేటాయించింది.
మొదటి పాఠం అదే...
‘ది సోషల్ పాఠశాల’ను 2020లో ప్రారంభించా అంటుంది మహిమా భలోటియా. ‘ఈ పాఠశాలను ప్రారంభించినప్పుడు కొందరు పెద్దవాళ్లు తమ చేదు అనుభవాలను చెప్పారు. అవి విన్నాక ఆన్‌లైన్ ప్రపంచం గురించిన ఎన్నో కొన్ని పాఠాలు నేర్పించి ఈ మోసాల బారి నుంచి వృద్ధులను కాపాడాలని అనుకున్నా. అప్పటికింకా నేను ఉద్యోగంలోనే ఉన్నా. ఓసారి మా బాస్‌ను క్యాబ్ బుక్ చేయమని వాళ్లమ్మగారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎలా బుక్ చేసుకోవాలో నీకు మహిమా నేర్పుతుంది అని మా బాస్ అంటుంటే నాకో ఆలోచన తట్టింది. వయసు పైబడిన వారు తమ కోసం సొంతంగా క్యాబ్ బుక్ చేసుకోవడం నేర్పించడమే నా మొదటి పాఠం అవ్వాలనుకున్నా. దినపత్రికలో యాడ్ ఇస్తే, లెక్కలేనన్ని ఫోన్స్ వచ్చాయి. అలా 2020 మేలో ప్రారంభించిన ఈ పాఠశాల మొదటి నెలలో ముంబయి సహా దిల్లీ, కోల్‌కతా, పుణె, జయపురకు చెందిన 100మందికి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడంతో మొదలైంది’ అని చెబుతోంది మహిమా.
వాట్సప్ వాడకం నేర్పిస్తూ...
వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రం, ట్విటర్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్‌డ్రైవ్, జూమ్ తదితర అప్లికేషన్స్‌పై అవగాహన, వాటిని వినియోగించడం వంటివన్నీ మహిమా తరగతిలో పాఠ్యాంశాలు. తన స్టూడెంట్స్‌నందరినీ ‘యంగ్ ఓల్డీస్’ అని పిలుస్తుంది మహిమా. తన శిష్యులందరూ తమ పనులన్నింటినీ తామే చేసుకునే స్థాయికొచ్చారంటుంది. ‘కొందరు వెంటనే పాఠాలు అర్థం చేసుకోకపోతే సహనంగా చెబుతుంటా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నా. దాదాపు నాలుగువేల మందికి అవగాహన కలిగించా. భవిష్యత్తులో దీన్ని విస్తృతం చేయాలని ఉంది’ అని చెప్పుకొస్తున్న మహిమా ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.