అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!

తన సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించిందా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆ క్రమంలో మన సంప్రదాయంలో, తరతరాల అలవాట్లలో ఎన్నో వైద్యవిధానాలు దాగున్నాయని గ్రహించింది. వాటి ఆధారంగా తన సమస్యకు పరిష్కారాలు కనుక్కుంది. తర్వాత వాటితోనే వ్యాపారవేత్తగా ఎదిగింది. ఇప్పుడామె తయారు చేస్తున్న ఉత్పత్తులు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అదే వ్యాపారంలో సామాజిక సేవనూ మిళితం చేసి ముందుకు సాగుతున్న స్తుతి కొఠారి స్ఫూర్తి కథనం ఇదీ...

Updated : 05 Jul 2022 09:25 IST

తన సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించిందా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆ క్రమంలో మన సంప్రదాయంలో, తరతరాల అలవాట్లలో ఎన్నో వైద్యవిధానాలు దాగున్నాయని గ్రహించింది. వాటి ఆధారంగా తన సమస్యకు పరిష్కారాలు కనుక్కుంది. తర్వాత వాటితోనే వ్యాపారవేత్తగా ఎదిగింది. ఇప్పుడామె తయారు చేస్తున్న ఉత్పత్తులు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అదే వ్యాపారంలో సామాజిక సేవనూ మిళితం చేసి ముందుకు సాగుతున్న స్తుతి కొఠారి స్ఫూర్తి కథనం ఇదీ...

కోల్‌కతాకు చెందిన స్తుతి, అంకిత్‌ ఐటీ ఉద్యోగులు. ఈ దంపతులు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు మారేటప్పుడు అక్కడి వాతావరణం వీరి ఆరోగ్యంతోపాటు చర్మం, జుట్టుపైనా ప్రభావాన్ని చూపేది. దీన్నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తుల గురించి ఆరా తీసే వారు. అన్నీ రసాయనాలు ఎక్కువగా ఉన్నవే. విషయాన్ని ఇంట్లో చెబితే.. స్తుతి అమ్మమ్మ తాను ఆచరించే చిట్కాలను వివరించింది. వాటితో జుట్టు రాలడం తగ్గడాన్ని గుర్తించిన స్తుతి.. చర్మసౌందర్యానికీ ఆవిడ సలహాలు తీసుకునేది. వాటితోనూ మంచి మార్పు రావడం గమనించి... ఇవి అందరికీ చేరేలా చేయాలనుకుందీమె. అంకిత్‌ కూడా ప్రోత్సహించడంతో ముందుగా కొన్ని ఉత్పత్తులను స్నేహితులకిచ్చి వినియోగించమన్నారు. మంచి స్పందన రావడంతో 2018లో ‘విష్‌కేర్‌’ను మొదలుపెట్టారు.

సహజ సౌందర్యం... రసాయనరహితంగా, ఉన్నత ప్రమాణాలతో సహజమైన పద్ధతుల్లోనే సౌందర్యోత్పత్తుల తయారీ ప్రారంభించారు స్తుతి. ‘ముందుగా ఆముదం, ఆలివ్‌, బాదంనూనెలతో కోల్డ్‌ ప్రెస్డ్‌ హెయిర్‌ ఆయిల్స్‌ తయారీ మొదలుపెట్టా. ఆన్‌లైన్లో మార్కెటింగ్‌ ప్రారంభించాం. క్రమేపీ ఆర్డర్లు రావడం మొదలైంది. ఓసారి అమ్మమ్మ పులియబెట్టిన బియ్యం కడిగిన నీటికి మరికొన్ని పదార్థాలను కలిపి చర్మం, శిరోజాలను సంరక్షించొచ్చని చెప్పినప్పుడు ఆశ్చర్యమేసింది. ఈ విధానాల మీద ఎనిమిది నెలలు పరిశోధన చేశా. ఆసియాలో ఎక్కడెక్కడ ఈ పద్ధతిని వినియోగిస్తారో తెలుసుకున్నా. దీనిపై సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నియమించుకొని మరీ పరిశోధనలు చేపట్టాం. వాటి ఫలితాల ఆధారంగా హెయిర్‌ ఆయిల్‌, షాంపూ, కండిషనర్‌, హెయిర్‌మాస్క్‌ వంటివి తయారుచేయగలిగాం. అమైనోయాసిడ్స్‌, బీ, ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఈ నీరు చర్మాన్ని, శిరోజాలను పరిరక్షిస్తుంది. మా ‘విష్‌కేర్‌’ ఉత్పత్తులపై వినియోగదారుల స్పందన సంతృప్తికరంగా ఉంది. అమెరికా, ఇంగ్లండ్‌ తదితర దేశాల నుంచీ.. ఆర్డర్లు వస్తున్నాయి. నాలుగేళ్లలో మా ఉత్పాదనల సంఖ్య 14కు పెంచుకోగలిగాం. త్వరలో సీరమ్‌, మాయిశ్చరైజర్స్‌, కండిషనర్లు కూడా తేనున్నాం’ అని వివరించింది స్తుతి. వీటి తయారీలో కేరళ కొబ్బరినూనె, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రోజ్‌వాటర్‌, రాజస్థాన్‌లో కలబందను సేకరించి మరీ ఉపయోగిస్తున్నారు. వీరి ఉత్పత్తులకు ఇప్పుడు నెలకు లక్షకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. స్తుతికి వ్యాపారంతో పాటు పర్యావరణమన్నా ఆసక్తే. అందుకే వినియోగదారుల నుంచి ఖాళీ అయిన తమ ఉత్పత్తుల సీసాలను సేకరించి, వాటిలోనే మళ్లీ నింపి ప్యాక్‌ చేస్తున్నారు. బదులుగా క్యాష్‌బాక్‌ ఆఫర్లు అందిస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడానికి ఇదో మార్గం అంటారు తను. అంతేకాదు... దేశవ్యాప్తంగా పలు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తూ వందల మంది నిరుపేద బాలికల విద్యకు నిధులను అందిస్తోంది తను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని