చేప చర్మంతో అంతర్జాతీయ వ్యాపారం!

చేప చర్మంతో యాక్సెసరీసా? మొదటి సారి దీని గురించి విన్నప్పుడు మయూర కూడా ఇలా¸ ఆశ్చర్యపోయింది. తర్వాత దీని గురించి తెలుసుకుని, వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడామె ఉత్పత్తులు దేశవిదేశాల్లో అమ్ముడవడమే కాదు.

Updated : 08 Jul 2022 02:32 IST

చేప చర్మంతో యాక్సెసరీసా? మొదటి సారి దీని గురించి విన్నప్పుడు మయూర కూడా ఇలా¸ ఆశ్చర్యపోయింది. తర్వాత దీని గురించి తెలుసుకుని, వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడామె ఉత్పత్తులు దేశవిదేశాల్లో అమ్ముడవడమే కాదు.. ఫ్యాషన్‌ వీక్‌ల్లోనూ మెరుస్తున్నాయి. ఆ విశేషాలేంటో చదివేయండి.

2015.. మయూరా షా ఐస్‌ల్యాండ్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆఫీసులో థాంక్స్‌ గివింగ్‌ ఈవెంట్‌! తోటి ఉద్యోగులు, స్నేహితులకు బహుమతుల కోసం స్థానిక మార్కెట్‌కి వెళితే అక్కడో బ్రేస్‌లెట్‌ ఆమెను ఆకర్షించింది. లెదర్‌లా ఉంది కానీ కాదు. అదే విషయాన్ని షాపు యజమానితో అంటే.. అది సాల్మన్‌ చేప చర్మంతో చేసిందన్నాడు. దాంతో తయారు చేసిన కొన్ని రకాల పర్సులు, బ్యాగులూ చూపించాడు. అవి ఆమెకు ఆశ్చర్యం కలిగించాయి. పూర్తిగా తెలుసుకోవాలనిపించి పరిశోధించింది. ఈ విధానాన్ని ఇక్కడ దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారని తెలిసింది. దాన్నే మన దేశంలోనూ ఎందుకు పరిచయం చేయకూడదు అనిపించిందామెకు. మయూరది మహారాష్ట్రలోని సోలాపూర్‌. ఇంజినీరింగ్‌ అయ్యాక ఉద్యోగం కోసం ఐస్‌ల్యాండ్‌ వెళ్లింది.
‘లెదర్‌ అంటే అప్పటివరకూ నాకు తెలిసింది జంతువుల చర్మమే. పైగా వీటి ప్రాసెసింగ్‌కి రసాయనాలు వాడాల్సి ఉంటుంది. చేప చర్మం సస్టెయినబుల్‌, రసాయనాల ప్రమేయం ఉండదు. ఇంకా పర్యావరణహితం. మన దేశంలోనూ దీన్ని పరిచయం చేయాలని.. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి 2018లో ‘మయూ’ని చెన్నైలో ప్రారంభించా. చేపల ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఒప్పందం చేసుకుని చిన్న చిన్న ఆక్సెసరీలు, పర్సులు, హ్యాండ్‌ బ్యాగులు తయారు చేయడం ప్రారంభించా. చర్మం స్థిరంగా, గట్టిగా ఉండదు. పైగా చిన్నచిన్నవే తప్ప పెద్దవాటిని తయారు చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా. పరిష్కారంగా చేప చర్మాల్ని ఒకదానితో ఒకటి జతచేస్తూ వెళ్లాం. దీంతో కావాల్సిన పరిమాణంలో తయారు చేసే వీలు దొరికింది. ఈ చర్మం కావాల్సిన పద్ధతిలో స్థిరంగా ఉండటానికి సస్టెయినబుల్‌ ఫిల్లర్‌ బోర్డులను సిద్ధం చేసుకున్నా. జీరో వేస్ట్‌ విధానాన్ని అనుసరిస్తున్నా. తయారీలో వృథా అయ్యే వాటిని ఎరువుగా మారుస్తున్నాం. కాలుష్య రహిత ఉత్పత్తులుగానూ మావి గుర్తింపు పొందాయి. అందుకే మా ఉత్పత్తులు మన దేశంలోనే కాదు... యూరప్‌, అమెరికాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాయి’ అని ఆనందంగా చెబుతోంది మయూరా.

లెదర్‌ ఉత్పత్తుల తయారీ అనగానే మగవాళ్లే గుర్తొస్తారు. దాన్నీ మార్చాలనుకొని తన సంస్థలో 90 శాతం మహిళలకే అవకాశమిస్తోంది. ఎంత కాలుష్య రహితమైనా చేపా జీవే అని ఆలోచించే వారికోసం వీగన్‌ ఉత్పత్తులపైనా దృష్టిపెట్టింది. అందరూ త్వరగా మట్టిలో కలిసిపోయే వాటికి ప్రాధాన్యమిస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చని హితవు పలుకుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్